ఎవరి నేరచరిత్ర వారే విప్పాల్సిందే.!

0

★ తప్పు చేయని వారెవరు?
★10మంది సిఎంలు..67 కేసులు
★ తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలు 28, ఎమ్మెల్యేలు 149
★ జాగ్రత్త పడిన కాంగీదేశం
(ఆదాబ్ హైదరాబాద్ సంచలన కథనం)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢల్లీ, ఆదాబ్ హైదరాబాద్)

ఏం చేసినా అడిగేవారు లేరు. అధికారం చాటున అక్రమాలు. తెర మాటున తెగించే అవినీతి. డక్కీమక్కీలు తిని కోట్లు దా(దో)చుకున్నారు. దిగజారటానికి ‘పవర్’ ఓ సుఖవంతమైన జారుడుబండ. ఇంకా దిగజారి పదవుల నీడలో దోపిడి, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు… ఇవి రాజకీయుల ముసుగులో దందాలు చేసే ‘నీచ్’మైన.. కమీన్.. కుత్తేలకు కాలం చెల్లింది. ఇక ఎవడి నీచమైన బతుకు వాడే డప్పు కొట్టుకుంటూ చెప్పుకోవాలి. డబ్బులిచ్చి మరీ ప్రచారం చేసుకోవాలి. తమ వెధవ బతుకుల గురించి ప్రజలకు ముచ్చటగా చెప్పుకోవాలి. ఈ ప్రయత్నం అభినందనీయమైన ఆరంభమే.! నికృష్టమైన పనులు చేయాల్సినవి చేసి… దర్జాగా అసెంబ్లీలో కాలేసుకున్న దొంగల బతుకు బయటకు రానున్నది. ముఖ్యమంత్రుల నుంచి శాసనసభ్యుల వరకు ఈ నీచ చరిత్ర ఉంది. (ఈ కథన పరిశోధనలో ఆదాబ్ బృందాలకు
ఎన్నో చావు బెదిరింపులు వచ్చాయి. ధైర్యంగా ముందుకు సాగారు. ఇకముందు కూడా అదే స్పూర్తితో ముందుకు సాగుతోంది. దటీజ్ ఆదాబ్ హైదరాబాద్.)

ముఖ్యమంత్రులపైనే క్రిమినల్ కేసులు..!:
దేశ చరిత్రలో అవాంఛనీయ దృక్కోణం ఇది. బాధాకరమైంది. నిజాలను నిర్భయంగా మాట్లాడాల్సిన ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడుతోంది. దేశంలోని 35 శాతం మంది ముఖ్యమంత్రులు నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో 10 మంది ఏదో ఒక క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నవారే.

26 శాతం సీఎంలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికల అఫిడివిట్‌లో స్వయంగా ఆ, యా ముఖ్యమంత్రులు పేర్కొన్న వివరాల ఆధారంగానే ఈ విషయాలు ‘అత్యంత రహస్యం’గా వెలుగులోకి వచ్చాయి.

తిరుగులేని ఆధారాలు ఇవే..:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణీలీస్ పై సాధారణ కేసులు 22 కాగా, అందులో 3 అతి తీవ్రమైనవి.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై 11 కేసులుండగా ఒకటి తీవ్రమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై 10 కేసులుండగా 4 తీవ్రమైనవి. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువీర్ దాస్ పై 8 కేసులుండగా.. ఒకటి తీవ్రమైంది.
పంజాబ్ సిఎం. అమరేంద్ర సింగ్ పై 4కేసులుండగా 3 తీవ్రమైనవి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
యోగి ఆదిత్యానాథ్ పై 4 కేసులుండగా ఒక కేసు తీవ్రమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై రెండు కేసులుండగా ఒకటి తీవ్రమైంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన కేసుల ప్రస్థావన లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఉన్న ఒక కేసు తీవ్రమైంది.

‘సాధారణ’ సిఎంలు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై 3 సాధారణ కేసులున్నాయి. తీవ్రమైన కేసులు లేని ఇద్దరు ముఖ్యమంత్రులలో ఆయన ఒకరు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ పై రెండు కేసులు ఉన్నాయి.

