మా ఉపాధిని దెబ్బతీసింది: ఆస్ట్రేలియా డ్రైవర్లు

0

మెల్బోర్న్‌: త్వరలో ఐపీవోకు సిద్ధమవుతున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌కు ఆస్ట్రేలియాలో ఎదురుదెబ్బ తగిలింది. చట్ట విరుద్ధంగా అనుచిత ప్రయోజనాలను పొందుతూ తమ ఉపాధిని నాశనం చేసిందని వేల మంది స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు ఆస్ట్రేలియాలో క్లాస్‌ యాక్షన్‌ దావా వేశారు. సరైన లైసెన్సులు లేని డ్రైవర్ల ద్వారా పర్మిట్లు లేని వాహనాలు నడిపి ఉబెర్‌ చట్టాలను ఉల్లంఘించిందని వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉబెర్‌ చర్యలతో తాము కోల్పోయిన మొత్తం ఆదాయాన్ని తిరిగి చెల్లించాలని ట్యాక్సీ డ్రైవర్లు కోరినట్లు వారి తరఫున కేసు వేసిన లా సంస్థ మారీస్‌ బ్లాక్‌బర్న్‌ పేర్కొంది. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పెద్ద క్లాస్‌ యాక్షన్‌ దావాగా మారుతున్నట్లు సంస్థ తెలియజేసింది. ఆస్ట్రేలియాలో ఉబెర్‌ చట్టవిరుద్ధ కార్యకలాపాల విషయంలో కోర్టు ఇచ్చే తీర్పు మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొంది. నిజంగానే ఉబెర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే కంపెనీపై ఎంత మేర ప్రతికూల ప్రభావం ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఉబెర్‌ కేసు ఓడిపోయి పరిహారాలు చెల్లించాల్సి వచ్చినా.. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం ఉన్న కంపెనీకి మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లింపు పెద్ద సమస్య కాబోదని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే ఉబెర్‌కు పొంచి ఉన్న చట్టపరమైన రిస్కుల గురించి ఇన్వెస్టర్లకు కనీసం హెచ్చరికలాంటిదైనా ఇచ్చినట్లవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా అమెరికాలో 10 బిలియన్‌ డాలర్ల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కు సిద్ధం అవుతున్న తరుణంలో ఉబెర్‌కు ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరమేనని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here