పిట్రోడా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు

0

  • వెంటనే క్షమాపణ చెప్పమన్నా
  • కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ

ఛండీగడ్‌ : సిక్కుల ఊచకోత ఘటనపై కాంగ్రెస్‌ ఓవర్సీస్‌ చీఫ్‌ శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు చాలా తప్పని, అందుకు గాను ఆయన దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌లో సోమవారం జరిగిన ప్రచార సభలో రాహుల్‌ మాట్లాడుతూ, పిట్రోడా వ్యాఖ్యలపై తాను ఫోనులో ఆయనతో మాట్లాడానని, తప్పు మాట్లాడరని చాలా స్పష్టంగా ఆయనకు చెప్పానని అన్నారు. సిగ్గుచేటైన వ్యాఖ్యలు చేసిన పిట్రోడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా ‘జరిగిందేదో జరిగింది….అయితే ఏంటి?’ అని ఇటీవల వ్యాఖ్యానించడం దుమారం రేపింది. మోడీ సహా బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ సైతం నష్టనివారణ చర్యలు తీసుకుంటూ.. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం కాదని వివరణ ఇచ్చింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులతో పాటు, గుజరాత్‌ అల్లర్ల బాధితులకు న్యాయం జరిగేంతవరకూ తమ పార్టీ పోరాడుతుందని తెలిపింది. అనంతరం పిట్రోడా సైతం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని, తన ఉద్దేశం వేరని చెప్పారు. తనకొచ్చిన హిందీ అంతంత మాత్రమే కావడంతో పొరపాటు జరిగిందన్నారు. జరిగిన చెడు ఏదో జరిగిందని (జో హువా వో హువా) అని చెప్పాలనుకున్నానని, అయితే బురా (చెడు) అనే పదం తనకు స్ఫురించకపోవడంతో ‘జరిగిందేదో జరిగింది.. అయితే ఏంటి’గా మారిపోయిందని చెప్పారు. తనకు హిందీపై పెద్దగా పట్టులేకపోవడమే ఆ పొరపాటుకు కారణమని పిట్రోడా వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here