Featuredస్టేట్ న్యూస్

చేజారుతున్న విపక్షాలు..!

  • యూపీఏ భేటీకి బీటలు
  • కాంగ్రెస్‌కు షాకిచ్చిన బీఎస్పీ
  • ఫలితాల తరువాతే అంటున్న స్టాలిన్‌

ఆదివారం సాయంత్రం ఎగ్జిట్‌ పోల్‌ వివరాలు వచ్చింది మొదలు విపపక్షాల శిబిరంలో కలకలం రేగుతోంది. ఎగ్జిట్‌ పోల్‌ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ సమావేశాలు కొనసాగతున్నాయి. ఇదే ఒరవడిలో కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న కాంగ్రెసు పార్టీ భేటికి బీటలు బారుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడించిన తరువార విపక్షాలు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తుంది. బిజెపి వ్యతిరేక పార్టీల మద్దుతును, తటస్థంగా ఉన్న పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తగిన వ్యూహంతో ముందుకు సాగుతున్న యూపీఏకు అనుకోని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే సమావేశానికి ఒక్కో పార్టీ హ్యాండ్‌ ఇస్తోంది. బీజేపీయేతర పార్టీల సమావేశానికి ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి రావడం లేదని ఆ పార్టీ ప్రకటించగా తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా ఫలితాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అని స్పష్టం చేశారు. కేంద్రంలో మరోసారి అధికారం ఎన్డీయేదే అని ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తేల్చిచెప్పాయి. అసలు మూడో కూటమికి అవకాశం లేదన్నట్లుగా ఎన్డీయే కూటమి 300 లకు పైగా స్థానాలను గెల్చుకుంటుందని స్పష్టం చేశాయి. దీంతో బీజేపీ యేతర పార్టీలు కొన్ని మూడో ఫ్రంట్‌ కూటమి ఏర్పాటు అసాధ్యం అనే భావనలో పడ్డాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా కేంద్రంలో ఏ కూటమిలో చేరాలనేది ఫలితాల తర్వాతే నిర్ణయిస్తామని మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి కాబట్టి ఇప్పుడే ఢిల్లీలో పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఫలితాల తర్వాత సమావేశాలు జరిపితే ఓ ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చారు. డీఎంకే ప్రస్తుతం యూపీఏలో భాగస్వామ్యంగా ఉంది. రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ ఆకాంక్షించారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాక ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. కేంద్రంలో ఏ కూటమిలో చేరాలో ఫలితాల తర్వాత నిర్ణయిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన యూపీఏను వీడి ఎన్డీయే వైపు అడుగులు వేస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్‌కు ఊహించని షాకిచ్చిన బీఎస్పీ

బీజేపీయేత ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగలింది. యూపిఏ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీతో తన సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువబడిన మరుసటి రోజే మాయావతి ఈ నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అటు యూపీఏ ఇటు ఎన్డీఏ పక్షాలతో ఎలాంటి సమావేశాలు, భేటీలు ఉండవని బీఎస్పీ వర్గాలు స్పష్టం చేశాయి. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి బీఎస్పీ 70 స్థానాల్లో పోటీ చేసింది. వాస్తవానికి కాంగ్రెస్‌తో కలిసి భేటి చేయాలని భావించినా… మాయావతి అంగీకరించకపోవడంతో ఇరు పార్టీలు పోటీ చేశాయి. రాహుల్‌, సోనియా గాంధీ పోటీ చేస్తున్న రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. ఈ నేపధ్యంలోనే మాయావతి ఈ నిర్ణయం తీసుకోవడంపై ఢిల్లీ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. ఎన్నికల ప్రచారం సమయంలోనే కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ప్రచారం సాగించిన మాయావతి పరిస్ధితి ఇలాగే కొనసాగితే మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు మద్దతు కూడా రద్దు చేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అయితే బీఎస్పీ నాయకుడు సతీష్‌ మిశ్రా రాహుల్‌తో భేటి అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో మెరుగైన స్థానాలు సాధిస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అసలు ఈ భేటి జరుగుతుందా ? జరిగితే ఏయే అంశాలపై చర్చించనున్నారనే చర్చ జరుగుతోంది.

విపక్షాలకు స్టాలిన్‌ షాక్‌

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విపక్షాలకు ఊహించని షాక్‌ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే 23న ఎన్డీయేతర పక్షాల భేటీ నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు వెలువడే 23వ తేదీన ఎలాంటి సమావేశం ఉండదని, ఆ రోజు సమావేశం కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉన్నా తమ పార్టీ వాటి గురించి పెద్దగా ఆలోచించట్లేదని స్టాలిన్‌ అన్నారు. మూడు రోజుల్లోగా ప్రజల తీర్పు ఏంటో అందరికీ తెలుస్తుంది. మేమంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏదైనా కూటమి కేంద్రంలో అధికారం వచ్చేందుకు అవకాశం ఉంటే డీఎంకే భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా.. మే 23న ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత దానిపై పూర్తి వివరణ ఇస్తానని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని నియోజకర్గాల ఫలితాలు, మెజార్టీపై స్పష్టత తదితర విషయాలు తెలిసేందుకు 23 సాయంత్రం వరకు సమయం అవుతుందని.. ఆ తర్వాత విపక్షాల సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని డీఎంకే అభిప్రాయపడుతోంది. విపక్షాల సమావేశాలకు ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి నో చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌ పోల్స్‌పై తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. అన్నాడీఎంకేపై వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తప్పుపట్టారు. గతంలో అన్నాడీఎంకే ఓడిపోతుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయి.మే 23న ఎవరు గెలుస్తారనేది ఫలితాలే చెబుతాయన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close