‘న్యాయ్‌’ సొమ్మును.. మహిళల ఖాతాల్లో వేస్తాం

0
  • రైతులకోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతాం
  • దేశ ఐక్యతను చాటడంకోసమే దక్షిణాది నుంచి పోటీ చేస్తున్నా
  • కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

తిరువనంతపురం : ‘న్యాయ్‌’ సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కేరళలోని కొల్లాలంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ఐక్యతను చాటడం కోసమే తాను దక్షిణాది నుంచి పోటీ చేస్తున్నానని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తి అభిప్రాయాలకు, ఉద్దేశాలను గౌరవించాల్సి ఉంటుందన్నారు. ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండడమే తాము కోరుకుంటున్నామని తెలిపారు. న్యాయ్‌ పథకాన్ని వివరిస్తూ.. పేదరికంపై మెరుపు దాడి చేయాలన్న ఉద్దేశంతోనే దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.72వేలు అందించాలని నిర్ణయించామని రాహుల్‌ తెలిపారు. నగదు నిర్వహణ పురుషుల కంటే స్త్రీలకే బాగా తెలుసని.. అందుకే ‘న్యాయ్‌’ సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేయనున్నామన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అంకుర పరిశ్రమల ఏర్పాటుకు మూడేళ్ల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే భాజపా, సంఘ్‌ పరివార్‌పైనా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌పై ఎంత దాడి చేసినా తాము మాత్రం అహింస, ప్రేమతోనే సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని బాదాం రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. ఇతర సంస్కృతీ సాంప్రదాయాలు ఆదరించడం, సహనంలో కేరళ ప్రజలు ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పథకాలను వివరిస్తూనే.. భాజపాపైనా ఆయన నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన ఏ ఒక్క హావిూని నెరవేర్చలేదని ఆరోపించారు. పంటలకు మద్దతు ధర, రెండు కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాలోకి రూ.15లక్షలు ఇలా అన్ని హావిూలను తుంగలో తొక్కారని రాహుల్‌ మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here