త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్‌ చేశా

0

న్యూఢిల్లీ: తనను వరల్డ్‌కప్‌కు ప్రకటించిన భారత జట్టులో ఎంపిక చేయకపోవడంపై తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు ఘాటుగా స్పందించాడు. ప్రధానంగా బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు రాయుడు. వచ్చే వరల్డ్‌కప్‌ను ‘3డీ’ కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు తనలోని అసంత ప్తిని వెళ్లగక్కాడు. తనను కాదని, ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను జట్టులో ఎంపిక చేయడానికి ఎంఎస్‌కే ఇచ్చిన వివరణ రాయుడికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఇక్కడ విజయ్‌ శంకర్‌ త్రీ డైమెన్షన్స్‌ ఉన్న ఆటగాడిగా ఎంఎస్‌కే పోల్చిన క్రమంలో రాయుడు సెటైర్‌ వేశాడు. ‘ నేను ఇప్పుడు త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్‌ చేశా. వచ్చే వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూడాలనుకుంటున్నా’ అంటూ ట్వీటర్‌ వేదికగా చురకలంటించాడు. సోమవారం భారత వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగా మాట్లాడిన చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే..జట్టును ఎంపిక చేసేటప్పుడు అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్‌ వైపే మొగ్గు చూపామని వివరించాడు. ‘నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్‌ బ్యాటింగ్‌, బౌలింగే కాదు మంచి ఫీల్డర్‌ కూడా. దీంతో శంకర్‌ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడు’ అని ఎంఎస్‌కే ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. దీనికి అంబటి రాయుడు వ్యంగ్యంగా స్పందించడం చర్చనీయాంశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here