బంగారు తెలంగాణలో..:
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలుంటే ఇందులో 67 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 46 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. ఈ విషయాలను 2014 నాటి ఎన్నికల అఫిడవిట్‌‌లలో వారే స్వయంగా పేర్కొన్నారు. కానీ తాము ఫలానా కేసులలో నిందితులమని బహిరంగంగా మాట్లాడటానికి వారు ఇష్టపడటం లేదు సరికదా.. మొఖాలు చాటేస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీలో అత్యధికం..:
గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ నుంచి గెలిచిన 41 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యా నేరం కింద తనపై క్రిమినల్ కేసు నమోదైందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు. మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకర్‌ (టీఆర్ఎస్) కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ముగ్గురు నేతలలో కె.కేశవరావు, డి.శ్రీనివాస్ ఇద్దరూ గతంలో పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వారే. ప్రస్తుతం ఇద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. శాసనమండలి ఛైర్మన్ గా పనిచేస్తున్న నేతి విద్యాసాగర్ పై అరోపణలు వచ్చి చల్లబడ్డాయి.

రంగారెడ్డి జిల్లాలో భూకుంభకోణంలో తన కుటుంబం తీసుకున్న భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుంటానని కెకె ప్రకటించారు. మరో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కూడా రంగారెడ్డి జిల్లాలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ వద్ద భూములు కొనుగోలు చేశారు. అతి తక్కువ ధరకే భూములు కొన్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై డిఎస్ సైతం తన భూములు వెనక్కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్ గా పనిచేస్తున్న నేతి విద్యాసాగర్ కు నయీంతో సంబంధాలున్నాయని లీకులు వచ్చాయి. త్వరలోనే ఆయనను అరెస్టు చేయనున్నట్లు కూడా పాలక పెద్దల నుంచి సంకేతాలు అందాయి. నయీంతో అధికార పార్టీలో డజన్ల కొద్దీ నేతలకు సంబంధాలున్నాయని తర్వాత తేలింది. ఈ కేసు త్రిశంకు స్వర్గంలో ఉంది

కేసుల జాబితా అందుకున్న ఏఐసీసీ:
కాంగ్రెస్ నుంచి 21 మంది ఎన్నిక కాగా వారిలో ఏడుగురిపై కేసులున్నాయి. ఇందులో మైనారిటీ నాయకుడు షబ్బీర్అలీని, ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరీలను అక్రమంగా కేసులలో ఇరికించే ప్రయత్నం జరిగినట్లు అధిష్ఠానం గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందిందిన జాబితాలో…

ఉత్తమకుమార్ రెడ్డి : 2014 ఎన్నికల్లో కారులో రూ.2 కోట్ల డబ్బు దొరికాయి. హౌసింగ్ కుంభకోణంలో సీఐడీ విచారణ

జానారెడ్డి : వ్యాపార లావాదేవీలు, ఆస్తులపై ఈడీ అంతర్గత విచారణ జరుగుతుంది. నోటీసులు కూడా అందాయి.

డీకే అరుణ : ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్నప్పుడు గనుల కేటాయింపుల్లో అక్రమాలు. కేసులు నడుస్తున్నాయి.

గీతారెడ్డి : ఎం.ఆర్. భూముల కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

షబ్బీర్ అలీ : ఎంబీసి జ్యువెలర్స్ అక్రమ లావాదేవీల కేసులో సీబీఐ కేసు నడుస్తోంది. ఈ కేసు నుంచి ఆ సంస్థకు అనుకూలంగా ఏకంగా సీబీఐ అధికారులకే లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయనకు ఎలాంటి నోటీసులు నేటి వరకు అందలేదు. అందే అవకాశం కూడా లేదు. కానీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి : నోటుకి ఓటు కేసు, అక్రమ ఆస్తులు, మనీల్యాండరింగ్ పై ఈడీ, ఐటీ విచారణ జరుగుతుంది.

జగ్గారెడ్డి : మనుషుల అక్రమ రవాణాలో అరెస్ట్. జైలుకి వెళ్లి బెయిల్ పై వచ్చారు. కేసు విచారణలో ఉంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ పై : సుశీ ఇన్ఫ్రా కాంట్రాక్టులపై అవినీతి ఆరోపణలు

గండ్ర వెంకట రమణ : అక్రమ ఆయుధాల కేసు

కూన శ్రీశైలం గౌడ్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.
ఈ వివరాలన్నీ ఏఐసీసీ ముందస్తుగానే సేకరించింది.

