రణరంగంగా మారిన శబరిమల

0

తిరువనంతపురం : కేరళలో బంద్‌ ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు బంద్‌ నేపథ్యంలోరోడ్లపైకి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. త్రిశూర్‌లోని ఓ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. తిరువనంతపురం, కాలికట్‌, మలప్పురం ప్రాంతాల్లోనూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డకొని, పలువురు భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.బంద్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలు పరీక్షలు వాయిదా వేశాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేరళకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. బంద్‌ సందర్భంగా జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచే బంద్‌లో ప్రజలు పాల్గొన్నారు. పలుచోట్ల పవిత్ర శబరిమల అయ్యప్ప ఆలయాన్ని 50 ఏళ్ల వయసులోపు మహిళలు ఇద్దరు దర్శించుకోవడం భక్తుల ఆందోళనకు దారితీసింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం నుంచి మొదలైన ఆందోళనలు గురవారం తారాస్థాయికి చేరాయి.శబరిమల కర్మ సమితి, అంతరాష్టీయ్ర హిందూ పరిషత్తు (ఏహెచ్‌పీ) పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. ఆందోళనకారుల అల్లర్లతో ఈ బంద్‌ ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మొహరించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే బంద్‌ కొనసాగుతోంది. మరోవైపు ఆందోళనల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఘర్షణల్లో పండలం ప్రాంతంలో సీపీఎం, భాజపా కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన చంద్రన్‌ ఉన్నితన్‌ అనే వ్యక్తి చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు. చంద్రన్‌ శబరిమల కర్మ సమితి సభ్యుడు. చంద్రన్‌ మృతిపై భాజపా తీవ్రస్థాయిలో మండిపడింది. అయ్యప్ప భక్తుడిని చంపేశారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది.

బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై సిఎం ధ్వజం… అయితే భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కావాలనే ఆందోళనలకు దిగుతూ కేరళను రణరంగంగా మారుస్తున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. బంద్‌పై గురువారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడారు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారని హిందూ సంఘాలు హర్తాళ్‌ చేపట్టాయి. దీని అర్థం సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్లే. శబరిమలకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. మా బాధ్యతను మేం నిర్వర్తించాం. శబరిమల వెళ్లేందుకు తమకు భద్రత కావాలని ఆ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. సుప్రీం తీర్పు మేరకు పోలీసులు భద్రత కల్పించారు. ఇతర భక్తుల్లాగే మహిళలు కూడా కాలినడకన వెళ్లారు. మార్గమధ్యంలో అయ్యప్ప భక్తులు వీరికి సాయం చేశారు. ఎవరూ అడ్డుకోలేదు. కానీ ఎప్పుడైతే వార్త విూడియాలో వచ్చిందో అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయని విజయన్‌ చెప్పుకొచ్చారు.

నిజమైన అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళనలు చేయడం లేదని, కానీ కొందరు రాజకీయ కుట్రతో ఈ ఆందోళనలకు దిగుతున్నారని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌పై సీఎం విజయన్‌ విమర్శలు చేశారు. 'భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం కేరళను రణరంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. హిందూ సంఘాల కార్యకర్తలు పలు చోట్ల విధ్వంసం సృష్టించారు. 7 పోలీసు వాహనాలు, 79 ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేశారు. 39 మంది పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. బాధితుల్లో చాలా మంది మహిళలే. మహిళా జర్నలిస్టులపై కూడా దాడి చేశారని విజయన్‌ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయన్‌ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here