Featuredజాతీయ వార్తలు

‘రూ.7వేల కోట్ల మోసం’ సిబి’ఐ’ రూ.1,60,978 కోట్ల సంగతేమిటి..?

  • ఏకకాలంలో 187 కేంద్రాల్లో సోదాలు
  • బినావిూల గుర్తింపు
  • దర్జాగా సొత్తు కాజేసిన రాజకీయులు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అడిగేవారు లేరు.. పట్టేవారూ లేరు..ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దొంగలు పడ్డారు.. పట్టపగలు లక్షల కోట్లు దోపిడీ నిశ్శబ్దంగా జరిగింది. బ్యాంకులను అడ్డుగా పెట్టు’కొని’ అడ్డంగా దోచేశారు. ఇందులో ఎక్కవమంది రాజకీయ దళారులు, వారి బినావిూలు ఉన్నారు. ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ దౌర్భాగ్య బృందాలలో రాజకీయులు నేరుగా ఉండటం గమనార్హం. దేశీయ బ్యాంకులలో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టడానికే ఏకంగా డొల్ల కంపెనీలను పెద్ద ఎత్తున సృష్టించారు. ఇందులో మహిళా రాజకీయ వేత్తలు సైతం ఉన్నారు. అక్షరాల ఒక లక్ష 60వేల 978కోట్లు దోచేస్తే… కేవలం 7వేల కోట్లకు సంబంధించి దాడులు చేసిన సిబిఐ… ఏదో ‘ఘనకార్యం’ చేసినట్లు పక్కవాడి జబ్బలు కొడుతూ… ఆనందపడుతోంది. రైతులు నెలసరి బకాయిలు చెల్లించకుంటే ఊళ్ళో దండోరాలు.. ‘జప్తు’ పేరుతో ఇంటి తలుపులు ఊడబెరికి మరీ పరువుతీయటాలు… వీలైతే రైతున్నల చేతుల, కాళ్ళ వేళ్ళ గోళ్ళు ఊడగొట్టి భయంకరంగా వసూళ్ళు చేస్తారే… మరి ఈ బడా నాయళ్ళ సంగతేమిటి..? రాజకీయలకు బ్యాంకు అధికారుల మధ్య ఉన్న చీకటి సంబంధాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయి. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.

ఇదీ జరిగింది: దేశవ్యాప్తంగా 1,60,978 కోట్ల మొండి బకాయిలు బ్యాంకులలో పేరుకు సిగ్గూఎగ్గూ లేకుండా ఈ సొత్తు ఎగ్గొట్టడానికి రంగం సిద్ధమైంది. ఇందులో తెలంగాణలో 5,914 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ లో 11,750 కోట్లు ఉన్నాయి. వందకోట్ల పైగా జనాభా కలిగిన భారతదేశంలో కేవలం 6,884 మంది ఘనాపాఠీలకు చెందినదే.! ఇది ఎవరి సొమ్ము? పన్ను కట్టిన 99శాతం పేద, మధ్య తరగతుల వారిదే.! వీరి కష్టార్జితంతో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడా మోసగాళ్లదా? ఈ పాపంలో ఎవరెవరిది ఎంతెంత భాగం? అందులో రాజకీయుల అగ్ర కుభస్థలం కొట్టేది ఎప్పు..? అది ఎవరు..?

ఇప్పుడేం జరిగింది: కేంద్ర దర్యాప్తుసంస్థ బ్యాంకుల్లో మోసాలు చేసిన వారి కేసుల దర్యాప్తును వేగవంతంచేసింది. ఏడువేల కోట్ల విలువైన బ్యాంకు మోసాల కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మంగళవారం సుమారు 187 కేంద్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సిబిఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు న్యూఢిల్లీలో ‘ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి’తో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛండీఘర్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, కేరళ,మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దాద్రా నాగర్‌ హవేలి రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిందని చెపుతున్నారు. ఎక్కువగా బ్యాంకుల్లో జరిగిన మోసాలపైనే సిబిఐ అదికారులు ఈ దాడులు నిర్వహించారు. వారిలో ఎక్కువగా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ వర్గాలే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. వీటిలో రాజకీయ నేపథ్యం ఉన్న కేసులు కూడా లేకపోలేదు. గడచిన రెండు దశాబ్దాలుగా పేరుకున్న బకాయిలు రికవరీ కోసం కొన్ని ఎన్‌.సి.ఎల్‌.టికి దాఖలయితే మరికొన్ని బ్యాంకులే స్వయంగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కేసులు దర్యాప్తు చేయగా మరికొన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ లు నమోదుచేసి దాడులు చేస్తోంది.

‘పద్మ’ అవార్డు గ్రహీతలూ… పక్కా స్కెచ్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోనే 904 మంది రుణగ్రహీతలు 10,869 కోట్లను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారు. ఈ జాబితాలో దేశంలోని 10 ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఒక్క కింగ్‌ ఫిషరే రూ.1500 కోట్లపైగా ఎగవేసింది. వారు వీరనే తేడా లేదు.. బ్యాంకులను ముంచటంలో అందరూ ఘనాపాటీలే. పద్మ అవార్డులు పొందిన ఇద్దరు పెద్దలు కూడా బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా భారీ మొత్తాలు ఎగవేసిన జాబితాలో ఉన్నారు. రుణగ్రహీతలు, రాజకీయనాయకులు, బ్యాంకు అధికారుల మధ్య ఉన్న చీకటి సంబంధాలు బ్యాంకుల ఆస్తులను కొల్లగొడుతున్నాయనే విమర్శ ఉంది.

బుల్లెమ్మ ఆస్తులు జప్తు..!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. శశికళకు చెందిన రూ.1600కోట్ల విలువచేసే ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ సోమవారం జప్తు చేసింది. బినావిూ ఆస్తుల నిషేధ చట్టం కింద వీటిని అటాచ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆమె ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలో మొత్తం తొమ్మిది ఆస్తుల్ని జప్తు చేశారు. ఈ విషయాన్ని శశికళకు కూడా తెలియజేసినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బెంగళూరులోని అగ్రహారం జైలులో 2017నుంచి ఆమె శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 2016లో నోట్ల రద్దు తర్వాత పలువురు బినావిూల పేరిట శశికళ రూ.1500కోట్ల విలువ చేసే ఆస్తుల్ని కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాల్లో తొలిసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close