కారెక్కిన వంటేరు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గజ్వెల్‌ కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. ప్రతాప్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు వంటేరు చెప్పారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరుతారని ఆయన కుమారుడు నిన్నే ప్రకటించారు. అయితే అవన్నీ ఊహాగానాలని, ప్రతాప్‌రెడ్డిని తెరాసలోకి ఎవరూ ఆహ్వానించలేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. పార్టీలోకి ఆయన వచ్చినా రానివ్వబోమని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో తెరాసలో తాను చేరుతున్నట్లు వంటేరు ఈ ఉదయం స్వయంగా ప్రకటించి తాజాగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందువల్లే రెండు సార్లు ఓడిపోయానని తెలిపారు. సీఎం ప్రాతినిథ్యం వహించడం గజ్వెల్‌ ప్రజలు చేసుకున్న అదృష్టం. నాలుగేళ్లలో గజ్వెల్‌ రూపురేఖలు మారిపోయాయి. ప్రజలు అడగకుండానే సీఎం కేసీఆర్‌ ఎన్నో పనుల చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ పై వంటేరు ప్రతాప్‌ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తాను కేవలం ఎమ్మెల్యేగా కావాలన్న ఆశతో పోటీ చేశానని, కెసిఆర్‌పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here