Featuredజాతీయ వార్తలు

మలివిడతకు సర్వం సిద్ధం

  • 97 స్థానాలకు ఎన్నికలు
  • ¬రా¬రి పోరు
  • నేడే పోలింగ్‌

ఎన్నికల ఫీవర్‌ పీక్‌ స్టేజికి చేరుకుంది. మలివిడత ఓట్ల పండగకు దేశం సిద్ధమైంది. మొత్తం 97 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జమ్ముకశ్మీర్‌, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్‌, ఒడిషా, పుదుచ్చేరి, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో కొన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనుంది. వేలూరులో ఎన్నిక రద్దుకాగా, శాంతిభద్రతల కారణంగా త్రిపుర తూర్పు స్థానం ఎన్నికను వాయిదా వేసింది ఎన్నికల సంఘం…

తొలి విడత 91 స్థానాలకు జరుపుకున్న దేశం ఈనెల 18న జరిగే రెండోదశ ఎన్నికలకు సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌ సభ స్థానాల్లో ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుంది. పక్కనున్న పాండిచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ 18న పోలింగ్‌ జరుగుతుంది. కర్ణాటకలో 14, చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, యూపీలో 8, అసోం, బీహార్‌, ఒడిశాలో ఐదు చోట్ల, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌లో మూడు చోట్ల, జమ్ముకశ్మీర్‌లో రెండు చోట్ల, మణిపూర్‌, త్రిపులో ఒక్కోచోట రెండోదశలో పోలింగ్‌ జరుగనుంది. యూపీలో మొత్తం 80 లోక్‌ సభ స్థానాలు ఉంటే.. 8 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఈ 8 బీజేపీ సిట్టింగ్‌ స్థానాలే కావడం విశేషం. అస్సోంలో 5 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. కరీంగంజ్‌, సిల్చార్‌, అటానమస్‌ డిస్ట్రిక్ట్‌, మంగళడోయ్‌, నవగాంగ్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇక బీహార్‌లో ఐదు స్థానాలకు కృష్ణగంజ్‌, కతిహార్‌, పూర్ణియా, భగల్‌పూర్‌, బంకాలో ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌లో 3 స్థానాలు రాజ్‌నంద్‌గావ్‌, మహాసముంద్‌, కంకేర్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మరో సున్నితమైన రాష్ట్రం జమ్ముకశ్మీర్‌లో శ్రీనగర్‌, ఉదంపూర్‌ పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటకలోని 14 పార్లమెంట్‌ స్థానాలకు 18వ తేదీనే పోలింగ్‌ జరగనుంది. ఇందులో ఉడుపి, చిక్‌మంగళూర్‌, హసన్‌, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తూముకూరు, మాండ్య, మైసూర్‌, చామరాజ్‌నగర్‌, బెంగళూరు రూరల్‌, బెంగళూరు ఉత్తరం, బెంగళూరు సెంట్రల్‌, బెంగళూరు దక్షిణం, చిక్కబళ్లాపూర్‌, కోలార్‌ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. ఇక మహారాష్ట్రలో 10 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇందులో బుల్దానా, అకోలా, అమరావతి, హింగోలి, నాందేడ్‌, పర్భాని, బీడ్‌, ఒస్మానాబాద్‌, లాతూరు, సోలాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఒకే స్థానం ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక ఒడిషాలో 5 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇందులో బర్గర్హ్‌, సుందర్‌గర్హ్‌, బోలంగిర్‌, కందమాల్‌, అస్కా నియోజకవర్గాలు ఉన్నాయి. 18నే కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ఒక స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాగిన, అమ్‌రోహా, బులంద్‌ షహర్‌, అలిఘఢ్‌, హత్రాస్‌, మథురా, ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది. పశ్చిమబెంగాల్‌లో మూడు నియోజకవర్గాలు జల్‌పాయిగురి, డార్జీలింగ్‌, రాయిగంజ్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. రెండో విడత ఎన్నికల్లో తమిళనాడులోని వేలూరు నియోజవకర్గానికి పోలింగ్‌ రద్దు కాగా… త్రిపురా తూర్పు స్థానం శాంతిభద్రతల కారణంగా ఎన్నికను వాయిదా వేసింది ఈసీ. ఇక మిగతా అన్ని చోట్ల పోలింగ్‌ జరగనుంది. ఇందులో పలువురు హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. కొన్ని కొత్త ముఖాలు పార్లమెంటులో అడుగుపెట్టేందుకు తమవంతు కృషిచేస్తున్నారు.

