లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా!

0

ఓం బిర్లాను స్పీకర్‌గా ఎంపిక చేసిన బీజేపీ

  • మద్దతు తెలిపిన వైకాపా, బిజూ జనతాదళ్‌
  • ఏకగ్రీవం కానున్న స్పీకర్‌ ఎంపిక

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పదిహేడో లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. స్పీకర్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. 17వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. మంగళవారం కూడా నూతన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు ఎన్డీయే వర్గాలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఓం బిర్లా కోటా నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌నరైన్‌ మీనాపై బిర్లా విజయం సాధించారు.

ఇదిలాఉంటే ఇదితమ కుటుంబానికి అత్యంత గర్వకారణంగా భావిస్తున్నట్టు ఓం బిర్లా సతీమణి అమిత్‌ బిర్లా సంతోషం వ్యక్తం చేశారు. ఆయనను ఎన్నుకున్నందుకు మంత్రిమండలికి రుణపడి ఉంటామన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓంబిర్లా కాంగ్రెస్‌ అభ్యర్థి రాంనారాయణ్‌ మీనాపై 2.5 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈసారి ఎన్నికల్లో పోటీచేయకపోవడంతో.. ఆమె స్థానంలో ఓం బిర్లా బాధ్యతలు చేపట్టనున్నారు. సభలో ఎన్డీయేకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఆయన ఎన్నిక లాంఛనంగానే జరగనుంది. ఒకవేళ ఓటింగ్‌ నిర్వహించాల్సి వస్తే బుధవారం ఈ పక్రియ జరిగే అవకాశం ఉంది.

ఓం బిర్లాకు వైసీపీ మద్దతు ..

17వ లోక్‌సభ స్పీకర్‌ అభ్యర్థిగా ఎన్‌డీఏ తరఫున బరిలోకి దిగబోతున్న బీజేపీ ఎంపీ ఓం బిర్లాకు వైసీపీ మద్దతు ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి సంతకం చేశారు. ఓం బిర్లాకు బిజూ జనతా దళ్‌ పక్ష నేత కూడా మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. అనేక పార్టీలు ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతిస్తుండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్య అవకాశం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here