జీవనశైలి

రామగిరి జలపాతాల సిరి

అన్నట్టు.. ఈ వారాంతం ఎక్కడ విహరించాలనుకుంటున్నారు? సముద్రం ఒడ్డున.. వెన్నెల్లో.. దూరంగా చంద్రుడు.. దగ్గరగా నువ్వు.. అప్పుడప్పుడు పలుకరించి వెళ్లే గాలి.. వచ్చే ప్రతి అల మన కాళ్లని తాకుతూ అల్లరి చేస్తున్నప్పుడు.. అలాంటి చోటయితే…? ఆగండాగండి.. అలాంటి చోటు కాదు.. అంతకంటే అందమైంది.. ఎక్కువ అనుభూతిని ఇచ్చేది.. సీతమ్మ ధార జలపాతం. ఈ వానలు తగ్గితే మళ్లీ చూడలేరు. అందుకే ఈ వీకెండ్‌ ఇక్కడకి ప్లాన్‌ చేసుకోండి. జలపాతాల సిరి రామగిరి ఖిల్లా సమీప అందాలు ఈ వారం విహారంలో వీక్షించండి.

శిల్ప కళకు ఒడి

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతున్నది. పర్యాటకులను ఆహ్లాదపరుస్తూ అలరిస్తున్నది. శిల్ప సాంస్క తిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడ నిర్మింపజేసిన రాతి కట్టడాలు అప్పటి శిల్పకళానైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

చూడాల్సిన ప్రదేశాలు

రామగిరి దుర్గంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల, కొలువుశాల, మొఘల్శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యా టకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.

రాయికల్‌ జలపాతం

కరీంనగర్‌ జిల్లా సైదాపురం మండలంలోని రాయికల్‌ గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతమిది. వరంగల్‌ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో వరంగల్‌ అర్బన్‌ కరీంనగర్‌ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలోని కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. 170 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతుండే ఈ జలపాతం పర్యాటకులకు, ప్రక తి ప్రేమికులకు కనులవిందును కలిగిస్తుంది.

రామగిరి ఖిల్లా పరిసరాల్లో అనేక జలపాతాలున్నాయి. వర్షాకాలం ప్రారంభం, శ్రావణమాసం రాగానే ఈ జల పాతాలు కనువిందు చేస్తాయి. ఎత్తయిన కొండలోంచి గలగలా కిందికి దూకుతూ పర్యాటకులను అలరిస్తాయి. సీతమ్మధార, పాండవుల లంక. కంకలోయ, లొద్ది, హవేలిమూల వంటి జలపాతాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. వీటికి తోడు పెద్దపల్లి జిల్లా సబితంలో గౌరిగుండాల జలపాతం, రామగుండంలో రామునిగుండాల, సీతమ్మ కొల్లుగుంట, పులిగుండం, రాయికల్‌లో రాయికల్‌ జలపాతం పర్యాటకులను అలరిస్తున్నాయి. రామగిరి ఖిల్లాను సందర్శించాలనుకునే వారు ఈ ప్రాంతాలను కూడా చూడవచ్చు.

శ్రావణ మాసంలో సందడే సందడి

వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో.. ప్రతి శ్రావణమాసంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ప్రక తి అందచందాలను తిలకిస్తూ పర్యా టకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూలికలను సేకరిస్తారు. కొండపై ఉన్న కోట, దర్శనీయ ప్రాంతాలు, కొండ గుహలో కొలువైన సీతారాములను దర్శించుకోవాలంటే దాదాపు 16 కి.మీ. కొండమీదనే పయనించాల్సి ఉంటుంది.

రాముని గుండాలు

రామగుండం గుట్టపైనున్న చెరువు నిండి పొంగే ప్రవాహం ఉత్తరం వైపునకు లోయ మార్గంలో ప్రవహిస్తూ ఒక కొండ కొన మెట్ల మీద నుంచి దుముకుతూ మూడు నాలుగు దఫాలుగా చిన్న చిన్న జలపాతాల్లాగా దర్శనమిస్తాయి. ఇవే రాముని గుండాలు.

గౌరీ గుండం

సబ్బితం సమీపంలో సుమారు 150 అడుగుల ఎత్తున కొండలపై నుండి నేలకు దుముకుతున్న ట్టుండే సుందర ద శ్యం ఈ జలపాతం సొంతం.

ఖిల్లాకు వెళ్లాలంటే?

పెద్దపల్లి జిల్లాకేంద్రం నుంచి తూర్పు దిశగా మంథని, కాళేశ్వరం వెళ్లే రహదారిలో 58 కిలోమీటర్ల దూరంలో ఉంది రామగిరి దుర్గం. కమాన్‌పూర్‌ మండలంలోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళితే రామగిరి ఖిల్లాకు చేరుకోవచ్చు. ఈ రామగిరి ఖిల్లా పూర్తిగా చూడాలంటే కనీసం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట – బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close