Featuredస్టేట్ న్యూస్

ఇక రణరంగమే..

మంకు వీడని ఇరువర్గాలు..

వెనక్కి పోయేదిలేదంటున్న ఆర్టీసీ..

ప్రభుత్వ డెడ్‌లైన్‌ విఫలమే..

అట్టుడుకుతున్న తెలంగాణ..

రాష్ట్రం రణరంగంగా మారుతోంది.. ప్రభుత్వం విధించి డెడ్‌లైన్‌ దాటిపోయింది.. ఆర్టీసీ కార్మికులు వెనుకడుగు వేసే ప్రసక్తేలేదంటున్నారు.. ఐదవ తారీఖు అర్థరాత్రి వరకు ఇచ్చిన తుది గడువు ముగిసింది. ఎవరికి వారే యమునాతీరుగా అన్నట్లుగా పంతాలు, పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాని శాంతియుతంగా సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. ఆర్టీసీ సమ్మె ఇప్పటికే నెలరోజులు దాటిపోయింది. ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోగా మాటలతో ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉద్యోగులు ఉన్నారు. ప్రాణాలు పోతున్న ప్రభుత్వం కనీసం మానవత్వంతో స్పందించకుండా మరింతగా వేధించినట్లుగా మాట్లాడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా చర్చలకు పిలిచి తమ డిమాండ్లను నేరవేర్చుతేనే సమ్మె ముగిస్తామని లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. ప్రభుత్వం బెదిరింపులకు ఉద్యోగం మీద భయమో, భక్తితోనే పది, పదిహేను మంది ఉద్యోగులు తప్ప ఉద్యోగాలలో చేరిన వారు మాత్రం ఎవరూ లేరని తెలుస్తోంది.. ప్రభుత్వం ఎంత హెచ్చరించినా, భయపెట్టాలని చూసినా సమ్మె నిరంతరం సాగుతోంది తప్ప దానికి అలుపంటూ లేనే లేదని ఆర్టీసీ కార్మికులు చెపుతున్నారు. శాంతియుతంగా చర్చలు పిలిచి వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం ఆలోచిస్తే దానికి మేము సైతం సిద్దమేనంటున్నారు ఉద్యోగులు. ఆర్టీసీతో అసలు చర్చలు లేవని ఆరునూరైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదంటోంది ప్రభుత్వం.. ప్రభుత్వాధినేత కెసిఆర్‌ ఇచ్చిన ఆఖరి గడువు ముగియడంతో ఇప్పుడు సమ్మె ఎటూ దారితీస్తుందో, రాష్ట్ర భవిష్యత్తు ఎటు వెళుతుందో అర్థంకాక ప్రజలు తలల పట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును కూడా ఆర్టీసీ కార్మికులు పక్కన పెట్టేసరికి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన విధానం ఏంటో ఎవ్వరికి అంతుపట్టడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలేంటీ వాటిపై ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటిని నియమించి వాటిని కార్మికులకు మేమున్నామని భరోసా ఇవ్వాల్సిందీ పోయి భాదలో ఉన్న కార్మికులపై మరింత నిప్పురాజేసినట్లుగా మాట్లాడుతుండటంతో ఆర్టీసీ కార్మికులు ఆవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలను అవపోసాన పట్టిన ఆపరచాణక్యుడు కెసిఆర్‌ ఇప్పుడు ఆర్టీసీ ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏలాంటి హెచ్చరికలు చేసిన భయపడే ప్రసక్తే లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు.. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం సిద్దపడుతుంటే, ప్రభుత్వానికి దీటుగా విజయం సాధించేలా ఆర్టీసీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇరువురి హోరాహోరీతో రాష్ట్రం రణరంగంగా మారుతూ ప్రజలకు ఇప్పట్లో ఇబ్బందులు తప్పేలా లేనట్టుగానే కనబడుతున్నాయి..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ఆర్టీసీ సమ్మె ముగియడమా, మరింత రాటుదేలడమనేది ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభుత్వం ఆర్టీసీతో ఇప్పటివరకు శాంతియుతంగా చర్చలకు పిలిచిందీ లేదు. నిరంతరంగా వారు చేస్తున్న సమ్మెపై మరింత నిప్పు రాజేస్తున్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతుండటంతో సమ్మె చిలికి చిలికి గాలివానగా మారుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విధించిన డెడ్‌లైన్‌ కూడా కార్మికులు కాలదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శాంతియుతంగా చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తే ముందుకు వస్తామని లేదంటే తాడో, పేడో తేల్చుకోవడానికి సిద్దమంటున్నారు. కాని ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాత్రం చర్చలకు పిలిచే ప్రసక్తే లేదంటున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపుపై అటు ప్రభుత్వం కానీ, ఇటు కార్మికులు గానీ పట్టు వీడడడం లేదు. ఉద్యోగంలో చేరేందుకు సిఎం కెసిఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ ముగిసి పోతున్న దశలో బుధవారం నుంచి ఆర్టీసీ కథ కంచికి చేరినట్లేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేబినేట్‌ భేటీ తరవాత సిఎం చేసిన ప్రకటన చూస్తుంటే కెసిఆర్‌ తన నిర్ణయం పట్ల కఠినంగా ఉన్నారన్న సంకేతాలను ఇచ్చారు. అలాగే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ కూడా ఉంది. కార్మికుల పక్షాన గట్టిగా తీర్పు వస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇదే సందర్భంలో కార్మిక సంఘాలు కొత పట్టు విడుపును ప్రదర్శిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె 32వ రోజుకు చేరుకున్న దశలో కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని సంఘాలు కోరుకుంటున్నాయి. కానీ సిఎం కెసిఆర్‌ మాత్రం అసలు సంఘాల ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారు. అందుకే ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే విధుల్లో చేరాలనే డిమాండ్‌ నుంచి జెఎసి నేతలు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల 5 లోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ విధించిన గడువు మంగళవారం అర్థరాత్రితో ముగిసింది.

