తేలని లెక్కలు… వీడని చిక్కులు..

0

రోజులు గడుస్తున్నాయి… క్యాలెండర్‌లో తేదీలు కూడా మారిపోతున్నాయి.. కాని మహకూటమి పొత్తులు మాత్రం ఇప్పటికి ఒక్క కొలిక్కి వచ్చింది లేదు.. రోజు రేపు రేపంటూనే పొడిగిస్తున్నారు.. అభ్యర్థులను ప్రకటించకుండానే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల మహా సంగ్రామానికి పట్టుమని నెలరోజుల సమయం కూడా లేదు. వీరి సీట్ల పంపకం అయ్యెదెప్పుడో.. అందులో ఆసమ్మతి జ్వాలలు ఎన్నిరేగుతాయో.. అందివచ్చిన అవకాశం కోసం తెలంగాణ అధినేత కాచుక్కూని కూర్చున్నారు. ప్రతిపక్షాల సీట్ల పంపకం ఆలస్యమైతే తనకు అంత మంచిదనే ఆనందంతో ఎదురుచూస్తున్నారు.. మహకూటమి ఆలస్యం.. ఆ ఆలస్యంలో అనుకున్నవారికి రాని సీట్లు.. అవకాశం రాలేదని రెచ్చిపోయే ఆసమ్మతి నాయకులు.. వారంతా కుదుర్చుకునే సరికి ఎన్నికలో సమయం రానే వస్తుంది. వారికి వారికి జరుగుతున్న గొడవలో తెరాస జెండా ఎగరేసేలా ప్రణాళిలు సిద్దం చేస్తోంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రత్యేక ప్రతినిధి రాజేందర్‌ పల్నాటి..ఎన్నిలు అంటేనే మహసంగ్రామం.. సీట్ల ఎంపిక, ప్రచారం.. అభ్యర్థులు గెలిచేలా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మముందుకు సాగుతారు. ఎన్నికలు ఆరునెలలు ఉన్నాయనగానే అభ్యర్థులను ప్రచారం చేసుకొవాలని, ప్రజల్లోనే ఉండాలని చెబుతారు. అనుకున్నట్టుగానే తెరాస అధినేత కెసిఆర్‌ ఆసెంబ్లీని రద్దుచేయగానే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కిందా, మీదా పడుతూ వారి ప్రచారాన్ని వారు చేస్తున్నారు. కెసిఆర్‌ కంటే స్పీడుగా కాకున్నా కాస్త లేటయినా ప్రతిపక్షం అభ్యర్థులను నియమించడంలో రోజూ రేపే అంటుంది. తెరాస ప్రభుత్వం ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్షం మాత్రం అభ్యర్థులు లేకుండానే ప్రచారం చేస్తుంది. తెరాస పార్టీ ఓటమి లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకమై మహకూటమిగా ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసారని, అమరుల ఆశయాలను, నిరుద్యోగుల కలలను నేరవేర్చకుండా కెసిఆర్‌ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలా పోతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ద్రోహం చేసిన ద్రోహులకు పెద్దపీట వేసిందని ప్రతిఫక్షాలు, నిరుద్యోగుల ఆరోపణ. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చుతూ పేద ప్రజలకు సంబంధించిన పథకాలు, నిరుద్యోగులకు ఉద్యోగ నియమాకాలపై మాట తప్పిన తెరాస ప్రభుత్వాన్ని ఈ సారి గద్దెదించేందుకు ప్రతిపక్షాలు ఒక్కటిగా ఏర్పడి మహకూటమి అని నామకరణం చేశారు. అన్ని పార్టీలు ఏకమై పోటీలో దిగుతున్నాయని తెలిసేసరికి అధికారపక్షంలో ఉన్న తెరాస పార్టీకి కూడా వణుకు మొదలయ్యింది. మహకూటమిని వెనుకుండి శ్రీకృష్ణుడిలా చంద్రబాబునాయుడు నడిపిస్తున్నాడని తెలిసుకున్నా కెసిఆర్‌ ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తన నొటికొచ్చినట్లు మాట్లాడారు. మహకూటమి నుండి ఒక్కొక్కరిని విడదీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు తెరాస అధినేత కెసిఆర్‌. ఆసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి నెలదాటినా ఇప్పటివరకు మహకూటమిలో సీట్ల పంపకంపై ఇంకా కొలిక్కేరాలేదు..

ఎంత ఆలస్యమైతే కెసిఆర్‌కు అంతలాభం..

