ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లును లోక్‌ సభ ఆమోదించింది. అటు రాజ్యసభలో సైతం ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. ఉభయ సభల ఆమోదంతో ఆ బిల్లును భారత రాష్ట్రపతి వద్దకు పంపించారు. దీంతో శనివారం ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించినట్లు అయ్యింది. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఈ బిల్లు రూపొందించినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని, ”సబ్‌కా సాథ్‌…సబ్‌కా వికాస్‌” నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు బీజేపీ చెప్పుకొచ్చింది. మంచి ఉద్దేశ్యంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం చేస్తున్నామని బీజేపీ స్పష్టం చేసింది. అగ్రకులాల్లోనూ పేదరికంలో మగ్గుతున్న వారు ఉన్నారని ఆఖరికి చదువుకోవాలన్నా, వాళ్లు బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారంటూ బీజేపీ బిల్లును సమర్థించుకుంది. పేద-గొప్ప అనే తారతమ్యం లేకుండా, సామాజిక సమానత్వం కోసమే ఈబీసీ రిజర్వేషన్లకు రూపకల్పన చేసినట్లు వెల్లడించింది. మ్నెత్తానికి రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు చట్టబద్దత కల్పించడం జరిగింది. సంక్రాంతి పండుగక ముందే ఈబీసీ వర్గాల వారికి ఇది ఒక గిఫ్ట్‌ అని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మార్గం సుగమమైంది.

రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయంటే..

ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ప్రతిపాదిత ప్రామాణికాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారంటే.. వత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు… అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు… నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు.. నాన్‌-నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతంలో 200 గజాలకన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు రిజర్వేషన్‌ పొందేందుకు అర్హులు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here