24 గంటల్లోనే ప్రతీకారం తీర్చుకున్నారు..

0

  • నీడను చూసుకుని భయపడుతున్న మమత
  • బెంగాల్‌ కన్నా కాశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు
  • తన ఎజెండాను అమలు చేస్తున్న బెంగాల్‌ సిఎం
  • అమిత్‌షాపై దాడిని తీవ్రంగా ఖండించిన మోడీ

న్యూఢిల్లీ :

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీపై ప్రధాని మోడీ ఫైర్‌ అయ్యారు. ఎన్నికలు రాగానే దీదీ తన నీడను చూసి తానే భయపడుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. మమతాబెనర్జీ రెండు రోజుల క్రితం జరిగిన ఘటనతో తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు బహిరంగంగా ఒప్పుకున్నారన్నారు. రోడ్‌ షోలో అమిత్‌ షాపై దాడి చేయించి 24 గంటల్లోనే దీదీ తన ఎజెండాను నెరవేర్చుకున్నారని మోడీ విమర్శించారు. మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్‌ చేసిన కేసులో బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ అరెస్టయిన నేపథ్యంలో.. దీదీ ఒక్క ఫొటో కోసమే ఇంత రాద్దాంతమా..? కూతుళ్లను జైలుకు పంపిస్తున్నారు. మీకు తగిన గుణపాఠం చెప్తామని మోడీ హెచ్చరించారు. మీరు మంచి ఆర్టిస్ట్‌ అయితే నా ఫొటోను చిత్రించి..ఈ నెల 23 తర్వాత నాకు ప్రజెంట్‌ చేయండి. ఒకవేళ మీరు వేసిన బొమ్మ చెత్తగా ఉన్నా..నేను మీపైన ఎలాంటి కేసు వేయనని హామీనిస్తున్నానని దీదీకి ప్రధాని మోడీ చురుకలంటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్‌ షోలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ దశలో మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ తాజా విమర్శలు గుప్పించారు. పశ్చిమబెంగాల్‌లో కంటే జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవాళ్లు, తటస్థంగా వ్యవహరించే వాళ్లు బెంగాల్‌ హింసాకాండపై మౌనముద్ర దాల్చడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. కోల్‌కతాలో అమిత్‌షా మంగళవారం జరిగిన రోడ్‌షో సందర్భంగా చెలరేగిన హింసాకాండ అనంతరం బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ కలిసేందుకు సిద్ధమవుతుండగా, పశ్చిమబెంగాల్‌లో రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కోరింది. పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిని జమ్మూకశ్మీర్‌తో పోల్చిన మోడీ… జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు బెంగాల్‌ కంటే ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ‘కశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క పోలింగ్‌ బూత్‌లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. అదే సమయంలో జరిగిన బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో పలువురు వ్యక్తులు హతమయ్యారు. గెలిచిన కొందరి ఇళ్లు తగులబెట్టి, జార్ఖండ్‌, ఇతర రాష్ట్రాలకు వాళ్లను పారిపోయేలా చేశారు. వాళ్లు తప్పిదమల్లా ఎన్నికల్లో గెలవడమే’ అని మోడీ చెప్పారు. బీజేపీ, వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌ సైతం ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ, తటస్థంగా ఉన్నామని చెప్పుకున్న వాళ్లు మాత్రం మౌనంగా ఉండిపోయారని, చివరకు బీజేపీ ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ను కూడా బెంగాల్‌లోకి అనుమతించలేదని, బీజేపీ ర్యాలీలను కూడా అనుమతి ఇవ్వడం లేదని మోడీ పేర్కొన్నారు. బీజేపీకి, లెప్ట్‌కి లేదా కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ బయపడుతుండటమే ఇందుకు కారణమని ప్రధాని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here