జాబిలిపైకి మరోసారి..

0

జూలై 15న చంద్రయాన్‌-2 ప్రయోగం

  • వెల్లడించిన ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌

హైదరాబాద్‌ :

చంద్రయాన్‌-2 మిషన్‌ను జూలై 15వ తేదీన ప్రయోగించనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ తెలిపారు. జూలై 15వ తేదీన తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు ప్రయోగించనున్నారు. చంద్రయాన్‌-2 మిషన్‌లో మూడు మాడ్యుళ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌ త్రీ రాకెట్‌ ద్వారా ప్రయోగిస్తారు. చంద్రయాన్‌-2 మొత్తం బరువు సుమారు 3.8 టన్నులు ఉంటుందని, దాంట్లో ప్రొపెల్లంట్‌ బరువే సుమారు 1.3 టన్నులు ఉందని తెలిపారు. సెప్టెంబర్‌ 6 లేదా 7న చంద్రయాన్‌-2 రోవర్‌ చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుందని శివన్‌ తెలిపారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఖరీదు 603 కోట్లు అని ఇస్రో చైర్మన్‌ చెప్పారు.

చంద్రయాన్‌ -2 ప్రయోగ ఫొటోలు విడుదల..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చందగ్రహంపైకి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ -2 ప్రయోగానికి సంబంధించిన ఫోటోలు బుధవారం ఉదయం విడుదలయ్యాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ ఎంకే-ఎఎఎ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా చందగ్రహంపైకి ఆర్బిటార్‌, ల్యాండర్‌, రోవర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 

ల్యాండర్‌కు ‘విక్రమ్‌’ అని, రోవర్‌కు ‘ప్రగ్యాన్‌’ అని నామకరణం చేశారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్ర నుంచి జూలై 15న చంద్రయాన్‌-2 మిషన్‌ను ప్రయోగించనున్నారు. 2019 సెప్టెంబర్‌ 6న అది చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి. బెంగుళూరులో ఇస్రోకు చెందిన శాటిలైట్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లో చంద్రయాన్‌-2కు సంబంధించిన పరికరాలను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ల్యాండర్‌, ఆర్బిటార్‌ మాడ్యుళ్లలో పరికరాలను బిగించారు. ఆర్బిటార్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ద్వారా చంద్రయాన్‌-2 శాటిలైట్‌ను చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆర్బిటార్‌ నుంచి ల్యాండర్‌ వేరుపడుతుంది. చంద్రుడిపై ఉన్న దక్షిణ ధ్రువంలో ల్యాండర్‌ దిగుతుంది. అనంతరం శాస్త్రీయ పరీక్షల నిమిత్తం చందగ్రహంపై రోవర్‌ సంచరిస్తుంది. చంద్రయాన్‌-2 ప్రయోగం ద్వారా 11 పేలోడ్స్‌ను కూడా కక్ష్యలోకి తీసుకువెళ్లనున్నారు. ఇందులో భారత్‌కు చెందిన 6, యూరోప్‌కు చెందిన 3, అమెరికాకు చెందిన 2 పేలోడ్స్‌ ఉంటాయి. ఇస్రో 2009లో చంద్రయాన్‌-1ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here