Featured

పిల్లలకు మనమిచ్చే ఏకైక ఆస్తి చదువు

  • రాష్ట్రంలో 33శాతం నిరక్షరాస్యులు
  • ‘అమ్మ ఒడి’ ఓ విప్లవాత్మక మార్పు
  • విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది
  • తల్లిదండ్రులకు సీఎం భరోసా

అమరావతి

పిల్లలకు మనమిచ్చే ఏకైక ఆస్తి చదువు. నాణ్యమైన విద్యను వారికి అందిస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడి పథకంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన వివరాలను సీఎం వెల్లడించారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యులు 33శాతం ఉన్నారని, దేశంలో కంటే రాష్ట్రంలో చదువురాని వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. తన పాదయాత్ర ముగిసిన రోజైన జనవరి 9న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించామని సీఎం చెప్పారు. ఈ పథకం కింద 40,19,323 మంది తల్లులకు రూ. 6,028 కోట్లను వారి వారి అకౌంట్లలో జమచేశామని వెల్లడించారు. అమ్మఒడి పథకం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే విద్యారంగంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మ ఒడి అని పేర్కొన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. జనవరి 9న తన పాదయాత్ర ముగిసిన రోజున ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. అర్హులై.. సాంకేతిక కారణాలతో లబ్ది పొందని మిగతా తల్లులకు వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో కూడా మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పిల్లలకు ప్రతీ రోజు ఒకేరకమైన భోజనం కాకుండా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ప్రతీ సోమవారం అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, స్వీటు, చిక్కీ.. మంగళవారం- పులి¬ర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు… బుధవారం- వెజిటబుల్‌ రైస్‌, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ… గురువారం కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు.. శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ… శనివారం- అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌ ఉండేలా మెనూ రూపొందించాం. గోరుముద్ద పేరిట విద్యార్థులకు భోజనం అందజేస్తాం. అదే విధంగా పథకం సాఫీగా అమలు జరిగేలా… ఆయాల జీతం రూ. 1000 నుంచి రూ. 3 వేలకు పెంచాం. దీని వల్ల దాదాపు రూ. 344 కోట్ల భారం పడుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇక మధ్యాహ్న భోజన పథకం పనితీరును పర్యవేక్షించేందుకు నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. పేరెంట్స్‌ కమిటీ నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తాం. ఇండిపెండెంట్‌ ఆడిట్‌ను కూడా రెగ్యులర్‌గా పరిశీలిస్తాం.

ఎక్కడా అవినీతి ఉండకూడదనే ఉద్దేశంతో కోడిగుడ్లలో కూడా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా ప్రపంచంతో పిల్లలు పోటీ పడేలా రైట్‌ టు ఇంగ్లీష్‌ మీడియం తీసుకువచ్చామని తెలిపారు. ఇంగ్లీషు మీడియంతో పిల్లల చదువులు మారతాయి. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంగ్లీషు మీడియంపై విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. జనవరి 31లోగానే పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తిచేస్తాం. పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులుకు అందుబాటులో ఉంచుతాం. తెలుగును తప్పనిసరి స్జబెక్టుగా ఉంచుతాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులకు మేలు చేసే విధంగా… నాడు-నేడు కార్యక్రమాన్ని తీసుకువచ్చామని సీఎం జగన్‌ అన్నారు. 45వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లలో మార్పులు తేవాలి. అక్కడ మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం. వాటి రూపురేఖలు మార్చివేస్తున్నాం’ అని తెలిపారు. అదే విధంగా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ విద్యార్థికి ఓ కిట్‌ అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. జూన్‌ 1న 36 లక్షల మందికి పిల్లలకు కిట్‌ అందిస్తాం. దీని ధర రూ. 1350. స్కూలు బ్యాగు.. మూడు జతల యూనిఫాంలు(బట్ట ఇచ్చి.. కుట్టుకూలీ కూడా ఇస్తాం).. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టుతో కూడిన కిట్‌ను విద్యా కానుక పేరిట అందజేస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా ఫిబ్రవరి నెలలో వసతి దీవెన కింద.. హాస్టల్‌లో ఉండే పిల్లల తల్లికి రెండు దఫాల్లో రూ. 20 వేలు అందిస్తామని తెలిపారు.

అమ్మఒడి ఓ విప్లవాత్మక చర్య

వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాల్సిన అవసరముందన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద విద్యార్థులను సరిగా పట్టించుకోలేదని, దూరదృష్టితో సీఎం జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వంశీ కొనియాడారు. అమ్మఒడి పథకం వల్ల సంక్రాంతికి ముందే.. అందరు తల్లిదండ్రుల ముఖాల్లో పండగ వాతావరణం కనిపించిందని చెప్పారు. అమ్మఒడి వల్ల దారిద్యర్రేఖకు దిగువన ఉన్న చాలా కుటుంబాలు లబ్దిపొందుతాయని, సీఎం జగన్‌ ఉన్నారన్న భరోసాతో వారి పిల్లలను పాఠశాలలకు పంపిస్తారని ఆయన అన్నారు. అంతకుముందు తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారని అన్నారు. నాడు-నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. గతంలో కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే ఇంగ్లీష్‌ మీడియం ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం వచ్చిందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని ఆమె కొనియాడారు. అమ్మఒడి పథకం పవిత్రమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. ఈ పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఇటువంటి గొప్ప పథకాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించడం బాధాకరం అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినందకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close