Featuredరాజకీయ వార్తలు

ఇచ్చిన ఏ ఒక్క హామీని.. బీజేపీ అమలు చేయలేదు

  • గవర్నర్‌ను కలిసి సమస్యలను వివరించిన కాంగ్రెస్‌ నేతలు
  • కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నాడు
  • కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం
  • చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొంటాం
  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క

హైదరాబాద్‌

మోడీ, కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఆరోపించారు. శుక్రారం కేంద్రం ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. ఈసందర్భంగా పలు జిల్లాల్లో ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉంటే అంతకు ముందు గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీభవన్‌ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తతల నడుమ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. ర్యాలీ గాంధీభవన్‌ నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీభవన్‌ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయితే 11 మంది కాంగ్రెస్‌ నేతలకు మాత్రం గవర్నర్‌ను కలిసేందుకు అనుమతిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ ఆర్‌సీ కుంతియా, సీఎల్పీ నేత భ ట్టి విక్రమార్క, సీనియర్‌ నాయకులు జనారెడ్డిలుతో పాటుపలువురు గవర్నర్‌ తమిళసైని కలిశారు. ఈసందర్భంగా పలుసమస్యలపై ఆమెకు వినతిపత్రం అందజేశారు. కేంద్రం విధానాలపైనా.. రాష్ట్రంలోఆర్టీసీ పట్ల కేసీఆర్‌ నియంత విధానాన్ని గవర్నర్‌ కాంగ్రెస్‌ నేతలు వివరించారు. ఈ సందర్భంగా అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కుంతియా మాట్లాడారు.. మళ్ళీ బంగారం అమ్ముకొని దేశాన్ని పాలించే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చిందని విమర్శించారు. నెహ్రు హయాంలో తీసుకొచ్చిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా బీజేపీ అమలు చేయలేదన్నారు. ప్రధాని మోడీ నోట్ల రద్దు చేసి దేశాన్ని ఆర్థికంగా మరింత వెనక్కు నెట్టారని విమర్శించారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. దేశంలో ఎయిర్‌ ఇండియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతర ముఖ్యమైనా ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రం ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని కుంతియా ప్రశ్నించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ ఆర్ధిక విధానాల వల్ల దేశం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందని తెలంగాణ విమర్శించారు. మోడీ విధానాల వల్ల పరిశ్రమలు మూతబడ్డాయన్నారు. జీడీపీ 3 నుంచి 6 శాతానికి పడిపోయిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన విధానాలతో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో గవర్నర్‌ తమిళిసైకు వివరించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించొద్దని కోర్టు స్టే విధించటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ సమ్మె పరిణామాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చామన్నారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరామని, తాము చేసే ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని మండిపడ్డారు. శనివారం ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన చలో ట్యాంక్‌ బండ్‌ పిలుపుకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉధ్రిక్తంగా మారింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంశీ చందర్‌ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈనేపథ్యంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్‌ ముట్టడి ఉధ్రిక్తంగా మారింది. ఖమ్మంలో వీహెచ్‌ హన్మంతరావు, సంభాని చంద్రశేఖర్‌లు ముట్టడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురుకాంగ్రెస్‌ కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొండంతో పోలీసులు కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close