భారత్‌కు అమెరికా షెల్‌ చమురుతో సమస్యలు..

0

న్యూఢీల్లీ : ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు ఆపేయడంతో ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం భారత్‌ తీవ్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా నుంచి షెల్‌ చమురు కొనుగోలు పై మాత్రం భారత్‌ ఆసక్తి చూపడంలేదు. దేశ వాణిజ్య భద్రతను దష్టిలోపెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. గత ఏడాది చమురు దిగుమతుల్లో 10శాతం వాటా ఇరాన్‌ చమురు ఆక్రమించింది. కానీ ఇప్పుడు అవిలేవు. అమెరికాలో షెల్‌ చమురు ఉత్పత్తి భారీ స్థాయిలో జరుగుతోంది. కానీ, ఇది భారత్‌కు ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇరాన్‌ రకం చమురును శుద్ధిచేయడానికి వాడే రిఫైనరీలను షెల్‌ చమురు శుద్ధి చేయడానికి వాడాలంటే చాలా మార్పులు.. చేర్పులు చేయాల్సి ఉంటుంది. దీనికి భారీ మొత్తంలోనే వెచ్చించాల్సిన అవసరముంది. ఇప్పుడు భారతీయ సంస్థలు అంతమొత్తం ఖర్చుపెట్టి మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా లేవు. పైగా షెల్‌చమరు శుద్ధికి భారీ మొత్తంలో ఖర్చవుతుంది. అసలే 10శాతం చమురు కొరత ఉన్నప్పుడు కొన్నాళ్లు అందుబాటులో ఉన్న రిఫైనరీని కూడా పక్కనబెట్టి మార్పులు చేయడానికి ఏ దేశం ఇష్టపడదు. ఇది వాణిజ్యపరంగా దేశీయ కంపెనీలకు పెద్దగా లాభదాయకం కాదు. దీనికి తోడు అమెరికా నుంచి చమురు రవాణా చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. ఈ భారాన్ని కూడా కంపెనీలే మోయాల్సి ఉంటుంది. ”భారత్‌ ఇరాన్‌ చమురు దిగుమతులు నిలిపివేయడం వల్ల వచ్చే నష్టం కంటే ఖరీదైన ప్రత్యామ్నాయం వైపు మళ్లడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువగా ఉంటుంది.” అని ఇంధనశాఖ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి షెల్‌ చమురు లక్షణాలు క్రూడ్‌ కంటే భిన్నంగా ఉంటాయి. దీనిని శుద్ధి చేయగలిగే సామర్థ్యం అతి తక్కువ సంస్థలకు మాత్రమే ఉంది. ఐవోసీకి చెందిన పారాదీప్‌రిఫైనరీలో దీనిని శుధ్ధి చేయవచ్చు. గత ఏడాది దాదాపు 4 బిలియన్‌ డాలర్ల విలువైన షెల్‌ చమురును దిగుమతి చేసుకొంది. ఈ సారి దానిని 5 బిలియన్‌ డాలర్లకు పెంచుతానని పేర్కొంది. కానీ, గతంలో స్పాట్‌ మార్కెట్లో కొంత ముందే కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ మేరకు కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గింది. దీంతో ఈ సారి షెల్‌ చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా కంపెనీలకు దీనిపై స్వేచ్ఛను ఇచ్చంది. లాభదాయకత లేకుండా అమెరికా నుంచి చమురు కొనమని ఒత్తిడి చేయబోమని భరోసా ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్‌ కూడా పరోక్షంగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి రవీష్‌కుమార్‌ మాట్లాడుతూ దేశ ఇంధన భద్రత, వాణిజ్య అవసరాలను ద ష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. అదనపు నిల్వలపై దేశ ఇంధన శాఖకు సమగ్ర ప్రణాళిక ఉందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here