ప్రచారాలు బంద్‌-పంచుడు షురూ..

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. దీంతో ఇప్పటి వరకు మైకుల మోతతో, ఊకదంపుడు ప్రచారాలతో మార్మోగిన తెలంగాణలో నిశబ్ద వాతావరణం చోటు చేసుకుంది. మైకులు మాట్లాడడం మానేశాకా సైలెంట్‌గా అన్ని పార్టీల నాయకులు పైసలు, మందు, పంపకాలకు తెరతీశారు. వివిధ వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి వారి బలహీనతలు కనిపెట్టి లోబరచుకోడానికి నాయకులు, అభ్యర్థులు, వారి తరఫు కార్యకర్తలు, ప్రతినిథులు నిధులతో రంగ ప్రవేశం చేశారు. తినబోసి, తాగబోసి మైండ్‌వాష్‌ చేసే పనికి స్పీడు పెంచారు. సెప్టెంబర్‌ 6 నుంచి డిసెంబర్‌ 5 వరకు దాదాపు నాలుగు నెలలపాటు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని హోరెత్తించారు. నువ్వా నేనా అన్న రీతిలో అన్ని రాజకీయ పార్టీలో ప్రచారంలో హోరెత్తించాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాష్ట్రం రాజకీయ సమరాన్ని తలపించింది. పార్టీల ఊకదంపుడు ప్రచారాలు, రోడ్‌ షోలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎటు చూసినా ఎన్నికల ప్రచారంతో తెలంగాణ అంతా హడావిడిగా కనిపించింది. సినీనటులు, క్రికెటర్లు, జాతీయ పార్టీ నేతల బహిరంగ సభలతో తెలంగాణ రాష్ట్రం దద్ధరిల్లిపోయింది. ఇక ఎన్నికల ప్రచారానికి సమయం ముగియడంతో ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా నిశబ్ధవాతావరణం చోటు చేసుకుంది. మ్నెత్తానికి తెలంగాణలో మైకులు మూగబోవడంతో అంతా ష్‌…గప్‌ చుప్‌ గా తయారైంది. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్‌ సెప్టెంబర్‌ 6న తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఆరోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి మరుసటి రోజు నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. డిసెంబర్‌ 7న పోలింగ్‌, డిసెంబర్‌ 11న ఫలితాలు విడుదల తేదీలను ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగియడంతో డిసెంబర్‌ 7 శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ పోలింగ్‌ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక పోలింగ్‌ విషయానికి వస్తే తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 నియోజకవర్గాలకు 1821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే మల్కాజ్‌ గిరి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 42 మంది అభ్యర్థిలో బరిలో నిలవగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీ చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా పోలింగ్‌ స్టేషన్లు ఉండగా భద్రాచలంలో అత్యల్పంగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అటు రాష్ట్రవ్యాప్తంగా 2కోట్ల 80 లక్షల 84వేల 684 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు కోటి 41 లక్షల 56వేల 182 మంది ఉండగా..కోటి 39 లక్షల 811 మంది స్త్రీలు ఓటర్లుగా ఉన్నారు. ఇతరులు 2,691 మంది ఉన్నారు. వీరంతా 32వేల 815 పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇకపోతే ఈ ఎన్నికలకు కట్టుదిట్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 279 కేంద్ర కంపెనీలు, 30 వేల మంది రాష్ట్ర భద్రతా బలగాలు, అలాగే ఐదు రాష్ట్రాల నుంచి 18వేల 860 మందితో ఈ ఎన్నికలను నిర్వహించనుంది. ఇకపోతే ఈ ఎన్నికలకు 55,329 ఈవీఎంలు, 42వేల 751 వీవీ ప్యాట్‌ లు వినియోగించనుంది. అలాగే ఈ ఎన్నికల్లో దివ్యాంగుల కోసం వీల్‌ చైర్‌ లు, బ్రెయిలీ లిపిల్‌ ఎపిక్‌ కార్డ్స్‌, సైన్‌ బోర్డ్స్‌ ర్యాంపులు ఏర్పాటు చేసింది. అలాగే దివ్యాంగులకు ప్రత్యేక రవాణా సౌకర్యం కూడా కల్పించింది. అలాగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 80వేల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కు దరఖాస్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here