ఓయూ స్టూడెంట్స్‌ పేర్లేవి?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): చిత్ర విచిత్రాల కు కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పార్టీ. ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి అలాగే ఉంటది అని చెబుతారు. రాహుల్‌ గాంధీ హైద్రాబాద్‌ పర్యటనలో ఓయూ విద్యార్థి నేతలకు సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. అదే సమయంలో ఓయూలో సభ పెట్టాలన్నా కుదరలేదు. దీంతో రాహుల్‌ ప్రత్యేకంగా ఓయూ నేతలతో భేటీ అయ్యారు. సీట్లు ఇస్తామన్నారు. అలాగే సరూర్‌ నగర్‌ స్టేడియం లో జరిగిన సభకు ఓయూ నేతలను ఆహ్వానించారు. వారితో కలిసి సభలో చేతులు పైకెత్తి అభివాదం కూడా చేసారు. కానీ కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కు టిపిసిసి నేతలు పంపిన జాబితాలో ఓయూ విద్యార్దుల పేర్లు లేవని తెలిసింది. వారి పేర్లు ఏవని రాహుల్‌ గాంధీ ప్రశ్నించడంతో స్క్రీనింగ్‌ కమిటి సభ్యులు నాలుక కరుచుకున్నారట. స్క్రీనింగ్‌ కమిటి ఇచ్చిన జాబితాలో ఓయూ విద్యార్దులు లేకపోవడంతో ఆ జాబితాను నిలిపేసి పున:పరిశీలించాలి అని రాహుల్‌ సూచించినట్లు ఓయూ స్టూడెంట్‌ లీడర్‌ ఒకరు తెలిపారు. డబ్బులకి, ఇష్టసఖులకి, తమ వారసులకు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్‌ టిక్కెట్లు ప్రకటించుకుంటున్నారని ఆ ఓయూ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓయూ విద్యార్దుల త్యాగాలను వదిలేసి తడిగుడ్డతో గొంతు కోసేందుకు కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టికెట్లు వచ్చుడో తాము చచ్చుడో అని, టికెట్లు ఇవ్వకుంటే తమ శవాలు ఢిల్లీ నుండి వెళతాయని టికెట్లు ఆశిస్తున్న విద్యార్థి నేతలు హెచ్చరించారు.

శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఆందోళనకు దిగుతామని ఓయూ జేఏసి నేతలు మానవతారాయ్‌, దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్‌, చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, కేతూరి వెంకటేష్‌, విజయ్‌, కిరణ్‌ యాదవ్‌ తలిపారు. ఓయూ విద్యార్దులకు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు గతంలోనే తెలిపారు. కానీ ప్రస్తుతం దానినేమి పట్టించుకోకుండా తమ వారసులకు, ఇతరులకు టికెట్లు కేటాయించారు. అసలు ఓయూ విద్యార్దుల ప్రస్తావనే లేకుండా టికెట్ల కేటాయింపు జరిగినట్టు తెలుస్తోంది.

ఓయూ నేతలకు రెండు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓయూ విద్యార్దులకు ఇచ్చిన మాట ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలని రాహుల్‌ చెప్పినట్లు సమాచారం. 5 నుంచి 6 సీట్లు కేటాయిస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఓయూ విద్యార్దులతో సమావేశాలలో ప్రకటించారు. కానీ దానిని నేడు అమలు చేయకపోవడంతో ఓయూ జేఏసీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీట్లివ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వారు కాంగ్రెస్‌ నేతలను హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here