రాజకీయ వార్తలు

చెప్పినవి చాలా.. చేసినవి కొన్ని

ఏం జరుగుతుందీ అసలు… మాటలతో మాయ చేసే గులాబీ బాస్‌ మనసులో కూడా ఓటమి భయం పట్టుకుందా…అంటే దానికి సమాధానం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ప్రతిపక్షాలను ఏలాగైనా తురుమాడవచ్చు.. వారిని తిమ్మిని బమ్మిని చేయవచ్చు.. కాని చాలా నియోజవర్గాల్లో అనుకున్నదీ వేరు.. జరుగుతున్నదీ వేరు.. జాతకాలు, ముహూర్తాలు అన్ని చూసుకొని ముందడుగు వేసే కెసిఆర్‌కు మనసులో ఏదో భయం పెట్టుకుందనీ తెలుస్తోంది. గెలుపుగుర్రాలు అనుకుంటున్న అభ్యర్థులందరూ చతికిలపడుతున్నారు. వారి వారి స్థానిక నియోజకవర్గాల్లో సైతం కనీస స్పందన లేకుండా ప్రజల సానుభూతి లేకుండా అంతా వ్యతిరేకతే కనబడుతుంది.. ఎన్ని మాటలు చెప్పిన ప్రజలను మెప్పించడం కష్టమని తెలిపోతుంది. అసలు తెరాస టైం బాగోలేదా అన్నట్లు మారిపోతున్నాయి సమీకరణాలు.. వరుస పెట్టినట్లుగా ఒకటి తర్వాత ఒకటి ఎదురవుతున్న ఉదంతాలు గులాబీ శ్రేణుల్లో కొత్త భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అడుగు ముందుకేసి సమరమే కాని సందేహం లేని గులాబీ దళాల్లో నాలుగున్నరేళ్ల కెసిఆర్‌ పరిపాలన తర్వాత ఎదురవుతున్న పరిస్థితులు చూస్తే గెలుపు ఆశలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడమే లేదు. ఎన్నికలకు రాకముందే కోట్లాది మంది కలలు కన్న తెలంగాణ సాధించుకున్నాం మనమే అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణగా మార్చుకుందామని చెప్పినా కెసిఆర్‌ అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలకు, చేసిన పరిపాలనకు అసలు సంబంధమే లేదు. ఏ నినాదం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో, ఏ కలలు కోసమైతే పోరాటం చేసామో తెలంగాణ వచ్చాక ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. రోజురోజుకు ఓటర్లలో పెరిగిపోతున్న ఆలోచనశక్తి, యువతలో ఉదృతంగా ప్రచారం అవుతున్న సోషల్‌ మీడియా అన్ని కలిపి తెలంగాణ అధినేతతో పాటు పార్టీ వర్గాల్లో కూడా భయం అనే వైరస్‌ బలంగా నాటుకుపోయిందని తెలుస్తుంది. గెలుపు ఆశలు నేరవేరుతాయా అనే సందిగ్థంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలపై ఉన్న దూకుడు ప్రజలపై ఉంటే అది మొదటికే మోసమవుతుందని అందుకే అచితూచి అడుగేసే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది… కెసిఆర్‌ పార్టీకి బలం అనుకున్న నాయకులు, ఆయన ఉంటే అధికారం సులువు అన్న శ్రేణులు ప్రజల్లో వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని పార్టీ ఎదుర్కొన్న అవకాశాలు లేవు… తెరాస భవిష్యత్తు ఏలా మారిపోతుందో సొంత కుంపటి నేతలకే అర్థంకాని పరిస్థితి…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏమైనా సరే దూసుకెళ్లటం.. తమ దూకుడుతో ప్రత్యర్థుల్ని తొక్కేయటమే తప్పించి.. తొక్కుదామా.. లేదా… అన్న ఆలోచన అణుమాత్రం ఉండేది కాదు.. కాని ఇప్పుడు గులాబీ వనంలో కొత్త తెగులు పట్టిందన్న సందేహం తాజా పరిణామాలు చూస్తుంటే అది నిజమేనని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భయం అన్నది గులాబీ శ్రేణుల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడూ ఎఫెన్సే కాని డిఫెన్స్‌ అన్నది లేని కెసిఆర్‌ దళానికి ఇప్పుడు ఆత్మరక్షణలోకి వెళ్లిపోయి పోరాడుతున్న వైనం ప్రస్తుత నాయకుల పరిస్ధితిని బట్టి చూస్తే సరికొత్తగా కనిపిస్తోంది. పుష్కరానికి పైనే సాగిన ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా మరెన్ని వెన్నుపోట్లు విరుచుకుపడినా సడలని పట్టు, నాలుగున్నరేళ్ల పాలన తర్వాత తాజా తీర్పు కోసం తెర మీదకు వచ్చిన అనుమానాలు, భయాలు, అంతర్మధనాలు బట్టి చూస్తుంటే అసలు తెరాసలో ఏమి జరుగుతుందో అర్థమే కావడం లేదు. మాటల మాంత్రికుడిగా, తన మాటలతో రాత్రికి రాత్రే సీన్‌ మార్చేసే శక్తి ఉన్న కెసిఆర్‌ నోట వెంట వచ్చే మాటలతోనే సమస్య ఎదురవుతుందా.. మా అధినేత ఏది మాట్లాడినా, ఏదీ చేసినా నిజమనే నమ్మే నాయకులు, పార్టీ కార్యకర్యలు ఆయన మాట్లాడుతున్న మాటలు పట్ల అదీ రైటో, రాంగో తెలియని ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు మనం ఏదీ మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితిలో, అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. అటు అధినేతకు నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను చెప్పే పరిస్థితిలేక, నాయకుని మాటలపై కాన్పిడెంట్‌ లేక అయోమయ పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకిలా అంటే పార్టీపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతో ప్రతి కార్యకర్తలు, నాయకుల్లో ఒక రకమైన భయం స్పష్టంగా కనిపిస్తోందని తెలుస్తుంది.

