Featuredస్టేట్ న్యూస్

ఇక పర్మినెంట్‌

  • ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజ్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • పదిరోజుల్లోనే కార్యచరణ
  • మృతి చెందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు

ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక ఉద్యోగులుగా చేస్తున్న 296 మంది డ్రైవర్లు, 63 కండక్టర్లను రెగ్యులరైజ్‌ చేస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో సుమారు 240 రోజుల పాటు ఉద్యోగం చేసిన వారిని రెగ్యులరైజ్‌ చేసినట్టుగా ప్రకటించింది. తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె తర్వాత అనేక కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో నేరుగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం కార్మికుల తరఫున పోరాటం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులే కారణమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో విలీన ప్రతిపాదనతో సమ్మెకు దిగిన కార్మిక సంఘాల నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఈ నేపథ్యంలోనే కార్మికులతో నేరుగా సీఎం కేసీఆర్‌ సమావేశం అయ్యారు. అనంతరం వారికి అనేక వరాలు ప్రకటించారు. ప్రధానంగా తాత్కలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం, సమ్మెలో భాగంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు మహిళలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం అందుకు సంబంధించి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులకు రాత్రి ఎనిమిది గంటల వరకే డ్యూటీలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కార్మికుల సంక్షేమం కోసం ప్రతి డిపోలో సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేశారు. ఇలా రెండు సంవత్సారాల పాటు యూనియన్లు లేకుండా పనిచేసి… అనంతరం పరిస్థితిని బట్టి ఆర్టీసీపై మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అంత్యంత వేగంగా సమ్మె కాలంలో మృత్యువాత పడిన కార్మికుల పిల్లలకు కేవలం పది రోజుల్లోనే వారికి ఉద్యోగాలు కల్పించారు. మొత్తం సమ్మె కాలంలో 38 మంది కార్మికులు చనిపోగా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే కారుణ్య నియామాకాలు కొన్ని సంధర్భాల్లో సంవత్సరాలుగా సమయాన్ని తీసుకునే పరిస్థితి ఉండేది. అది ఆర్టీసీలో అయితే ఇంకా సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంటుంది. కానీ సంస్థను మెరుగైన దిశగా తీసుకువెళ్లేందుకు అధికారులు సైతం వేగంగా పెండింగ్‌ పనులను పూర్తి చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాత్కలిక ఉద్యోగులను కూడ రెగ్యూలరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు

ఆర్టీసీ ఉద్యోగులు తమ హక్కులను సాధించడం కోసం 55 రోజుల పాటుగా సమ్మెను నిర్వహించారన్న విషయం అందరికీ విదితమే. ఈ సమ్మె కాలంలో చాలా మంది కార్మికులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. దీంతో ఆ బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా ఆలోచనలను తలపెట్టింది. మరణించిన కార్మిక కుటుంబాలలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తానని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా టీఎస్‌ఆర్టీసీ అధికారులు కార్యాచరణను మొదలు పెట్టారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో మృతి చెందిన 33 మంది ఉద్యోగుల పిల్లలకు వారి వారి విద్యార్హతలను బట్టి ఆర్టీసీలో కొలువులు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అంతే కాకుండా మృతి చెందిన 38 మంది ఉద్యోగులకు సంబంధించిన 22 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు. ఈ నష్టపరిహారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు అందించారు. మిగిలిన 16 కుటుంబాలకు చెందిన వారికి ఈ సోమవారం లోపు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఇప్పటి దాకా రాత్రి 10 గంటల వరకూ పనిచేసే మహిళల పనివేళలను కుదించారు. వారు రాత్రి 8 గంటల్లోపే ఇంటికి వెళ్లే విధంగా షెడ్యూలు సర్దుబాటు చేయాలని సునీల్‌శర్మ డిపో మేనేజర్లను ఆదేశించారు. మహిళా ఉద్యోగుల సౌకర్యార్ధం ఈ నెల 15 లోపు హైదరాబాద్‌ నగరంలో విశ్రాంతి గదులతో పాటు, డిపోలు, హైదరాబాద్‌ సిటీ చేంజ్‌ ఓవర్‌ పాయింట్ల వద్ద మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లను ఆదేశించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close