Featuredస్టేట్ న్యూస్

చదువులు కాదు… చావులు..

పిట్టల్లా రాలుతున్న విద్యార్థులు..

ఒత్తిడితోనే ఆత్మహత్యలు..

కర్మాగారాలుగా విద్యాలయాలు..

రాలిపోతున్నారు.. చిరునవ్వులతో, చిరంజీవులుగా ఎదగాల్సిన బావిభారతం పిట్టల్లా రాలిపోతున్నారు.. చదువు చదువు చదువంటూ కనిపెంచిన తల్లిదండ్రులే వారిని జీవితాలను బుగ్గి చేస్తున్నారు.. తాను ఎదగాలి, తన పిల్లలు కూడా ఎదగాలని తాపత్రయం పడుతున్న పెద్దపెద్ద చదువులు చదువుకున్న తల్లిదండ్రులే ఆ చిన్నారి మనసుల జీవితాలలో ఆటలాడుతోంది. బుడిబుడి అడుగులు వేసే వయస్సు నుంచే వారిని కర్మాగారాలు, కార్ఖానాల వంటి రూముల్లో బందీలుగా మార్చుతున్నారు. రామాయణ, మహాభారతలాంటి నీతి కథలు లాంటి కథలు చెప్పకుండా చదవొక్కటే జీవితమంటూ, చదువులేకపోతే జీవితమే లేనట్టు బలవంతపు ఆలోచనలనలతో గుదిబండగా మార్చుతున్నారు. పక్షుల్లా, స్వేచ్చగా ఎదగాల్సిన రేపటితరం కలలను కన్నీళ్లుగా మార్చుతున్నారు. ఎవరి ఆలోచనలకు విలువనివ్వాలో తెలియక, ఇష్టంలేని చదువులు చదవలేక మౌనంగా లోలోపల కుమిలిపోతూ మధ్యలోనే ప్రాణాలు కొల్పతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఎన్నో నిండు జీవితాలు కళ్లముందే రోజురోజుకు కనుమరుగవుతున్నా యధా రాజా, తథా ప్రజాలాగా మార్పు మాత్రం మనమంతా దూరంగానే ఉంటున్నాము…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

చదవాలి.. బాగా చదవాలి… మేము చెప్పిందీ మాత్రమే చదవాలి.. మా ఆలోచనలు, మా ఆశయాల కోసం మాత్రమే విద్యార్థులు ముందుకు నడవాలి. విద్యార్థులకంటూ స్వంత ఆలోచన, వారికంటూ స్వంత స్వేచ్చంటూ ఏమీ లేకుండా పోయింది. వేలకు వేలు ఫీజులు కడుతున్నాం చదవకుంటే ఏలా అనే ప్రశ్ననే ప్రతి తల్లిదండ్రుల్లో నేడు వినబడుతోంది. విద్యార్థులకు నచ్చిందీ తీసుకుందామనే ఆలోచన ఉన్నా కాని వారి ఆశలను, వారి ఆశయాలను మధ్యలోనే చిదిమేసే తల్లిదండ్రులు నేడు కొకొల్లలు ఉన్నారు. విద్యార్థుల చదువులును వారికోసం వేలు, లక్షలు ఖర్చుపెట్టే తల్లిదండ్రుల బలహీనతలను అసరాగా చేసుకుంటున్న కార్పోరేట్‌ కళాశాలలు అందిన కాడికి దండుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయి. వారికి నచ్చని సబ్జెక్టును బలవంతగా వారికి అంటగడుతూ వందకు ఒక్క మార్కు తక్కువొచ్చినా పిల్లలను మానసికంగా దెబ్బతీస్తున్నారు. అర్హతకు సాధించి మార్కులు సాధించినా కాని అటు కళాశాలలో ఆనందం లేక ఇటు ఇంట్లో తల్లిదండ్రుల మద్దతు లేక ఎవ్వరికి చెప్పాలో తెలియక భావిబారతం నలిగిపోతుంది. చదువే జీవితమా అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎవ్వరికి నచ్చిన రంగంలో వారిని ముందుకు నడిపిస్తేనే అక్కడ విద్యార్థులు పరిపూర్ణత సాధించగలరని పురాణాల నుంచి వింటూనే ఉన్నాము. కాని ఇప్పటి సమాజంలో విద్యార్థులకు నచ్చని రంగాన్ని ఎవరూ గుర్తించడమే లేదు. అందులో ఏముంటుంది వేల రూపాయల జీతంతో ఏలా బతుకుతావని బెదిరిస్తూ అస్సలు అవగాహన లేకున్నా, లేని రంగాన్ని తీసుకొమని ఒత్తిడి చేస్తూ చిన్నవయస్సులోనే వారి జీవితాలను బలి చేస్తున్నారు..

