జోరుగా నామినేషన్లు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నామినేషన్ల ఘట్టానికి సోమవారం చివరి రోజు కావటంతో ఆయా పార్టీల నేతలు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సిరిసిల్లలో కేటీఆర్‌, గద్వాల్‌లో డీకే అరుణ, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మంలో నామా, పువ్వాడ ఇలా టీఆర్‌, కూటమి పార్టీల్లోని ప్రముఖులు నామినేషన్‌లు దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్ధులుసైతం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా భారీ ర్యాలీలతో బలప్రదర్శన నిర్వహించారు.

శ్రీ సూర్యాపేట అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ తుఫాన్‌ ధాటికి అన్ని పార్టీలు కొట్టుకు పోతాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో జగదీష్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత జగదీష్‌ రెడ్డి – సునీత కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన ప్రసంగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. సూర్యాపే టలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలను సమానంగా కాపాడినట్లు చెప్పారు. అందుకే సూర్యాపేట ప్రజలు గులాబీ పార్టీకే మద్దతుగా ఉన్నారని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తెలంగాణ వ్యతిరేక టీడీపీతో జట్టుకట్టి చరిత్ర హీనులుగా మిగిలారని అన్నారు. అమరావతి, ఢిల్లీలో తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన అన్ని హావిూ లను నెరవేర్చడంలో సఫలం అయ్యామని అన్నారు. ఎన్ని కూటములు వచ్చినా తెలంగాణలో కేసీఆర్‌ విజయాన్ని అపలేరని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11న మహాకూటమి కనుమరుగవుతుందని జగదీష్‌ రెడ్డి వివరించారు.

శ్రీ సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సీనియర్‌ నేతలతో కలిసి నామినేషన్‌ వేశారు. అంతకుముందు సిరిసిల్లలో మంగళ వారం సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మార్పులు చేర్పులపై స్థానిక నేతలకు సూచ నలు చేశారు. కేటీఆర్‌ వెంట హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

శ్రీ సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేం దర్‌రెడ్డి నామపత్రాలను దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి తమను పంపడంలో వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. కేటీఆర్‌తో 60 మందిని లోపలికి పంపుతున్నారని, తమను మాత్రం కేవలం పది మందిని మాత్రమే అనుమతించారంటూ నిరసన తెలిపారు. పోలీసులకు, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌ దాఖలు చేసిన కేటీఆర్‌ అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం మహేందర్‌రెడ్డి నామినేషన్‌ పత్రాల ను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

శ్రీ నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో మహా కూటమి అభ్యర్ధి(కాంగ్రెస్‌)గా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి నామినేషన్‌ వేశారు. నాగార్జున సాగర్‌ ఆర్డీవో కార్యాలయంలో జానా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా జానారెడ్డి వెంట కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలుభారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈసందర్భంగా జానా మాట్లాడుతూ కూటమి గెలుపు ఖాయమైందని, తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చేది కూటమి పార్టీయేనని, అన్ని వరగ్‌ఆల ప్రజలకు న్యాయం చేస్తామని అన్నారు.

శ్రీ కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు. నామినేషన్ల కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మా దేవేందర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. పండుగ వాతావరణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

శ్రీ కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా మాధవరం కృష్ణారావు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నియోజకవర్గం బరిలో దిగిన నందమూరి సుహాసిని తనకు సోదరితో సమానమని కృష్ణారావు అన్నారు. సుహాసినికి రాజమండ్రిలో సీటు ఇచ్చి గెలిపించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తామని కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.

శ్రీ మరో వైపు కూకట్‌పల్లి బీజేపీ అభ్యర్థిగా మాధవరం కాంతారావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, మహాకూటమి అనేది లేనేలేదని కాంతారావు అన్నారు. దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధి, నిజాయితీ తనను గెలిపిస్తుందన్నారు.

శ్రీ సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా కమెడియన్‌ వేణుమాధవ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్‌ వేయడానికి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి రాగా…ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అవసరమైన అన్ని రకాల పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్‌ తీసుకోలేమని చెప్పారు. దీంతో సోమవారం ఆయన మరో మారు కోదాడ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేయాలని వేణుమాధవ్‌ భావించారు. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో తన అనుచరులతో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

శ్రీ హైదరాబాద్‌ నగరంలోని సనత్‌నగర్‌లో ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతుకు ముందు ఆయన తన తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా సనత్‌నగర్‌ ఆర్డీవో కార్యాలయం వద్ద ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

శ్రీ నల్గొండ జిల్లా నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంట కుటుంబ సభ్యులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా వెళ్లి నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మహాకూటమితోనే తమకు న్యాయం జరుగుతుందని, సంక్షేమ పథకాలు అమలవుతాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. దీంతో కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌ ఫాంహౌస్‌కు పరిమితం కావడం ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

శ్రీ హైదరాబాద్‌ నగరం ఖైరతాబాద్‌ నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా దానం నాగేందర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఖైరతాబాద్‌ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో భారీ సంఖ్యలో తెరాస నేతలు పాల్గొన్నారు.

శ్రీ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఖమ్మం రూరల్‌ కార్యాలయంలో ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నాలుగేళ్లలో కేసీఆర్‌ ఆధ్వర్యంలోఅ ద్భుతమైన పాలన సాగిందని, మరోసారి ప్రజలంతా తెరాసకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, మరోసారి టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు. తుమ్మల వెంకట ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ గడిపల్లి కవిత

తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గంలో కూటమి అభ్యర్ధి(టీడీపీ) నామా నాగేశ్వరరావు అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ సందర్భంగా భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నామా నాగేశ్వరరావు ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నియోజకవర్గంలో కూటమి గెలుపు ఖాయమని, రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుందన్నారు. ప్రజలంతా కేసీఆర్‌ పాలనతో విసుగు చెందారని, కూటమి అయితేనే పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని అన్నారు.

శ్రీ ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్నాకాలంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.హబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్ధిగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టైనా కొడంగల్‌లో తమ పార్టీని గెలిపించుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహాకూటమి, టీఆర్‌ఎస్‌ మధ్య జరగుతున్న పోరును కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో వందమంది ఉన్న కౌరవులు ఓడి.. ఐదుగురు ఉన్న పాండవులు గెలిచారని.. ఆ చరిత్రనే మహాభారతంగా చదువుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వంద మంది గెలుస్తారంటున్న కేసీఆర్‌.. కౌరవ వంశానికి చెందిన వారని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలోని ఐదు మండలాలను పంచపాండవులుగా అభివర్ణించారు. కొడంగల్‌లో జరగుతున్న కురుక్షేత్రంలో వందకోట్లతో.. వందలమంది ముఠాలతో వచ్చిన కేసీఆర్‌ గెలుస్తాడా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారన్నారు.

శ్రీ జనగామ నియోజకవర్గ మహాకూటమి (కాంగ్రెస్‌) అభ్యర్ధిగా పొన్నాల లక్ష్మయ్య సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. జనగామ ఆర్డీవో కార్యాలయంలో పొన్నాల నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహాకూటమి విజయం ఖాయమైందన్నారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని, నిరంకుశపాలన సాగించారని అన్నారు. ప్రజలంతా కేసీఆర్‌ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మహాకూటమి గెలుపుతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారని, అందుకే కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here