Featuredప్రాంతీయ వార్తలు

‘పరిషత్‌’ ఫలితాల్లో కారుజోరు

  • 3161 ఎంపీటీసీ, 64జడ్పీటీసీ స్థానాల్లో విజయం
  • కొన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్విప్‌
  • రెండవ స్థానంలో కాంగ్రెస్‌, మూడవ స్థానంతో బీజేపీ
  • కవిత స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థి ఘనవిజయం
  • భూపాలపల్లి జిల్లాలో బ్యాలెట్‌ పత్రాలకు చెదలు

హైదరాబాద్‌ :

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో కారుజోరు కొనసాగుతుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తన ప్రభావాన్ని చాటుతుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,659 స్థానాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, మధ్యాహ్నం 3గంటల వరకు 5042 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో తెరాస ముందంజలో దూసుకుపోతుండగా… కాంగ్రెస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. తెరాస ఎంపీటీసీ అభ్యర్థులు 3161 స్థానాల్లో, కాంగ్రెస్‌ ఎంపీటీసీలు 1171 స్థానాల్లో, భాజపా ఎంపీటీసీ అభ్యర్థులు 188 స్థానాల్లో, తెదేపా 20 ఎంపీటీసీ, వామపక్షాలు, ఇతరులు 502 ఎంపీటీసీ స్థానాల్లో విజయ సాధించారు. మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తన హవాను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు మండలాల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్విప్‌ చేసింది.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పీప్రీ-2 ఎంపీటీసీ స్థానానికి లాటరీలో భాజపా అభ్యర్థిని విజయం వరించింది. ఇక్కడ తెరాస, భాజపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. డ్రా తీయగా భాజపా అభ్యర్థి ఎర్రవ్వను విజయం వరించింది. అంతకుముందు రెండు ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. అయితే భాజపా అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేయడంతో.. మళ్లీ ఓట్లను లెక్కించారు. దీంతో ఇద్దరికి సమానంగా ఓట్ల వచ్చినట్లు తేలింది. చివరకి ఎన్నికల అధికారి లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. నిర్మల్‌ నియోజకవర్గంలో దూసుకుపోతున్న కారుప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. నిర్మల్‌ నియోజకవర్గంలో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌ ఏడు మండలాలకు గానూ ఆరు మండలాల్లో టీఆర్‌ఎస్‌ దక్కించుకోనున్న రెండు జడ్పీటీసీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. వేములవాడ కరీంనగర్‌ నియోజకవర్గంలో ని పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది.. అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ కారు దూసుకుపోయింది.. 20 స్థానాలకు గాను 18చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. .2 ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోందని ఎమ్మెల్యే గంగుల వెల్లడించారు..

మరోవైపు జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ హవానే కొనసాగుతుంది. మధ్యాహ్నం 3గంటల వరకు మొత్తం 74 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాలు వెలువడగా వీటిల్లో 64 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 10 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొనసాగుతున్నారు.

నిజామాబాద్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత..

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని మాక్లూర్‌ మండలం గొట్టుముక్కల గ్రామం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి బెంగరి సత్తెమ్మ విజయం సాధించారు. అయితే, గెలుపొందిన సత్తెమ్మను టీఆర్‌ఎస్‌ శిబిరానికి తరలించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆమె తరలింపు విషయాన్ని గుర్తించిన బీజేపీ శ్రేణులు వెంటనే అడ్డుకున్నారు. దీంతో 

టీఆర్‌ఎస్‌-బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట అనంతరం బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి బెంగరి సత్తెమ్మ ఇంటికి వెళ్లిపోయారు.

కవిత స్వగ్రామంలో మరో చేదు ఫలితం!..

 పరిషత్‌ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమార్తె, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత స్వగ్రామం పోతంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పోతంగల్‌ ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజు 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ కవితకు చేదు ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో రైతులు పోటీచేయడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా భావించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంతోపాటు కరీంనగర్‌ స్థానంలోనూ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుపొంది.. బీజేపీ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇదిలాఉంటే నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఆర్మూర్‌ మండలం పిప్రీ ఎంపీటీసీ-2 స్థానానికి.. లాటరీ ద్వారా బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను విజయం వరించింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులకు 690 ఓట్లు పోలవడంతో అధికారులు లాటరీ తీశారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వ విజయం సాధించారు.

భూపాలపల్లి జిల్లాలో బ్యాలెట్‌ పత్రాలకు చెదలు..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అంబటిపల్లి ఎంపీటీసీ పరిధిలోని 44, 105, సూరారం పరిధిలోని 39.. పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పేపర్లుకు, 116 పోలింగ్‌ కేంద్రంలోని బ్యాలెట్‌ పేపర్లకు చెదలు పట్టింది. చెదలు పట్టిన బ్యాలెట్‌ పత్రాల వివరాలను జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఘటనపై ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అంబటిపల్లి, సూరారం ఎంపీటీసీ స్థానాల్లో, మహాదేవ్‌పూర్‌ జడ్పీటీసీ స్థానంలో ఫలితాలను నిలిపివేయనున్నట్లు తెలిసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి ఆర్‌ఆర్‌ఎస్‌ కళాశాలలో చిట్కుల్‌, నందిగామ ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు లిచిపోయింది. రెండుబల్లలకు ఒకే ట్రే ఇచ్చారంటూ సిబ్బంది లెక్కింపు నిలిపివేశారు. భువనగిరి కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమైంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గంట ఆలస్యంగా ఎన్నికల సిబ్బంది కౌంటింగ్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి ఎన్నికల అధికారులు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్నారు. 
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close