సీను లేని సినిమాలో కోదండం గుర్తు కిరికిరి

0

◆ కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయం
◆ మాకూ వస్తోంది..దానిపైనే పోటీ
◆ 9 సీట్లపై మౌనం..
◆ వల వేస్తున్న తెరాస
(రమ్యాచౌదరి, ఆదాబ్ హైదరాబాద్)

‘‘గుద్దులాడే ఇంట్ల గుప్పెడు గింజలు ఉండవు’ అన్న చందాన మహాకూటమిలో కోదండరాం వ్యవహారం కొనసాగుతోంది. ఆయన ముందు 30 ఆ తరువాత 16 సీట్లు కావాలన్నారు. అనంతరం కాంగీకి అల్టిమేటం ఇచ్చారు. వ్యవస్థీకృత నిర్మాణం లేని పార్టీ అది. కేవలం ఉద్యమంలో ముందున్న వారిలో ఒకరని భాగస్వామ పక్షాలు గౌరవిస్తున్నాయి. దొరికిందే ‘ఛాన్స్’ అని శవాల నరాలతో వీణ మీటినట్లు కోదండరాం వ్యవహార శైలి ఉంది. ఒక్కసారి ‘కూటమి’లో ‘తెజస’ను వద్దనుకుంటే… 119 స్థానాలలో అభ్యర్థులను నిలిపే సత్తా కోదండరామి ‘రెడ్డి’కి (మాజీ ముఖ్యమంత్రి టి.జె.అంజయ్య వలే రెడ్డి అనే పదం కోదండరాం కట్ చేసుకున్నారు.) ఉందా..? అంటే మీనమేషాలు లెక్కించే వైనం తెరపై కనిపిస్తోంది. కోదండరాం వైఖరిపట్ల కాంగ్రెస్ అధిష్టానం ముందు నుంచి ఒక్కింత అసహనం వ్యక్తమౌవుతోంది. ఇదిలా ఉండగా తహకోదండం ప్రతిపాదించిన అభ్యర్థులకు తెరాస ముందస్తు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారంలోగా సీట్ల సర్థుబాటు ఓరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ ముగిసింది. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాష్ట్ర బాధ్యుడు ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా తెజస అధ్యక్షుడు కోదండరాం, దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు. కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. మొత్తం 16 సీట్లకు తెజస పట్టుబట్టగా.. తొమ్మిది సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
తెరాసను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజస మహా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపైనే తొలుత ప్రధానంగా దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇక అభ్యర్థుల జాబితాపై తీవ్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేశారు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్‌, తెజస నేతల మధ్య కీలక భేటీ జరిగింది.

త్వరలోనే సానుకుల నిర్ణయం: కుంతియా

కామన్‌ ఎజెండా, సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే సానుకుల నిర్ణయాలు ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ‘ఆదాబ్ హైదరాబాద్’కు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

మా గుర్తు మాదే : కోదండరాం
తమ అభ్యర్థులు తమ గుర్తు పైనే పోటీ చేస్తారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. త్వరలో తెలంగాణ జనసమితికి గుర్తు రాబోతుందని, సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టత రాలేదని కోదండరాం అన్నారు. పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు. చర్చలు జరుగుతున్న దశలో వివరాలు బయటకు వెల్లడించడం సరికాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here