కన్యాకుమారిలో నాడార్లే కీలకం

తమిళనాడులోని కన్యాకుమారి నియోజకవర్గంలో భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోరు జరగనుంది. భాజపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, కాంగ్రెస్‌ నుంచి వ్యాపారవేత్త హెచ్‌.వసంతకుమార్‌ పోటీ ఉన్నారు. కన్యాకుమారిలో నాడార్‌ సామాజికవర్గం గెలుపోటములను ప్రభావితం చేయనుంది. నాడార్లు హిందూ, క్రిస్టియన్‌ రెండు మతాల్లోనూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా తరఫున ప్రధాని మోదీ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లోనూ ప్రస్తుత అభ్యర్థులే తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వసంతకుమార్‌పై పొన్‌రాధాకృష్ణన్‌ 1,28,662 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

అన్నాడీఎంకే ఉండుంటే పోటీ మరింత రసవత్తరం

తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే తరఫున కరుణానిధి కుమార్తె కనిమొళి, తమిళనాడు భాజపా అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ కూడా నాడార్‌ సామాజివర్గం ఓట్లే కీలకం కానున్నాయి. కనిమొళి తల్లిది, తమిళ్‌సై సౌందరరాజన్‌లది స్థానికంగా బలమైన నాడార్‌ సామాజికవర్గమే. 30 శాతం ఉన్న మైనార్టీలతో పాటు మత్స్యకారుల ఓట్లు కీలకం. అభ్యర్థుల గెలుపోటములపై స్టెరిలైట్‌(రాగి పరిశ్రమ) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కాలుష్యకారక పరిశ్రమను మూసివేయాలని ఆందోళన చేపట్టిన స్థానికులపై గత ఏడాది మే నెలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం జరుగుతోంది. భాజపా కాకుండా అన్నాడీఎంకే అభ్యర్థి పోటీలో ఉండుంటే పోటీ మరింత రసవత్తరంగా మారేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

కార్తి పరిస్థితి ఏంటి..!

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం కంచుకోట. ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా చిదంబరం తనయుడు కార్తి చిదంబరం, అన్నాడీఎంకే కూటమి నుంచి భాజపా జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ వీరిద్దరూ ఇక్కడి నుంచే పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అప్పుడు రాజా నాలుగు, కార్తి మూడో స్థానంలో నిలిచారు. తేవార్‌, చెట్టియార్‌తో పాటు దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయి. ద్రవిడ పార్టీల ఓట్లు జాతీయ పార్టీలకు బదిలీ అవుతాయా లేదా అన్నదానిపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

హేమమాలినికి గట్టిపోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో త్రిముఖ పోరు జరగనుంది. భాజపా తరఫున ప్రముఖ సినీనటి హేమమాలిని, కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌ పాథక్‌, ఆర్‌ఎల్‌డీ అభ్యర్థిగా కున్వర్‌ నరేంద్ర సింగ్‌ బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న హేమమాలినికి మిగతా రెండు ప్రధాన పార్టీల నుంచి తీవ్రపోటీ ఎదురవుతోంది. ఈ నియోజకవర్గంలో 70శాతం ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. హేమమాలిని ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు నిరుద్యోగం, యమునా నది కాలుష్యం విషయాల్లో ఆమెకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ రెండు అంశాలూ భాజపాకు ప్రతికూలంగా మారే అవకాశముంది. గత ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ ఉపాధ్యక్షుడు జయంత్‌ చౌదరిపై హేమమాలిని 3లక్షలకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు.

వరుస విజయాలపై బీజేపీ కన్ను

ఆగ్రా… యూపీలో ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఆగ్రా స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎస్పీ సింగ్‌ భగేల్‌ (భాజపా), ప్రీతా హరిత్‌ (కాంగ్రెస్‌), మనోజ్‌ సోనీ (బీఎస్పీ) బరిలో ఉన్నారు. దళిత ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇంత వరకు బీఎస్పీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు నియోజకవర్గంలో ముస్లింలు, వైశ్యులు కూడా గణనీయంగానే ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖలో ముఖ్య కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రీతా హరిత్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. కాంగ్రెస్‌ చివరిసారిగా 1984లో ఇక్కడ గెలిచింది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా భాజపా అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. దీంతో ఇప్పుడు కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి నరైన్‌ సింగ్‌ సుమన్‌పై భాజపా అభ్యర్థి రామ్‌ శంకర్‌ కటారియా 3లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.