కార్మికులకు ధైర్యం చెపుతున్న ఆర్టీసీ నాయకులు

రంగంలోకి దిగిన ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులెవరూ విధుల్లో చేరకుండా వారికి ధైర్యం చేప్పేందుకు ఉపక్రమించారు. ఆర్టీసీ జేఏసీలో టీఎంయూ, ఈయూ సంఘాలుండగా, వేరుగా ఉన్న ఎన్‌ఎంయూ నేతలు సైతం సమ్మె విచ్ఛిన్నం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కార్మిక సంఘాలు వేర్వేరుగా అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. కార్మికుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొంతమందికి ఫోన్లు చేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మెజారిటీ కార్మికులు విలీనం డిమాండ్‌ను పక్కనపెడితే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడే ఏయే డిమాండ్ల నుంచి తగ్గాలనే దానిపై నిర్ణయానికి రావాలని సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే కార్మికులెవరూ విధుల్లో చేరొద్దని, ధైర్యంగా ఉండాలని నేతలు చెప్పారు. విధుల్లో చేరిన వారిని సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు నేతలు చెప్పారు. కొన్నిచోట్ల విధుల్లో చేరిన వారు కూడా తిరిగి సమ్మెలో పాల్గంటు న్నట్లు స్పష్టం చేశారు. డిమాండ్లు సాధించుకునే దిశగా సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. కాగా, ఇప్పటివరకు 24 మంది కార్మికులు విధుల్లో చేరినట్లు తెలిసింది. మరోవైపు విపక్ష నేతలు కూడా వారికి అండగా నిలిచారు. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీలకు అతీతంగా బిజెపి,కాంగ్రెస్‌,టిజెఎస్‌, లెఫ్ట్‌ నేతలు కలసికట్టుగా కార్మికుల పక్షాన పోరాడుతున్నారు. పార్టీల విభేదాలు పక్కన పెట్టి వారికి అండగా నిలిచారు. దీంతో కార్మికుల సమ్మె పట్ల సానుకూలత వచ్చింది. ప్రజల్లో కూడా ఆర్టీసీ కార్మికులతో చర్చించాలన్న అభిప్రాయం వస్తోంది. కేవలం ప్రవేటీకరణ మంత్రంతో కెసిఆర్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇందులో స్వప్రయోజనాలు దాగి వున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే సమ్మె పట్ల ఆర్టీసీ కార్మికులు సానుకూలంగా ఉన్నారని, కార్మికుల మద్దతుతోనే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. సీఎం డెడ్‌లైన్‌ విధించినా కార్మికులెవరూ విధుల్లో చేరట్లేదని స్పష్టం చేశారు. జేఏసీని చర్చలకు ఆహ్వానించి 26 డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు మరోసారి విన్నవించుకుంటున్నట్లు తెలిపారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, భేషరతుగా విధుల్లో చేరడానికి కార్మికులు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. జీతాలు లేకుండా పోవడం ఒక ఎత్తయితే,ఉద్యోగాలు కూడా ఉండవన్న బెదరింపులతో ఇప్పటికే పలువురు కార్మికులు చనిపోయారు. సమ్మె జరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా అనేకమంది కార్మికులు గుండెపోటుతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా మంగళవారాలు మానవహారాలతో ఆందోళనచేపట్టారు. అలాగే 6న కుటుంబసభ్యులతో దీక్ష, తాత్కాలిక సిబ్బందికి విన్నపం, 7న ప్రజా సంఘాల ప్రదర్శన, 9న చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అలాగే ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం తక్షణమే చర్చలకు ఆహ్వానించాలని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలని తీర్మానించినట్లు ఎన్‌ఎంయూ ఒక ప్రకటనలో తెలిపింది. కెసిఆర్‌ విధించిన డెడ్‌లైన ముగియడంతో ఇప్పుడు సమ్మె ఏలాంటి రూపు సంతరించుకుంటుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం దీనిపై ఏలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close