మరకత రత్నం మాయం

0

  • బాసర అమ్మవారి వజ్రం ఏమైందీ!
  • కమిటీ ఏర్పాటుతో కలకలం
  • విచారణకు ఆదేశించిన మంత్రి అల్లోల

ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌ విగ్రహం మకుటంలోని ఓ వజ్రం కనిపించకుండా పోయింది. నవరత్నాలతో కూడిన అమ్మవారి కిరీటంలో ఓ కెంపు గల్లంతయినట్లు గుర్తించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కాస్తా వివాదాస్పదంగా మారింది…

బాసర (ఆదాబ్‌ హైదరాబాద్‌): నిర్మల్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్‌ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ వజ్రాలు పొదిగిన మకుటంతో దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన అమ్మవారు.. అధికారులు, పూజారుల నిర్లక్ష్యంతో బోసిపోయింది. ఆలయంలో అమ్మవారికి అలంకరించే బంగారు కిరీటంలోని మరకతం (పచ్చ) గత కొంతకాలంగా కనిపించటం లేదు. 2006లో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించారు. ప్రతిరోజు అభిషేకం అనంతరం అమ్మవారికి బంగారు కిరీటం అలంకరిస్తారు. కిరీటంలో నాలుగు మరకతాలు, నాలుగు వజ్రాలు, ఒక కెంపు పొదిగి ఉన్నాయి. అందులో ఒక పచ్చ గత కొంతకాలంగా కనిపించటం లేదు. అయినప్పటికీ ఇక్కడి పూజారులు అధికారులు వజ్రం గురించి పట్టించుకోవడం మర్చిపోయారు. ఏటా కోట్లలో ఆదాయం వస్తున్నా.. అమ్మవారి మూలవిరాట్‌కు ఓ వజ్రాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు అధికారులు. పైగా పూజారులు రోజు వారీగా అభిషేకం చేస్తున్న సమయంలో ఎక్కడో పడి పోయిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. కొన్నిరోజుల నుంచి వజ్రం లేని కిరీటాన్నే అమ్మవారికి అలంకరిస్తున్నారు. తరచూ బాసర ఆలయంలో వివాదాలు ఏర్పడుతున్నా.. ఇక్కడి అధికారులు, పూజారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. బాసర అమ్మవారి గుళ్లో గతంలో కూడా 2,3 సార్లు అపచారం జరిగింది. ఒకసారి అమ్మవారి విగ్రహాలను దేవరకొండకు తరలించారు. మరోక సారి అమ్మవారి ముక్కుపుడుక మాయం కావటం జరిగింది. ఆసమయంలో సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అమ్మవారి కిరీటంలో వజ్రం కనపడకుండా పోయింది. అయితే అది 2013 లోనే పోయిందని పూజారులు నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారు. ఇన్ని రోజులుగా ఈ విషయం గోప్యంగా ఉంచారు. ఈ విషయం 2 రోజుల క్రితం మళ్లీ చర్చకు రావటం జరిగింది. దీనిపై ప్రస్తుతం ఆలయంలో విచారణ జరుగుతోంది.

కిరీటంలో వజ్రం గల్లంతుపై విచారణకు మంత్రి ఆదేశం.. బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం కావడంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. వజ్రాన్ని ఎవరైనా దొంగిలించారా లేక ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగేటప్పుడు జారి పడిపోయిందా అనేది తేలాల్సి ఉంది. బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం గల్లంతైన విషయమై విూడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సోమవారం నాడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వజ్రం మాయమైన ఘటనపై బాధ్యులపైచర్యలు తీసుకోవాలని కూడ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. బాసర ఆలయంలో చోటు చేసుకొంటున్న ఘటనలు వివాదానికి కారణంగా మారుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here