మహకూటమిలో సీట్లు ఎంత ఆలస్యమైతే కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్‌ శ్రేణులకు అంత లాభమని చెపుతున్నారు. కుంటి గుర్రాలో, గెలవలేని గుర్రాలో ఏదో ఒక గుర్రాన్ని ఐతే కెసిఆర్‌ బరిలో దిగుతున్నామని సవాలు విసిరాడు. అభ్యర్థులను ప్రకటించారు. ఆసెంబ్లీ రద్దును దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెరాస అభ్యర్థులు వ్యతిరేకత ఉన్నా కూడా పల్లెపల్లెకు తిరుగుతున్నారు. కాని అన్ని పార్టీలు ఏకమై ఏర్పాటు చేసుకున్న మహకూటమి మాత్రం సీట్ల పంపకం ఇంకా కొలిక్కిరాలేదు. డిల్లీ, గల్లీ అంటూ రోజులు దాటవేస్తూ తెరాసకు మంచి బలాన్ని ఇస్తుంది. తెలంగాణ ఎన్నికల రణరంగానికి ఇంకా పట్టుమని నెలరోజులు కూడా లేదు. కాని ఇంకా మహకూటమి పంచాయితీ తెగనేలేదు. వారి ఆలస్యం కెసిఆర్‌కు ఆనందంగా మారిపోయింది. మహకూటమి సీట్లు పంచుకునేలోపు తెరాస ప్రచారం ముగుస్తుంది. మేము మళ్లీ అధికారంలోకి వచ్చి సీట్లు పంచుకుని తింటామని కెసిఆర్‌ వ్యాఖ్యానించారు. వీరి తాత్సారం చూస్తుంటే కెసిఆర్‌ మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. మహకూటమి సీట్లు పంపకం లేటయితే, అవకాశాలు రాని వారు ఆసమ్మతులుగా మారిపోతారు. వారి గొడవ చినికి చినికి గాలివానగా మారిపోతుంది. అసమ్మతుల ఆవేశంతో వర్గాలుగా మారిపోతారు. ఓట్లు చీలిపోతాయి. అప్పుడు వారి మైనస్‌ తెరాసకు ప్లస్‌గా మారుతుంది. ఆసమ్మతుల ఆవేశం చల్లారేలోపు ఎన్నికల ముగుస్తాయి. తెలంగాణలో మళ్లీ తెరాసనే అధికారాన్ని దక్కించుకుంటుందని కెసిఆర్‌, పార్టీ నాయకులు ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు సమాచారం…

కలిసి ఉండలేరు.. విడిచి బతకలేరు అన్నట్టు ఉంది.

తెరాసను గద్దెదించాలి.. కెసిఆర్‌కు విశ్రాంతినివ్వాలి.. ఒక్కొక్కరు కంటే అందరూ ఏకమై కూటమిగా పోరాటం చేస్తేనే విజయం సాధించవచ్చని ప్రతిపక్షాలు అన్ని ఏకమై మహకూటమిగా ఏర్పడ్డాయి. మహకూటమికి అందరి అవసరం కావాలి. అందరి ఆలోచన, అందరి మద్దతు కావాలి. అంతా బాగానే ఉంది. కాని సీట్ల పంపకంలో మాత్రం ఏదోశక్తి వెనక్కి లాగుతున్నట్టు వాయిదా పడుతోంది. కోదండరాంను అవసరం ఎంతుందో అందరికి తెలుసు. ఆయన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అలాగని ఆడిగినన్ని సీట్లు ఇవ్వడానికి మనసొప్పడం లేదు. మొగుడి నుంచి ప్రేయ తప్ప ఖర్చులకు డబ్బులు రావడం లేదన్నట్లు ఉంది కోదండరాం పరిస్థితి. ఢిల్లీ వరకు వెళతున్నారు కాని గల్లీ సీట్ల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా సీట్లు కావాలని పట్టుబడుతుండగా సిపిఐ ఐదు ఇవ్వమని ఖరాఖండిగా చెబుతోంది. వీళ్ల సీట్ల పెంపకం ఎన్నికలైనా కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశమే లేనట్టుంది. టిఆర్‌ఎస్‌తో పోలిస్తే మహాకూటమి ప్రచారంలో చాలా వెనుకబడి ఉంది.

సగానికి పైగా నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ ప్రచారం ఇప్పటికే పూర్తి చేసుకుంది. కాని మహకూటమి అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రచారం మొదలుపెట్టలేదు. కూటమి పొత్తుల్లో అసలు నియోజకవర్గం సీటు మా పార్టీకి దక్కుతుందా… మా పార్టీకి దక్కుతుందా అనే అశతో ఎదురుచూడడం సరిపోతుంది. యాభై నియోజకవర్గాల్లో అభ్యర్థులకు అనుమానం ఉండడంతో ఎవరూ ముందుకు పోవడం లేదు. ప్రచారం చేయడం లేదు. వీరి వెనకబాటు వల్ల ప్రజలు టిఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే మహకూటమిని తట్టుకోవడం కెసిఆర్‌ వల్ల కాదని తెలుస్తోంది. కాకపోతే వీరి వెనకబాటు, సీట్ల పంపకంపై పెరుగుతున్న జాప్యత పెరిగిపోవడంతో ప్రతిపక్షనాయకులకు కూడా ఏమి తోచడం లేదు. మహకూటమి పార్టీల కేడర్‌ టిఆర్‌ఎస్‌ స్పీడు చూసి వణుకుతోంది. వాళ్లేమో దూసుకుపోతున్నారు, మనం ఇంకా వెనకబడిపోతున్నాము. మనం గెలవగలమా అనే సందిగ్దం ప్రతిపక్షపార్టీ నాయకుల్లో మొదలైనట్టు తెలుస్తోంది. తెరాసను గద్దెదించుతామని చెప్పుతున్న మహకూటమి చేజేతులా వీరే కెసిఆర్‌కు అధికారాన్ని అప్పజెప్పేలా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here