పంచాయతీ పోరుకు రంగం సిద్ధం

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తొలివిడతగా సోమవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు ఇతర వస్తు సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పోలింగు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి జిల్లా, జోన్‌, మండల స్థాయిల్లో నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. నోటిఫికేషను విడుదల మొదలు నామపత్రాల స్వీకరణ నుంచి ఉపసంహరణల వరకు కొంతమంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటుండగా.. పోలింగు రోజున మరికొంతమంది విధులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. పోలింగు విధుల్లో పాల్గొనే అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతుల ద్వారా విధివిధానాలను తెలియజేశారు. బ్యాలెట్‌ పేపర్లపై ఓటు వేశాక వాటిని ఎలా మడతపెట్టాలి.. ఓట్ల లెక్కింపు తీరుతెన్నులపై అవగాహన కల్పించారు. పోలింగు కేంద్రాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించారు.

''ఓటర్లకు గాలం.. గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం.. చీరలు, నిత్యావసర సరకులు సైతం పంపిణీ.. ఇదీ పంచాయతీ ఎన్నికల తీరు'' మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న మెదక్‌ మండలం మాచవరంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన మద్యం, చీరలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్పంచి అభ్యర్థిగా పోటీచేసే అభ్యర్థి వీటిని పంపిణీ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

గెలుపే లక్ష్యం:

కొన్ని గ్రామాల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఇస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉంటే అందరికీ ఈ మేరకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. సర్పంచి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా గ్రామాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓటర్లు కోరిన వాటిని అందిస్తున్నారు. దావత్లను ఏర్పాటు చేసి మద్యాన్ని ప్రవహింపజేస్తున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఓటర్లకు ఇస్తున్న విందులతో గ్రామాలు

సందడిగా మారాయి. ¬రా¬రీగా ఎన్నికలు జరిగే గ్రామాల్లో కేవలం మద్యంతో సరిపెట్టకుండా కావల్సిన వాటిని సమకూరుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. చీరలు, ఇతర వస్తువుల పంపిణీతో పాటు ఓటుకు నోటు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు అయ్యే వ్యయం కంటే మూడో విడతలో ఉన్న వారికి రెట్టింపయ్యే అవకాశం ఉంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా సిద్ధమవుతున్నారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచి, వార్డు స్థానాలకు తొలి విడత ఎన్నికలు ఈనెల 21న, రెండో విడత 25న, మూడో విడత 30న జరగనున్నాయి.

ఒకరికి మించి మరొకరు..

పల్లెపోరులో గెలిచేందుకు అభ్యర్థులు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రత్యర్థి చేసే ఖర్చుకు రెట్టింపుగా వ్యయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నామపత్రం దాఖలు చేసిన నాటి నుంచి అభ్యర్థులకు ఖర్చులు మొదలయ్యాయి. సామాజికవర్గాల వారీగా, గ్రూపుల వారీగా కొందరిని ఒక చోట చేర్చి వారికి విందులు ఇస్తున్నారు. మద్యం, మాంసాహారంతో దావత్‌ లు జరగడంతో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతున్నాయి. గ్రామ శివార్లు, వ్యవసాయ పొలాల వద్ద గుడారాలు వేసి విందులు ఇస్తున్నారు. గ్రామస్థులు జరుపుకునే సంక్రాంతి పండగ ఖర్చులు సైతం అభ్యర్థులే భరించడం గమనార్హం. పండుగరోజున వారికి కావాల్సిన మద్యం, కల్లు, మాంసం తదితరాలను సమకూర్చారు.

ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా ఏ ఒక్క ఎన్నిక అధికారి గ్రామాలవైపు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఇరు వర్గాల వారు ఈ తతంగాన్ని నడిపిస్తుండడంతో ఎవరు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జోరుగా మద్యం పంపిణీ కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో విందులు పెద్దఎత్తున కొనసాగుతుండగా, రెండు, మూడు విడతల్లో జరిగే గ్రామాల్లో ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి.

ఓటుకు నోటు…:

పంచాయతీ ఎన్నికల్లో ఎంతఖర్చుకైనా వెచ్చించడానికి అభ్యర్థులు వెనుకాడటం లేదు. ప్రస్తుత ఎన్నికలతో పాటు, ఆ తర్వాత జరిగే ఎన్నికలకు ఇదే రిజర్వేషన్‌ అమలు కానుండటంతో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఓటుకు నోటు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్టు సమాచారం. పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లతో ముందే ఒప్పందం చేసుకొని వారికి డబ్బులు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు.

అధికారుల పట్టింపేది..!:

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు నిర్దేశించిన వ్యయానికి మించి ఖర్చు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులను నియమించినా.. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని వారు సూచించినా ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అందకపోవడం గమనార్హం. పోలీసులు దాడిచేస్తేనే మద్యం, చీరలు పట్టుబడుతుండగా, అధికారుల తనిఖీలు, దాడులు మాత్రం కనిపించడం లేదు. మద్యం, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బాక్స్‌:

తెలుగు వర్ణమాల కీలకం..!:

పై చిత్రంలో గోడకు వేలాడుతున్న పటం చూశారా.. ఇది తెలుగు వర్ణమాల. చిన్నారులకు విద్యాబుద్ధులు సులభతరంగా అర్థం కావడానికి తరగతి గదుల్లో ఉపయోగిస్తారు. ఇది అందరికీ తెలిసిందే… దీని గురించి ఇప్పుడెందుకు ప్రస్తావన అంటే.. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తెలుగు వర్ణమాల ఇక్కడ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ‘గుర్తు’లు కేటాయించాలి. జాబితాలోని అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షర క్రమంలో ఉంటాయి. ‘గుర్తు’లను వరుస క్రమంలో కేటాయించడానికి అభ్యర్థుల పేర్లలోని అక్షరమాల సులభంగా అర్థం చేసుకునేలా, వివాదాలు లేకుండా తెలుగు వర్ణమాల చిత్రపటం తీసుకొచ్చి కార్యాలయంలోని తన ఛాంబర్లో గోడకు అమర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here