మా పార్టీదీ, అధినేతదీ భిన్నమైన రాజకీయ శైలి..!

0
తెలంగాణ ఉద్యమపార్టీ అయిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం రెండోసారి రాష్ట్ర అధికార పగ్గాలను చేపట్టింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి పాలనాధికారాన్ని సాధించుకొని, తనదైన శైలిలో సామాజిక సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేసి తన పాలనాసామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇంతవరకూ ప్రశంసనీయమే.. అయితే ఒక రాష్ట్రాన్ని రెండోసారి పాలించే అవకాశాన్ని సంపాదించుకున్న ఒక రాజకీయ పార్టీ, సంస్థాగతంగా తన బలగంతో కూడిన సుస్థిర పార్టీ కార్యాచరణ వ్యవస్థను నిర్మించుకోగలిగిందా..? అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు గమనిస్తున్న అంశం.. అదే విధంగా పార్టీలో కిందిస్థాయి నుండి పార్టీ కార్యకర్తలలో, నాయకులలో అందరూ సంతృప్తిగానే ఉన్నారా..? అనేది మరో ఆలోచించాల్సిన అంశం. ఈ రాజకీయ కోణంలోనే ''ఆదాబ్‌ హైదరాబాద్‌'' నగర టీఆర్‌ఎస్‌ పార్టీలోని ద్వీతీయశ్రేణి సీనియర్‌ నాయకులతో కార్యకర్తలతో ముఖాముఖి సంభాషించి పార్టీ వ్యవహార శైలి పట్ల పార్టీ అధినేత కేసీఆర్‌ ఆలోచనా దృక్పథం పట్ల వారి మనోభావాలను అభిప్రాయాలను సేకరించింది. ఇందులో భాగంగానే కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావుతో ముఖాముఖి సంభాషించింది...

ప్రశ్న : మీ పార్టీలో మొదటిసారి ఎన్నికల్లో గెలిచినంత ఆనందోత్సాహాలు ఇప్పుడు కనిపించడం లేదు.. ఎందుకు..?

సమాధానం : నిజమే !  మా పార్టీ క్యాడర్‌లో అప్పటి జోష్‌ ఇప్పుడు లేదు. దీనికి సరైన కారణం ఉంది. దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా యుద్ధం చేసి విజయం సాధించిన చారిత్మ్రాక సంఘటన అది. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో కలసి ఆనాటి ఆనందోత్సాహాలను పంచుకున్నాం. ఇక రెండోసారి ఎన్నికల్లో కంటిమీద కనుకు లేకుండా పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవలసి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చామన్న ఆనందం కంటె వరుసగా వస్తున్న వివిధ రకాల ఎన్నికలతో మానసిక ప్రశాంతత ఉండడంలేదు.

ప్రశ్న : ఇంతకూ సంస్థాపరంగా మీ పార్టీ ఏదశలో ఉంది? పార్టీ క్యాడర్‌ ఏ పరిస్థితిలో ఉంది..?

సమాధానం : ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం మా పార్టీకి కిందిస్ధాయి నుంచి నిర్ధిష్టమైన కార్యాచరణ వ్యవస్థ లేదు. ఎందుకంటె ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నవారంతా ఉద్యమంలో భాగస్వాములై పార్టీ గెలుపుకోసం పాటు పడుతున్నవారే ! ఈ విషయం మా పార్టీ అధినేతకు సైతం తెలుసు ! అందుకే కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పెట్టి, కిందిస్థాయి నుంచి పార్టీ క్యాడర్‌ నిర్మాణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ¬దాలో డివిజన్‌, మండల, జిల్లా స్ధాయిల్లో పార్టీ కమిటీలను నియమిస్తూ, ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ స్వంత కార్యాలయ భవనాలను నిర్మించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ప్రశ్న : అంటే మీ పార్టీలో ఇప్పుడు అసలు అసంతృప్తి అనేదే లేదా..?

సమాధానం : మా పార్టీలో అసంతృప్తి లేదని నేను చెప్పలేను..! అలా చెబితే అది ఆత్మవంచనే అవుతుంది. ఉద్యమ కాలంలో గానీ, తొలిసారి ఎన్నికల్లోగానీ, రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లోగానీ పార్టీకోసం అంకితభావంతో కష్టపడి సేవచేస్తున్న వారూ ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిలో కనీసం సగం మందికి కూడా తగిన గుర్తింపూ తోడ్పాటు కూడా ఇప్పటికీ లభించలేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే మాపార్టీ వ్యవహారశైలి మొత్తం ఇతర రాజకీయ పార్టీలకంటే పూర్తిగా భిన్నమైంది. అలానే మాపార్టీ అధినేత కేసీఆర్‌ వ్యవహారశైలి సైతం గతంలో ఏ ముఖ్యమంత్రితోనూ పోల్చరానిది. పార్టీ పరమైన వ్యవహారాల విషయంలో గాని, పాలనాపరమైన విధానపరమైన  నిర్ణయాల విషయాల్లోగాని ఆయన ఎప్పుడూ అంతరంగిక రహస్య గూఢచారి వంటివారు ! మనకు పైకి అంతా 'వన్‌ మ్యాన్‌ షో' గా కనిపిస్తున్నా, నిర్ణయాలు బయటికి వచ్చిన తర్వాత అవి సబబే అనిపిస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పాలనాపరమైన రహస్య స్థబ్దతతో కూడిన వాతావరణం సర్వత్రా వ్యాపించి నలుగురి నోళ్ళలో నానుతున్నది. ఇక రేపు ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here