చదువుకున్న తల్లిదండ్రులతోనే అసలు సమస్య…

ఉన్నత చదువులు చదివిన తల్లిదండ్రులతోనే అసలు సమస్య మొదలవుతోంది. నేను ఉపాధ్యాయురాలిననో, లేక నేను ఇతర ప్రభుత్వ ఉద్యోగిననో చెపుతూ విద్యార్థులకు బలవంతపు చదువులను అలవాటు చేస్తున్నారు. వీరి బలవంతపు ఆలోచనలన్నీ వారిపైనే రుద్దుతున్నారు. సమాజంలో గొప్పగా చెప్పుకోవడానికి, నా కొడుకు, నా కూతురు నా ఫలానా కాలేజీలో చదువుతున్నారని చెప్పుకోవడానికి ఇష్టంలేకున్నా కార్పోరేట్‌ కాలేజీలలో చేర్పిస్తున్నారు. అక్కడ చదువు ఏలా ఉంటుందో తెలియదు. అక్కడ వసతి, సదుపాయాలు ఏలా అందిస్తున్నారో ఒక్కసారి కూడా వెళ్లరు కాని నా కొడుకు, నా కూతరు బాగా చదువుతున్నారా అని మాత్రం అడుగుతున్న చదువుకున్న తల్లిదండ్రులు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువురాని వారికంటే పట్టణ ప్రాంతాల్లో మేధావులుగా చెలామణీ అవుతున్న వారే బంగారు కలల విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. అసలు ముందుగా మార్పురావాల్సిందీ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనే. సమాజంలో బయటికి మాత్రం గొప్పలు చెపుతారు కాని తీరా వారి విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా మామూలుగానే తీసుకుంటారు. నా పిల్లలు, నా ఇష్టమనే ధోరణిని అవలంభిస్తూ వద్దనే వినకుండా, నచ్చని రంగాన్ని అంటగడుతూ చదువు, చదువంటూ వారిని చావుకు దగ్గరికి తీసుకెళుతున్నారు. ముందు మారాల్సిందే మేదావులని చెప్పుకుంటున్న తల్లిదండ్రులు. విద్యార్థుల ఆలోచన ఏంటో, వారి బలం ఏంటో, వారి బలహీనత ఏంటో తెలుసుకోకుండా నా కొడుకు అదీ కావాలి, నా కూతురు ఇదీ కావాలని చెపుతూ వారి చదువు కూడా వీరే డిసైడ్‌ చేస్తే రేపటి తరం ఏలా ముందుకు సాగుతోంది.

ఆగని విద్యార్థుల మరణాలు…

ఇంటర్‌మీడియట్‌ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయో లేదో విద్యార్థుల మరణాలు మాత్రం ఆగడమే లేదు. ఎంత చదివినా ఉత్తీర్ణత కాలేదని ఒకరు, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు నిరాశపరిచామని మరొకరు, ఒక్క సబ్జెక్ట్‌ తప్పిపోయామని ఇంకొకరు మనస్థాపానికి గురవుతూ అర్థాంతరంగా జీవితాన్ని చాలిస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని చిన్నవయస్సులోనే ముగిస్తున్నారు. నిన్న ఆరుగుతు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మరువక ముందే తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం అందరిలో విషాదాన్ని నింపుతోంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయ్యాయని మానసికంగా బాధపడుతూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన రుచిత ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చంద్రయ్య, బాలామణిలకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, రెండో కుమార్తెను వ్యవసాయం చేసుకుంటూ స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదివిస్తున్నారు. ఒక్క సబ్జెక్టులో అనుకున్నన్నీ మార్కులు రాలేదని రుచిక ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. కూతురు మరణవార్తవిని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంపై గ్రామస్థులు సైతం తట్టుకోలేకపోతున్నారు. మార్కులు తక్కువొచ్చినంత మాత్రాననో, ఒక్క సబ్జెక్టు ఫెయిల్‌ అయ్యారనే బాధతోనే జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మానసిక నిపుణులు చెపుతున్నారు..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close