Featuredస్టేట్ న్యూస్

ఆర్టీసీ సమ్మె@ 40..

  • 26 డిమాండ్లు.. చర్చలు విఫలం
  • కార్మికుల బలవనర్మణాలు
  • స్పందించని ప్రభుత్వం
  • హైకోర్టును లెక్కచేయని కేసీఆర్‌

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారంతో సమ్మె 40వ రోజుకు చేరుకుంది. డిమాండ్లపై కార్మిక జేఏసీ పట్టువీడకపోవడం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని ప్రభుత్వం భీష్టించుకొని కూర్చొవడంతో.. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. గత 40 రోజుల నుంచి ప్రగతి రథ చక్ర సారథులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. మధ్యలో హైకోర్టు కలుగజేసుకున్న డిమాండ్లపై ఇరువర్గాలు రాజీకి రాకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్‌, ఐఆర్‌ ఇవ్వాలనే 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ ఉంచింది. హైకోర్టు స్పందనతో ప్రభుత్వం ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చల ప్రక్రియ చేపట్టింది. అయితే చర్చల్లో భాగంగా మొబల్స్‌ తీసుకెళ్లొద్దని, తదితర ఆంక్షలు విధించింది. అయినా కార్మిక జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న డిమాండ్లు కాకుండా 21 డిమాండ్లు నెరవేర్చేందుకు సిద్ధమని రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ పేర్కొన్నారు. తమ ప్రధాన డిమాండ్లు తీర్చమని కార్పొరేషన్‌ స్పష్టంచేయడంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా యూనియన్‌ నేతలు బయటకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కలుగజేసుకొంది. కార్మికుల డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో సీఎం కేసీఆర్‌ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని కూడా ఆహ్వానించారు. కానీ కేసీఆర్‌ పిలుపునకు కూడా కార్మికుల నుంచి స్పందన రాలేదు. మరోవైపు హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై దఫా దఫాలుగా విచారిస్తోంది. ఆర్టీసీ యూనియన్‌, ప్రభుత్వానికి సూచనలు చేస్తోంది. సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించాలని మంగళవారం కూడా సూచించింది. దీనిపై కొనసాగుతుండగానే మరోవైపు జీతాలపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశమైనందున స్టే విధించింది. బుధవారం పిటిషన్‌ విచారణకు వచ్చింది. అయితే గురువారం వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. మరోవైపు ఆర్టీసీ విభజన జరగలేదనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. 9వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజన జరిగిందని.. కేంద్రం అప్పుడే నోటీ ఫై చేసిందని ఇదివరకు మీడియా సమావేశంలో కేసీఆర్‌ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత సమయంలో రాకుంటే మరో 5100 బస్సులను కూడా ప్రైవేట్‌ వారికి అప్పగిస్తామని హెచ్చరించారు. కానీ సీఎం కేసీఆర్‌ ఆదేశాలను కార్మిక జేఏసీ లెక్కచేయలేదు. దానిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసు వేయడంతో కార్మికులకు అనుకూలంగా కోర్టు స్పందించింది. దీనిపై గురువారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.

దీక్షలు, సభలు, చలో ట్యాంక్‌బండ్‌

కార్మికులు మాత్రం తమ ఉద్యమ కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. డిపోల వద్ద ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా దీక్షలు కూడా చేపట్టారు. కార్మికులకు విపక్షాలు మద్దతు తెలిపాయి. మరోవైపు అక్టోబర్‌ 30వ తేదీన సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆర్టీసీ కార్మికులు సమరభేరీ సభ నిర్వహించారు. విపక్ష నేతలంతా హాజరై తమ మద్దతును తెలిపారు. సీఎం కేసీఆర్‌ నియంతృత్వ వైఖరిని ఎండగట్టారు. ఇటీవల పిలుపునిచ్చిన చలో ట్యాంక్‌బండ్‌కు కూడా విశేష స్పందన వచ్చింది. ప్రజాసంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ దమననీతిని ఎండగట్టారు. మిలియన్‌ మార్చ్‌ను తలపించేలా నిర్వహిస్తామనుకొన్న ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఓ వైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా.. కొందరు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. డ్యూటీ లేక, జీతం రాక ఇబ్బందిపడ్డారు. ఇప్పటివరకు 20 మంది పైచిలుకు డ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. పెద్ద దిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. మరికొన్ని కుటుంబాలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నాయి. ఆయా కుటుంబాలకు అండగా ఉంటామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చెబుతోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close