కూటమి నుంచే ప్రధాని అభ్యర్థి

0

  • ఫలితాల్లో సీట్లలెక్క తేలాకే ఎవరోచెబుతాం
  • ములాయం సింగ్‌ మాత్రం ప్రధానిరేసులో లేరు
  • యూపీలో ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన లేరు
  • కాంగ్రెస్‌, బీజేపీలకు ఏమాత్రం తేడాలేదు
  • సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌

లక్నో : భాజపాకు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ప్రభావం తప్పదని, కూటమి నుంచే దేశానికి కొత్త ప్రధానిని వస్తారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన కూటముల్లో ప్రధాని పదవి కోసం ఒక్కో నాయకుడు ఉండగా.. బీజేపీ మాత్రం ఒక్క నాయకుడి పైనే ఆశలు పెట్టుకుని ఉందన్నారు. ఫలితాల్లో సీట్ల లెక్క తేలాక తమ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెబుతామని వెల్లడించారు. తన తండ్రి ములాయం సింగ్‌ మాత్రం ప్రధాని అయితే బాగుంటుందని.. అయితే ప్రస్తుతానికి ఆయన పదవి రేసులో లేరని స్పష్టం చేశారు. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకోవడమే తన ముందున్న లక్ష్యమని అన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంలో భాగమవుతామని పేర్కొన్నారు. అదే విధంగా 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంపై దృష్టిసారించానని తెలిపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయని అఖిలేశ్‌ పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ విషయంలో కూడా తాము ఇదే పంథా అనుసరిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోకుండా ఇతర పార్టీ నాయకులపై విమర్శలు చేయడం చూస్తుంటే బీజేపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకుందనే విషయం అర్థమవుతోందన్నారు. తమపై ఎవరూ ఆధిపత్యం ప్రదర్శించలేరని, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న తమను గెలిపించాలని ఓటర్లకు విఙ్ఞప్తి చేశారు. ఇక తన భార్య డింపుల్‌ యాదవ్‌ కేంద్ర మంత్రి అవుతారా అన్న ప్రశ్నకు బదులుగా…ముందుగా ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థులు ఓడిపోయినా సరే భాజపా ఓట్లను చీల్చి ఆ పార్టీని గెలవనీయరని ప్రియంకా గాంధీ చేసిన వ్యాఖ్యలను అఖిలేశ్‌ యాదవ్‌ కొట్టిపారేశారు. ‘ఆమె మాటలను నేను నమ్మలేను. కాంగ్రెస్‌ ఎక్కడా బలహీనమైన అభ్యర్థులను నిలపలేదు. అసలు ఏ పార్టీ కావాలని అలా చేయదు. కాకపోతే యూపీలో ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన లేరు. ఈ విషయం తెలిసే వారు ఇప్పటి నుంచే సాకులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు, భాజపాకు ఏమాత్రం తేడా లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టాలని భావిస్తున్న భాజపాకు సాయం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోందని అఖేలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here