Featuredస్టేట్ న్యూస్

అతి తెలివి ప్రదర్శిస్తున్నారా..!

  • హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించారు
  • ఆర్టీసీకి రూ.47 కోట్లు ఇవ్వలేరా?
  • పూర్తి వివరాలతో 31న నివేదిక అందించండి
  • నవంబర్‌ 1కి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం
  • సమ్మె విరమించమని కార్మికుల్ని ఆదేశించలేమన్న హైకోర్టు

హైదరాబాద్‌

ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం కోర్టుకు అందించిన నివేదికలపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి బకాయిలు, వివరాలతో నివేదిక ఇవ్వమని ఆదేశిస్తే.. బడ్జెట్‌లో కేటాయించిన వివరాలను మాత్రమే ఎలా ఇస్తారని అసహనం వ్యక్తం చేసింది. మంగళవారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. ఆర్టీసీకి బకాయిలపై ఆర్థికశాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు వాస్తవాలను మరుగున పెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని న్యాయస్థానం పేర్కొంది. రూ. 4,253 కోట్లు ఇస్తే బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. బ్యాంక్‌ గ్యారెంటీ కింద రూ. 850 కోట్లు చెల్లించామని ఏజీ తెలిపారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని నివేదికలో పేర్కొన్నారు. విభజన తర్వాత ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదన్నారు. ఆర్టీసీకి బకాయిల్లో 48శాతం తెలంగాణ..52 శాతం ఏపీ చెల్లించాల్సి ఉందని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఇంకా ఆర్టీసీ ఆస్తులు ఎందుకు పంపిణీ కాలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆర్టీసీ విభజన.. కేంద్రం పరిధిలోని అంశమని, ఆర్టీసీకి రూ.1,099 కోట్లు బకాయిపడ్డామని ఏజీ అంగీకరించారు. ఆర్టీసీ సమ్మె కేసులో రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న నివేదికపై తెలంగాణ హైకోర్టు అనేక అభ్యంతరాలను, అనుమానాలను వ్యక్తం చేస్తోంది. రీయింబర్సమెంట్‌ బకాయిల కింద ఆర్టీసీకి రూ. 1099 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. అయితే ఇందులో 48శాతం తెలంగాణ, 52శాతం ఏపీ నుంచి చెల్లించాలి ఉందని నివేదిలలో పేర్కొన్నది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తరఫున కౌంటర్‌ దాఖలు చేసిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీ అప్పులు పంపకాలు జరగలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. ఆర్టీసీకి సంబంధించిన అంశాలు విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ. 4253 కోట్లు చెల్లించామని వివరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పామనలేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. రూ.4253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ఘాటుగా వ్యాఖ్యా నించింది. తమకు సమర్పించే నివేదికలో అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారని, బ్యాంక్‌ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్‌ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. ఉపఎన్నిక జరిగే చోట రూ.100 కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గం ప్రజలు ముఖ్యమా?.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆర్టీసీలో మొత్తం ఎన్ని బస్సులున్నాయి? ఇప్పుడు ఎన్నిబస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇతర బలహీన వర్గాలు ప్రయాణం చెయ్యాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమ్మెపై ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజల ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెప్తూనే బస్సులు లేక ఇబ్బంది పడతారని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. ఆర్టీసీ ఎండీ కోర్టు విచారణకు ఒక్కసారైనా హాజరు అయ్యారా? అని ప్రశ్నించింది. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వ కోర్టుకు తెలపగా.. ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని హైకోర్టు పేర్కొంది. మరోవైపు బకాయిల వివరాలను 31లోపు నివేదించాలని ఆర్టీసీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. నవంబర్‌ 1న ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలు చేసే అధికారి హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. జీహెచ్‌ఎంసీ రూ. 335కోట్లు చెల్లించిదా? లేదా? అనే విషయాన్ని తెలపాలని ఆర్టీసీకి ఆదేశించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.4.253 కోట్లలో రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు ఉన్నాయా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వివరాలు పరిశీలించకుండానే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి తమకు నివేదిక సమర్పించారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో 31లోపు హైకోర్టుకు సమర్పించాలని నవంబర్‌ 1న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

ఎపిని ఇరికించిన సర్కార్‌

ఈరోజు నివేదికలో ఏపీ పేరును కూడా ప్రస్తావించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇన్వాల్వ్‌ కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి. ఈ రూ. 1099 కోట్ల బకాయిల్లో 52శాతం ఏపి చెల్లించాల్సి ఉన్నది. ఆర్టీసీకి ఎక్కువ ఆస్తులు హైదరాబాద్‌ లోనే ఉన్నాయి. అది బిల్డింగ్‌ రూపంలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. వీటిని పంచడం అంటే కష్టం అవుతుంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వానికి ఈ బకాయిల విషయంలో కోర్టు నోటీసులు పంపిస్తే ఎలా రికార్ట్‌ అవుతుందో చూడాలి. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు నివేదికను అస్పష్టంగా ఇచ్చారని అసహనం వ్యక్తం చేసింది కోర్టు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల జేఏసీ రేపు సకలజనుల సమరభేరి సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సభకు కనీసం ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తోంది. ఈ సభ జరిగి సక్సెస్‌ అయితే అది ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బందికరమైన అంశం అని చెప్పాలి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close