వీరూ తక్కువేం కాదు..:
టీడీపీ నుంచి 15 మంది గెలుపొందగా వారిలో 9 మందిపై, ఎంఐఎం నుంచి ఏడుగురు గెలిస్తే వారిలో ఐదుగురిపై క్రిమినల్ కేసులున్నాయి.

బీజేపీ నుంచి ఐదుగురు గెలిస్తే ఒకరిపై క్రిమినల్ కేసు ఉంది. మరో స్వతంత్ర అభ్యర్థిపైనా క్రిమినల్ కేసు నమోదై ఉంది.

జగ్గారెడ్డికి ఆయుధం:
2007లో నమోదైన మనుషుల అక్రమ రవాణా నకిలీ పాస్‌పోర్ట్ కేసులో ఇటీవల జగ్గారెడ్డి అరెస్టు అయ్యారు. అప్పట్లో రషీద్ ఖాన్ ఇచ్చిన వాగ్మూలంలో జగ్గారెడ్డి పేరు లేదు. రషీద్ ఖాన్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావుల పేర్లు ఉన్నాయి. హరీష్ రావు కుటుంబసభ్యుల పేర్లతో… ఇప్పటికీ అమెరికాలో కొంత మంది ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది జగ్గారెడ్డికి ఎన్నికల ఆయుధంగా మారే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో..:
విషయానికి వస్తే కొత్తగా ఎన్నిక కాబడిన 175మంది ఎమ్మెల్యేలలో 82 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో అత్యధికంగా 52మంది టిడిపి నేతలు ఉండగా 29మంది వైకాపా నేతలు, ఇతరులు ఒకరు ఉన్నారు. కొత్తగా ఎన్నికైన నలుగురు బిజెపి నేతలపై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు.

ఎంపీలు కూడా ఉన్నారు..:
ఆంధ్రప్రదేశ్ లో 25మంది ఎంపిలలో క్రిమినల్ కేసులు నమోదు అయిన వారిలో టిడిపి 15మందితో అగ్రస్థానంలో ఉండగా వైకాపా 4, భాజపాలో ఒకరు ఉన్నారు.

తెలంగాణాలో…:
ఎన్నిక కాబడిన 17మంది ఎంపిలలో 8మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 5గురు తెరాస నేతలు, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు పార్టీకి ఒకరు ఉన్నారు.

గుట్టు రట్టు అయితే గడ్డు కాలమే…:
రాజకీయ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలు, స్వలాభం కోసం నేతలు చేసిన నేరాలను ఎన్నికల కమీషన్ ముందు గుట్టు విప్పితే ఈ నాయకులు గడ్డుకాలం ఎదురుకోక తప్పదు. ఈ నేరాల చిట్టా అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంన్నాయి. ఇప్పటికే కొందరు నేతలు ప్రత్యర్థుల నేర చరిత్రను తవ్వే పనిలో నిమగ్నమైయ్యారు.

ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై నేర ఆరోపణలతో రంగులు
జల్లి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ముఖ్యంగా న్యాయ నిపుణులను సంప్రదిస్తూ కేసుల వివరాలపై సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థుల నేర చరిత్రను తవ్వి తీసి పూర్తి వివరాలతో ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేర వివరాలను వెల్లడిస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారనే అనుమానాలు అన్ని పార్టీల అభ్యర్థులను వెంటాడుతున్నాయి. ఈ నిందితులు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్‌ల ఆధారంగా తెలంగాణ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) ఒక నివేదికను రూపొందించాయి. గత శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొందరు ప్రజాప్రతినిధులు హత్య, కిడ్నాప్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే, ప్రస్తుతం కేసుల విచారణ ఏ స్థాయిలో ఉందనేది మాత్రం వెల్లడించలేదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన చాలా కేసులను ఎత్తివేసింది. వాటి వివరాలను అందులో ప్రస్తావించలేదు. ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు పేర్కొన్న అంశాల ఆధారంగానే ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here