పైన గంభీరం.. లోలోపల ఆందోళన..

పైకి గంభీరంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నా… లోలోపల మాత్రం ఏదో తెలియని సంశయం గులాబీ బాస్‌ను వెంటాడుతోంది.. ప్రజలు తమకిచ్చిన నాలుగున్నరేళ్ల కాలాన్ని వృధా చేశామన్న భావన కావొచ్చు. తొందరపడి ముందుస్తుకు వెళ్లామన్న కొత్త ఆలోచన కావచ్చు. కారణం ఏదైనా గులాబీ రాజ్యంలోకి భయమనే కొత్త వైరస్‌ ప్రవేశించిందని అందుకు భయంతో, అధికారం పోతుందని ఆందోళనతోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నట్లు తెరాస సీనియర్‌ నాయకులు అంటున్నారు. పార్టీని ఏకదాటిగా కనుసన్నలతో నడిపించే కెసిఆర్‌ అంటే అందరికి ఒక రకమైన గౌరవంతో కూడిన భయం ఉండేది. ఆయన చెప్పిందే వేదం, ఆయన మాట్లాడిందే శాసనం, ఆయనకు ఎదురు మాట్లాడాలంటే కెటిఆర్‌, హారీష్‌రావుకు కూడా సాధ్యకానిపని.. కెసిఆర్‌ను ఉద్దేశించి నాలుగు వ్యతిరేక మాటల్ని మాట్లాడేందుకు వణికే గులాబీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా అందరి ఎదుట కెమెరా కంటి ముందు నానా మాటలు అంటూ, గులాబీ కండువాల్ని తీసి పారేయటం.. మళ్లీ గులాబీ కారు ఎక్కే పరిస్థితే లేదని తేల్చేయటం ఒక ఎత్తు అయితే, ఉన్న, పార్టీలో ఉన్న నేతల్లో చాలామంది కడుపులో కోపాన్ని దాచుకుని ముఖాన ప్లాస్టిక్‌ నవ్వులు పూయిస్తూ, గులాబీ సామ్రాజ్యం పచ్చగా ఉందని, అధికారానికి ఢోకా లేదని మేకపోతు గాంభీర్యంలా వ్యవహరిస్తున్నారు. గత నెల రోజుల నుండి పార్టీలో జరుగుతున్న పరిణామాలు నిశీతంగా పరిశీలిస్తే గులాబీ కారును తమ స్వంత నాయకులే రిపేరు షెడ్డుకు పంపించేలా ఉన్నారు. అవకాశం రాలేదని కొందరు.. సొంత పార్టీని వదిలేసుకొని వస్తే ఇక్కడ పట్టించుకునే నాధుడే లేరని మరికొందరు, పార్టీ అధినేత కన్నా అధినేత తనయుడి ప్రవర్తన నచ్చక ఇంకొందరు.. చాలా అసహనంగా, కోపంగా ఉన్నట్లు తేలిపోయింది. భయం అంటే తెలియని తెరాస నాయకత్వానికి నేడు ఎన్నికల భయమే ప్రధాన అంశంగా కనబడుతోంది. ఆ భయం గులాబీ కారును ఎటు వైపు తీసుకెళ్తుందో చూడాల్సిందే…

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close