Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

విభజన సమస్యలు

ఏపీ తెలంగాణ మధ్య ఆప్మెల్‌ సంస్థ పేచీ

  • దడపుట్టిస్తున్న 9,10 షెడ్యూళ్లు..
  • సింగరేణిలో తెలంగాణకు 51శాతం వాటా..
  • ఈనెల 15లోగా పూర్తి నివేదిక..!

విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చురుకుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందడుగు వేశారు. 2019, జూన్‌ 28న ప్రగతి భవన్‌ వేదికగా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యల చిట్టాను రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ నివేదికనే ఇప్పుడు ఇరు రాష్ట్రాల అధికారులకు టెన్షన్‌ పుట్టిస్తోంది. విభజన సమస్యల్లోని 9,10 షెడ్యూళ్లు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ తదితర అంశాలతో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది. 9వ షెడ్యూలులో 91 సంస్థలు, 10వ షెడ్యూలులో 142 విశ్వవిద్యాలయాలు, విద్య, శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్‌ సంస్థలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ కోరుతోంది. ఉన్నత విద్యామండలి విషయంలో.. జనాభా ప్రాతిపదికన పంచాలని.. కోర్టు ఆదేశించింది. అదే సూత్రాన్ని అన్నిటికీ వర్తింపచేయాలని? ఏపీ డిమాండ్‌ చేస్తోంది.

ఎవరికి న్యాయం..? ఎవరికి అన్యాయం..?

అయితే 9వ షెడ్యూలు కింద ఉన్న సంస్థల భవనాలు.. ఎక్కడ ఉన్న అక్కడే అన్న విధంగా పంచుకోవాలని తెలంగాణా అభిప్రాయపడుతోంది..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనికి అంగీకరించడం లేదు.. ఇరు రాష్ట్రాల అధికారులు..9వ షెడ్యూలు కింద ఉన్న 91 సంస్థల్లో 40 సంస్థలకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని తెలిసింది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కింద ఉన్న వడ్డెర, రజక, కుమ్మరి, బలిజ వంటి సమాఖ్యలు, విూట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, సీడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ బోర్డు వంటివాటికి పౌర సరఫరాల సంస్థకు సంబంధించి రూ.1700 కోట్లను తమకు ఇవ్వాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తెలిపారు. అయితే ఇది వాస్తవం కాదని, కేవలం 600 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయని తెలంగాణ అధికారులు చెప్పినట్లుగా తెలిసింది.. ఇలాంటి నిధుల వ్యవహారాలను సీఎంల దృష్టికి తీసుకెళదామని ఇరు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా సెక్రటేరియట్‌ లో ని అధికారులు తెలిపారు.

విద్యుత్‌ బకాయిలు ఇప్పిస్తారా..?

తెలంగాణ కు చెందిన సుమారు 800 మంది నాలుగో తరగతి ఉద్యోగులు అమరావతిలో విధులు నిర్వహిస్తున్నారు?వీళ్లను తెలంగాణ కు తీసుకువచ్చే అంశంపై చర్చించనున్నారు. దీంతో పాటు ఏపికి చెందిన 24 మంది సెక్షన్‌ ఆఫీసర్లు కూడా తెలంగాణ సెక్రటేరియట్‌ లో పని చేస్తున్నారు. వారిని ఏపీకి కేటాయించడంపై చర్చించనున్నారు. విద్యుత్‌ సంస్థల సమస్యలపై కూడా గవర్నర్‌ సమక్షంలో చర్చించే అవకాశం ఉంది..1157 మంది ఏపి స్థానికత ఉద్యోగుల సమస్యపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది..వీరిని ఏపీ తీసుకోవాలని తెలంగాణా కోరుతోంది..దీనికి ఏపీ ప్రభుత్వం అంగీకరించడం లేదు.. దీనికి పరిష్కార మార్గాలపై గవర్నర్‌ చర్చించే అవకాశం ఉంది..అంతేకాకుండా విద్యుత్‌ సంస్థలకు బకాయిల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తావించే అవకాశముంది.

ఏపీ భవన్‌ తెలంగాణ ఖాతాలోకేనా..?

ప్రస్తుతం.. తెలంగాణ సర్కార్‌.. పట్టుదలను చూస్తూంటే.. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను వదులుకోవడానికి సిద్దంగా లేదు. చట్టం ప్రకారం పంపకాలకు కూడారెడీగా లేదు. మొత్తం తనకివ్వాల్సిందేనని అంటోంది. ప్రత్యామ్నాయంగా.. ఎంతో కొంత పరిహారం గురించి ప్రస్తావిస్తున్నారు. లేకపోతే మరో చోట భవనం కట్టిస్తామంటున్నారు. దీనిపై.. ఏపీ అధికారులు? తీవ్రంగా పట్టుబట్టే పరిస్థితి లేదు. నష్టమైనా.. విభజన సమస్యల నుంచి త్వరగా బయటపడాలని.. సీఎం నేరుగా చెప్పడంతో.. అధికారులు కూడా.. ఏదైతే అది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి గవర్నర్‌.. సమక్షంలో ఈ రోజు.. జరగబోయే చర్చల తర్వాత రాజ్‌భవన్‌ నుంచి కొన్ని అధికారిక ఉత్తర్వులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌నే అప్మెల్‌ అంటారు. విజయవాడలో 209 ఎకరాలలో ఉన్న ఈ సంస్థ ఆస్తుల విలువ 700 కోట్లకుపైనే ఉంటుంది. సింగరేణికి చెందిన ఈ సంస్థలో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో వాటాల విషయానికి వస్తే సింగరేణి వాటా 82.54శాతం కాగా.. పాయింట్‌ 6శాతం ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ది. మరో  పాయింట్‌ 86శాతం అప్పటి సమైక్య ఏపీ ప్రభుత్వానిది. ఇక మిగిలిన 11శాతం వాటా మాత్రం ప్రైవేట్‌ షేర్‌ ¬ల్డర్లది. విజయవాడలో ఉన్న ఆప్మెల్‌ను తమదేనని ఏపీ అంటోంది. స్థానిక ఆధారంగా ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయి కాబట్టి... తమకే చెందాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. దీంతో ఆప్మెల్‌ పీఠముడిగా మారిందన్న చర్చ జరుగుతోంది. దీనిపై రెండు ప్రభుత్వాలు మెట్టు దిగకపోవడంతోనే గవర్నర్‌తో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం వాయిదా పడినట్టు అధికార వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. సింగరేణి సంస్థ తెలంగాణకే చెందుతుందని.. విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం సింగరేణిలో తెలంగాణకు 51శాతం వాటా.. కేంద్ర ప్రభుత్వానికి 49శాతం వాటా ఉంది. ఇలా ఏ లెక్కన చూసినా ఆప్మెల్‌ సంస్థ తమదేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే 9వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై షీలా ఖీడే కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తమదే ఆప్మెల్‌ అని ఏపీ చెబుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల ఆస్తుల పంపకాల నివేదిక రెడీ చేయడానికి ఆప్మెల్‌ అడ్డంగా మారినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 15లోగా విభజన సమస్యలపై పూర్తి నివేదిక రెడీ చేయాలని సీఎంలు టార్గెట్‌ పెట్టారు. దీంతో అప్మెల్‌ పీఠముడిని విప్పేదెలా తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close