Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

కేంద్రంపై తిరుగుబాటుకు సన్నాహాలు..!

మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం

  • ఒక్క రూపాయి కూడా సాయం లేదు..
  • జగన్‌ను కూడగట్టే ప్రయత్నం
  • ఈ నెల 24న మరో మారు భేటీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ విభజన సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా అంతకు మించి పొలిటికల్‌ ఎజెండా ఉందన్న అభిప్రాయం.. బయట వినిపిస్తోంది. ప్రధానంగా.. కేంద్ర ప్రభుత్వం.. తమకు ఏ మాత్రం సహకరించడం లేదన్న అభిప్రాయంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. పైగా.. రాష్ట్రాలకు వస్తున్న కేంద్రమంత్రులు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై కేసీఆర్‌, జగన్‌ కలిసి నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ సహా ఏ విషయంలోనూ కేంద్రం తమ ఆలోచనలకు అనుగుణంగా సహకరించడం లేదని.. జగన్మోహన్‌ రెడ్డి కేంద్రం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లుగా సెక్రటేరియట్‌లో ప్రచారం జరుగుతోంది. జగన్‌ ఇజ్జత్‌ గా భావించిన పవర్‌ పర్చేజింగ్‌ అగ్రిమెంట్ల విషయంలో అడుగు ముందుగు వేయకుండా.. కేంద్రం గట్టి హెచ్చరికలే చేసింది. దాంతో.. వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో నిపుణుల కమిటీ నివేదికతో.. ఏపీ సర్కార్‌ ను.. ఇరికించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసుకుంటోందని జగన్‌ అనుమానిస్తున్నారు. అందుకే.. ఆ నివేదికకు సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారని భావిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి ఈ గండం నుంచి బయటపడటానికి.. ఆ నివేదికతో ఏకీభవించడం లేదన్న సమాధానం పంపి బయట పడే ప్రయత్నం చేశారు. ఇక అమరావతి విషయంలో ఇచ్చిన నివేదికతోనూ.. బీజేపీ తమను బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందని.. కొన్నాళ్లుగా ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలను బట్టి జగన్‌ కూడా నమ్ముతున్నారు. ఇక ఆర్థిక సాయం ఇతర విషయాల్లోనూ కేంద్రం ఏపీని అసలు పట్టించుకోవడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా.. కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రం నుంచి ఒక్కటంటే.. ఒక్క రూపాయి సాయం అందడం లేదు. అందుకే.. బడ్జెట్‌ ను ఇరవై శాతానికిపైగా కోత పెట్టాల్సి వచ్చింది. ఇక రాజకీయంగానూ కేసీఆర్‌ ను సవాల్‌ చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోందని.. దీని వెనుక అమిత్‌ షా ఉన్నారని.. కేసీఆర్‌ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్‌ రెడ్డిని కలుపుకుని కేంద్రంపై.. తిరుగుబాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. కేంద్రంపై..ఏ స్థాయిలో వ్యతిరేక పోరాటం చేయాలనుకున్నా.. అది ప్రమాదకరమే అవుతుందని.. రెండు పార్టీల అగ్రనేతలకు తెలియనిది కాదు. అలా అని సైలెంట్‌ గా ఉంటే.. బీజేపీ తమను.. ముంచేస్తుందని కూడా తెలుసు. అందుకే మధ్యేమార్గంగా.. అటు పోరాడుతున్నట్లుగా.. ఇటు సహకరిస్తున్నట్లుగా.. ఎలా వ్యవహరించాలన్నదానిపై అంతిమంగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ నెల 24న భేటీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నారు. ఈ నెల ఇరవై నాలుగో తేదీన వారి సమావేశం జరగనుంది. విభజన సమస్యలు, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎజెండాగా వీరి సమావేశం జరుగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. వైఎస్‌ జగన్‌ ఏపీ సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఇద్దరు సీఎంలు ఇప్పటికే మూడు సార్లు సమావేశమయ్యారు. ఆయా సందర్భాల్లో పలు అంశాలపై అంగీకారం కూడా కుదుర్చుకొని సామరస్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య తొమ్మిది, పది షెడ్యూల్‌ సంస్థల విభజన, గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం తదితర అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లు ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థికపరమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో శాసనసభ సమావేశాలు జరగడం, ఇతరత్రా కారణాలతో వీరి భేటీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి వీరిద్దరు మాట్లాడుకొని తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైనా కేసీఆర్‌, జగన్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల సీఎంలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోందని, కొన్ని అంశాల్లో కేంద్రం సహకారం అందించడం లేదన్న భావనలో కేసీఆర్‌, జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ తీరుపై చర్చించి, కార్యాచరణను నిర్ణయించుకోనున్నట్లు తెలిసింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close