Featuredఅంతర్జాతీయ వార్తలు

శ్రీలంక ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం

కొలంబో: పొరుగున ఉన్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కౌంటింగ్‌ ప్రతిదశలోనూ రాజపక్స ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్‌ ప్రేమదాసపై పైచేయి సాధించారు. అధికారికంగా రాజపక్సే గెలుపును సాయంత్రానికల్లా ప్రకటించనున్నారు. అయితే రాజపక్స గెలిచినట్టు ఇటు ఎస్‌ఎల్‌పీపీ, యూఎన్‌పీలు ధృవీకరించాయి. ఆదివారం ఉదయం 11 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్స 52.87 ఓట్లు గెలుచుకోగా, గృహ మంత్రి సజిత్‌ ప్రేమదాసకు 39.67 శాతం, లెఫ్టిస్ట్‌ అనుర కుమార దిస్సానాయకె 4.69 శాతం ఓట్లు పొందినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. శ్రీలంక పోడుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) అభ్యర్థిగా ఎన్నికల్లోకి దిగిన 70 ఏళ్ల రాజపక్స దేశానికి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద్ర రాజపక్స సోదరుడు కావడం విశేషం. రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. వివాదాస్పద నాయకుడిగా ఆయనకు పేరుంది. 2008-2009లో తమిళ వేర్పాటువాద గెరిల్లాలతో తుది విడత పోరులో తీవ్రమైన యుద్ధనేరాలకు పాల్పడిన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన తన అమెరికా పౌరసత్వాన్ని వదలుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన కీలకంగా సింహళీయులు, జాతీయతావాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. మెజారిటీ కమ్యూనిటీగా ఉన్న సింహళీయుల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా, తాజా ఫలితాల ప్రకారం సింహళీయులు ఆయనకు పెద్దఎత్తున మద్దతుగా నిలవగా, మైనారిటీ తమిళులు, ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తెలుస్తోంది. చైనా అనుకూల నేతగా, అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న నేతగా గోటబయ రాజపక్సాను చెబుతారు.

కాగా 15 ఏళ్లుగా శ్రీలంకలో ఆర్థికాభివృద్ధి మందగించింది. దీనికి తోడు అక్కడ ఈస్టర్‌ సండేరోజున జరిగిన ఆత్మాహుతి దాడితో పర్యాటక ఆదాయానికి గండిపడింది. ఇన్ని సమస్యల నడుమ శనివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. 22 మిలియన్ల శ్రీలంక జనాభా భవిష్యత్తును కాపాడతానంటూ గొటాబయ హామీల వర్షం కురిపించారు. మరోవైపు ఈస్టర్‌ సండేనాడు జరిగిన ఆత్మాహుతి దాడుల వల్ల రణిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముందస్తు సమాచారం అందినప్పటికీ దాడులు జరక్కుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది.

మోడీ అభినందన

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గొటబయ రాజపక్సకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. రెండు దేశాలు సోదరభావంతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై రాజపక్స స్పందిస్తూ.. తనను అభినందించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలది చారిత్రక బంధమని అన్నారు. తమ స్నేహాన్ని బలోపేతం చేయడంతో పాటు సమీప భవిష్యత్‌లో మిమ్మల్ని (మోడీ) కలుసుకునేందుకు తాను సైతం ఎదురుచూస్తున్నాని పేర్కొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close