Featuredరాజకీయ వార్తలు

పురపోరుకు ముగిసిన నామినేషన్ల ఘట్టం

  • భారీగా దాఖలైన నామినేషన్లు
  • పార్టీ అభ్యర్థులతో పాటు పోటీ పడ్డ స్వతంత్రులు
  • అన్‌ రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనూ మహిళల జోరు
  • టిఆర్‌ఎస్‌ నుంచి పోటాపోటీగా నామినేషన్లు
  • నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
  • 14 వరకు బిఫారం సమర్పించే అవకాశం

హైదరాబాద్‌

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో శుక్రవారం వివిధ మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. పోటీపడి వివిధ పార్టీలకు చెందిన వారు, స్వతంత్రులు కూడా నామినేషన్లు వేశారు. కరీంనగర్‌ మినహా అన్నిచోట్లా సాయంత్రానికి నిమినేషన్ల ఘట్టం ముగిసింది. శనివారం నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఈ నెల 14 వరకు బిఫారాలు సమర్పించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఆశావహులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. ఎక్కడెక్కడ ఎంతమంది నామినేషన్లు వేసిందీ ఇసి జాబితా ప్రకటించనుంది. అయితే కౌన్సిలర్లుగా పోటీ పడేందుకు మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అన్‌రిజర్వ్‌డ్‌ స్థానాల్లో కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ నామినేషన్లు వేసే కేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే మున్సిపల్‌ కార్యాలయంలోకి అనుమతించారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉండడంతో అంతటా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. శుక్రవారం… పౌర్ణమి మంచి రోజు కావడంతో పాటు నామినేషన్‌లకు ఆఖరి రోజు. దీంతో చివరి రోజు నామినేషన్లకు ఆయా పురపాలికల్లో పోటీదారులు భారీగా తరలిచ్చారు. మొదటి రెండురోజులతో పోలిస్తే చివరి రోజు అంతకంటే రెట్టింపు ఉత్సాహం కనిపించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం పెద్ద ఎత్తున నామినేషన్లను దాఖలు చేయడం విశేషం. నామినేషన్ల దాఖలు పక్రియ మొదలైనా, ఏ పార్టీ ఎవరికి టికెట్‌ కేటాయిస్తుందనే విషయం అంతుచిక్కడం లేదు. ఆశావహులు పెద్దసంఖ్యలో టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయడం సంక్లిష్టంగా మారింది. ఇకపోతే ప్రధాన పట్టణాలైన ఆదిలాబాద్‌,నిజామాబాద్‌, వరంగల్‌, మహూబ్‌నగర్‌, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకుపోటీ పడ్డారు. ఊరేగింపులతో వచ్చి పత్రాలు అందచేశారు. అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే టికెట్‌ రాని వారు పార్టీ ఫిరాయించే అవకాశముందని ప్రధాన పార్టీలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నామినేషన్ల దాఖలు సమయం ముగిసినా బీ-ఫారం ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. కాగా రెండోరోజు నామినేషన్ల దాఖలు మొదటిరోజు కంటే ఎక్కువగానే జరిగింది. గ్రేటర్‌ చుట్టూ ఉన్న 7 కార్పొరేషన్‌లు, 7 మునిసిపాలిటీల్లో మొదటిరోజు 83 మంది నామినేషన్లు దాఖలు చేస్తే, రెండోరోజు ఆ సంఖ్య 612 దాటింది. శుక్రవారం ఒకటే రోజు మిగిలి ఉండడంతో ఆశావహుల్లో టికెట్‌ టెన్షన్‌ మొదలైంది. చివరిరోజు ఎవరికి టికెట్‌ ఇస్తారోనన్న ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక పార్టీకి ఒక్కో రకమైన సమస్య ఏర్పడింది కొన్ని పార్టీలకు అభ్యర్థులు దొరకక సమస్యలతో సతమతమవుతుంటే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో మాత్రం తీవ్రమైన గొడవ జరుగుతోంది. కొంతమంది కారు దిగి వెళ్లిపోతామని, కారులో కలిసి ప్రయాణం చేయలేమని కారు పార్టీతో తెగతెంపలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయడానికి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని, ఇటీవల పార్టీలో చేరగా అలాంటి వారికి టికెట్లు ఇచ్చి తమను మోసం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close