భారత్‌ ఐక్యంగా ఉందంటే.. పటేల్‌ చొరవే

0

అహ్మదాబాద్‌ : నేడు భారత్‌ ఐక్యంగా ఉందంటే అది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవ వల్లనేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేవడియాలో ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. దేశసమగ్రతకు కృషి చేసిన పటేల్‌ విగ్రహావిష్కరణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది సర్దార్‌ పటేల్‌ జయంతి మరింత ప్రత్యేకమైనదని, 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో నేడు ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించుకు న్నామన్నారు. నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహావిగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదని, భూమి పుత్రుడు సర్దార్‌ పటేల్‌ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వైనం మనకు కనిపిస్తోందన్నారు. ఆయన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ వుంటారన్నారు. ఐకమత్యానికి, మన మాతృభూమి భౌగోళిక సమగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ఐక్యతా విగ్రహం సంకేతంగా నిలుస్తోందని ప్రధాని తెలిపారు. అనైక్యత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమనీ, సమాధానం చెప్పుకోలేమనీ.. అదే కలిసి వుంటే ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తోందని అన్నారు. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగమించగల అని మోదీ పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్యం వచ్చిందని, నూతన ప్రస్థానం మొదలైందని కానీ ఆ సమయానికి జాతి నిర్మాణమనేది సుదూరంగానే వుండిపోయిందని మోడీ తెలిపారు. స్వాతంత్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి ¬ం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు సర్దార్‌ పటేల్‌ చేపట్టారన్నారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన పనిని ఎంతో ఖచ్చితత్వంతో, దృఢంగా, పరిపాలనాపరమైన సామర్థ్యంతో నిర్వహించారన్నారు. ఒకదాని తర్వాత మరొకటి…అప్పటికి వున్న అన్నిసంస్థానాలతో సర్దార్‌, ఆయన బృంద సభ్యులు సంప్రదింపులు జరిపి అన్నిటినీ భారతదేశంలో ఐక్యం చేశారన్నారు. సర్దార్‌ పటేల్‌ అవిశ్రాంతంగా పని చేయడంవల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్ర పటం ఆ ఆకారంలో మనకు కనిపిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. పటేల్‌ చొరవ లేకుంటే గుజరాత్‌ లోని గిర్‌ సింహాలను చూడటానికి, సోమనాథ్‌ ఆలయాన్ని, హైదరాబాద్‌ లోని చార్మినార్‌ ను సందర్శించడానికి కూడా భారతీయులు వీసా తీసుకోవాల్సి వచ్చేదని ప్రధాని మోదీ అన్నారు. పటేల్‌ దూరదృష్టి, తెలివితేటల కారణంగానే దేశంలో 562 స్వదేశీ సంస్థానాలను విలీనం చేయగలిగారని తెలిపారు. సర్దార్‌ పటేల్‌ పనిచేయకుంటే సివిల్‌ సర్వీస్‌ లో సంస్కరణలు ఉండేవి కాదనీ, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా సరిగ్గా రైల్వే లైన్‌ కూడా ఉండేది కాదని మోదీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో మహిళలు పోటీచేసేలా పటేల్‌ చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. పటేల్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here