అప్పుడు ఎన్సీపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి..

బిహార్‌లోని కతిహర్‌ నియోజకవర్గంలో ద్విముఖ పోరు నెలకొంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌, జేడీ(యూ) పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ తారిఖ్‌ అన్వర్‌, జేడీ(యూ) తరఫున దులాల్‌ చంద్ర గోస్వామి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున గెలిచిన తారిఖ్‌ అన్వర్‌ కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి నిఖిల్‌ కుమార్‌ చౌదరిపై తారిఖ్‌ సుమారు లక్షా 14వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఫరూక్‌కు ఆ రెండు పార్టీల నుంచి తీవ్రపోటీ

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ స్థానంలో ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తరఫున ఆ పార్టీ అధినేత, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, ఇర్ఫాన్‌ అన్సారీ (పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌), ఆఘా మోసిన్‌ (పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ), ఖలీద్‌ జహంగీర్‌ (భాజపా) బరిలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఫరూక్‌ అబ్దుల్లాకు ఇర్ఫాన్‌ అన్సారీ, ఆఘా మోసిన్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370 అంశాలు ఓటర్లపై ప్రభావం చూపనున్నాయి.

చతుర్ముఖ పోరు.. గెలిసేది ఎవరు..?

పశ్చిమబెంగాల్‌లోని పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్‌లో ప్రధాన పోటీ నాలుగు పార్టీల మధ్యే ఉంది. అమర్‌సింగ్‌ రాయ్‌ (తృణమూల్‌), రాజుసింగ్‌ బిస్త్‌ (భాజపా), శంకర్‌ మలాకర్‌ (కాంగ్రెస్‌), సమన్‌ పాథక్‌ (సీపీఎం) తరఫున పోటీ చేస్తున్నారు. అయితే వీరిలో పోరు నువ్వా నేనా అన్నట్టు సాగేది మాత్రం తృణమూల్‌, భాజపా మధ్యే. ప్రత్యేక గుర్ఖాలాండ్‌ కోసం గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) గత కొంత కాలంగా ఉద్యమిస్తోంది. 2009, 2014లో జీజేఎం మద్దతుతో భాజపా ఇక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో భాజపాకు ఇకపై మద్దతివ్వబోమని జీజేఎం 2017లో ప్రకటించింది.

గతసారి హసన్‌.. ఈసారి తుమకూరు

కర్ణాటకలోకి తుమకూరులో ద్విముఖ పోరు జరుగుతోంది. జేడీ(ఎస్‌) తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, భాజపా నుంచి జీఎస్‌ బసవరాజ్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్పీ ముద్దనుమెగౌడ విజయం సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జేడీ(ఎస్‌)కు కేటాయించారు. గతసారి హసన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవెగౌడ.. ఇప్పుడు తుమకూరు నుంచి బరిలో నిలిచారు. హసన్‌ నియోజకవర్గాన్ని తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు కేటాయించడంతో దీనికి కారణం. మరోవైపు ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచితీరాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది.

మొగ్గు ఎవరికి?

దేశవ్యాప్తంగా అందరి దృష్టి కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంపైనే ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ జేడీ(ఎస్‌), స్వతంత్ర అభ్యర్థి సుమలత మధ్య ¬రా¬రీ పోరు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుమలతకు మద్దతుగా భాజపా అక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. కుమారస్వామి సామాజిక వర్గం వక్కలిగ ఓటు బ్యాంకు ఇక్కడ ఎక్కువగా ఉంది. సుమలత భర్త దివంగత అంబరీశ్‌ కూడా వక్కలిగలకు చెందినవారే కావడం గమనార్హం. దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ పరిధిలోని 8 నియోజకవర్గాల్లోనూ జేడీ(ఎస్‌) విజయం సాధించింది. మరోవైపు జేడీ(ఎస్‌)తో పొత్తు ఉన్నందున అక్కడి కాంగ్రెస్‌ శ్రేణులు కలిసివస్తే జేడీఎస్‌కు అనుకూలంగా మారే అవకాశముంది.అయితే క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రమ్యపై జేడీ(ఎస్‌) అభ్యర్థి సీఎస్‌ పుట్టరాజు కేవలం 5,518 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close