చేవెళ్ల లోక్‌ సభపై గులాబీ నేతల నజర్‌

0
  • టీఆర్‌ఎస్‌లోనే పోటాపోటీ
  • తెరపైకి శాసనమండలి చైర్మన్‌ పేరు..!
  • ముఖ్యమంత్రి నిర్ణయం పై ఎదురుచూపు..!!

హైదరాబాద్‌ : తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలతో పాటు అదికార పార్టీలో సైతం పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంపై ముఖ్య నేతలు ద ష్టి పెట్టారు. రాజకీయ హేమాహేమీలు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్‌సీట్‌గా మారిన ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుంచి పోటీచేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ అధినేత గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే కదనరంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా చేవెళ్ల టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గులాబీ ఖాతాలో ఉండడంతో ముఖ్యనేతలు ఆ సీటుపై పట్టుబడుతున్నారు. స్వామిగౌడ్‌, పట్నం మహేందర్‌రెడ్డి మద్య తీవ్ర పోటీ..! మరి చేవెళ్ల ఎవరికో..!! తెలంగాణ లోక్‌ సభ స్ధానాల్లో చేవెళ్ల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ లోక్‌ సభ సీటునై అటు అదికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలో సైతం తీవ్ర పోటీ నెలకొంది. గులాబీ పార్టీలో మొన్నటి వరకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్‌ దాదాపు ఖరారు అని విస్త త ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నేత, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అవకాశమిస్తే చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో స్వామీ గౌడ్‌ కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ కోసం ప్రయత్నించినా ఆయనకు దక్కలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌కు ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో స్వామిగౌడ్‌ వెనక్కితగ్గారు. ఈ సమయంలో ‘భవిష్యత్‌లో చూద్దాం’ అని స్వామిగౌడ్‌కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే ధీమాతో చేవెళ్ల పార్లమెంట్‌ టికెట్‌ కోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. చేవెళ్లలో పని చేసుకుంటున్న పట్నం..! అయినా ఇంతవరకూ హామీ లేదు..!! మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంపై ద ష్టి కేంద్రీకరించారు. ఈ స్థానం తనకేనని సంకేతాలిస్తున్న ఆయన, కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీటుపై ఎవరి ధీమా వారిదే..! గులాబీ నేత ఎవరిని కరుణిస్తాడో..!! కొండా కూడా బలమైన నేత కావడంతో టీఆర్‌ఎస్‌ నుంచి పటిష్ట క్యాడర్‌ ఉన్న మహేందర్‌రెడ్డినే బరిలోకి దించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో స్వామిగౌడ్‌ పేరు తెరమీదకు రావడంతో టికెట్‌ కోసం పోటీ తప్పేలా లేదు. టికెట్‌ కేటాయింపుపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తమ నేతకు హామీ ఇచ్చినట్లు మహేందర్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చేవెళ్ల టికెట్‌ అధికార పార్టీ నుంచి ఎవరికి దక్కుతుందో అన్న అంశం పై ఉత్కంఠ తారా స్థాయిలో కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here