పంత్‌ ఓకే కానీ.. పాపం రాయుడే..?: గంభీర్‌

0

ప్రపంచకప్‌ కోసం భారత సెలక్టర్లు ప్రకటించిన జట్టుపై మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఈరోజు స్పందించాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా ప్రపంచకప్‌ మొదలుకానుండగా.. సోమవారం మధ్యాహ్నం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టులో సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు, యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కి చోటు దక్కకపోవడంపై కొంత మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. ముఖ్యంగా.. పంత్‌కి రెండో వికెట్‌గా చోటిచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ.. సెలక్టర్లు.. అనుభవానికి పెద్దపీట వేస్తూ దినేశ్‌ కార్తీక్‌కి అవకాశమిచ్చారు. ప్రపంచకప్‌ జట్టు గురించి వస్తున్న విమర్శలపై గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ ‘రిషబ్‌ పంత్‌కి ఎందుకు అవకాశం ఇవ్వలేదంటూ అందరూ విమర్శిస్తున్నారు. కానీ.. అతనితో పాటు అంబటి రాయుడికి కూడా ఛాన్స్‌ దక్కలేదు కదా..? పంత్‌ కంటే రాయుడే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో అతని సగటు 48కి దగ్గరగా ఉంది. కానీ.. పంత్‌ గురించి మాట్లాడుతున్నారు తప్ప రాయుడి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. పాపం.. 33 ఏళ్ల రాయుడి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది. 21ఏళ్ల పంత్‌ రానున్న ప్రపంచకప్‌లో ఆడొచ్చు. కానీ.. రాయుడికి ఆ అవకాశం ఉండకపోవచ్చు’ అని వెల్లడించాడు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here