సాయి బోధనలు మానవాళికి ప్రేరణలు

0

ముంబయి : పేదల సంక్షేమం కోసమే ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందని, గత నాలుగేళ్లలో ప్రతి పథకాన్ని పేదవారిని దృష్టిలో ఉంచుకొని అమల్లోకి తెచ్చివేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రధాని షిర్డీ సాయిబా బాను దర్శించుకున్నారు. మహారాష్ట్ర పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆయన షిర్డీ వెళ్లి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మోదీకి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవైజీ) పథక లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందించారు. దాదాపు 2.50లక్షల మంది లబ్ధిదారులు ఇంటి తాళాలను అందుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరైన వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలన్నింటినీ ప్రజలతో జరుపుకొనేందుకే ఇష్టపడతానని ఆయన తెలిపారు. పలువురు పీఎంఏవైజీ లబ్ధిదారులతో మాట్లాడారు. నాగ్‌పూర్‌, థానే, లాథూర్‌, అమరావతి ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్య ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. చిన్నారులు చక్కగా చదువుకున్నప్పుడే భారతదేశం పేదరికాన్ని జయించగలదని ఆయన అన్నారు. పీఎంఏవై పథకం కింద నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 75వ స్వాతంత్య దినోత్సవం లోపు దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. పేదల సంక్షేమం కోసమే ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేదలకు కేవలం 25లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించి ఇచ్చింది. కానీ ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో 1.25కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చిందని ఆయన తెలిపారు.

మానవాళికి ప్రేరణనిస్తున్న సాయిబాబా బోధనలు..

షిర్డి సాయిబాబా సందేశాలు మానవాళికి ప్రేరణగా నిలిచాయని ప్రధాని మోదీ అన్నారు. బాబా బోధించిన విశ్వాసం, సహన సూత్రాలు మానవాళిని ఆకట్టుకున్నాయన్నారు. షిర్డీ వెళ్లిన మోదీ అక్కడ బాబా దర్శన అనంతరం విజిటర్స్‌ బుక్‌లో ఇలా రాశారు. సాయిబాబా దర్శనం తర్వాత తనకు ఎంతో మానసిక ప్రశాంతతకు గురైనట్లు చెప్పారు. విశ్వాసం, సహనంపై ఆయన చేసిన బోధనలు మానవాళికి ప్రేరణగా నిలిచాయన్నారు. సమానత్వానికి షిర్డి సాక్ష్యంగా నిలుస్తుందని, అన్ని మతాలకు చెందిన ప్రజలు బాబా ముందు వంగి నమస్కరిస్తారని ఆయన తెలిపారు. సాయిబాబా బోధించిన సబ్‌ కా మాలిక్‌ ఏక్‌హై అన్న సూత్రం ప్రపంచ శాంతికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భక్తులందరికీ సుఖసంతోషాలను ప్రదర్శించాలని సాయి పాదాలను వేడుకుంటున్నట్లు మోదీ బుక్‌లో రాశారు.

తృప్తిదేశాయ్‌ నిర్భందించిన పోలీసులు..

షిర్డీలో పర్యటించేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌ను అడ్డుకుంటామని ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్‌ ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నారు. మోదీని కలిసి శబరిమల వివాదం గురించి మాట్లాడాలని ఆమె తెలిపారు. ఒకవేళ మోదీని కలవనిచ్చేందుకు అనుమతించకపోతే.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుంటామని ఆమె బెదిరించారు. ఈ నేపథ్యంలోనే తృప్తి దేశాయ్‌ను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here