Featuredజాతీయ వార్తలు

భారతంలో భద్రత కరువు

నాడు నిర్భయ.. నేడు ప్రియాంక

నేటికి అమలు కాని నిర్భయ చట్టం

బిక్కుబిక్కుమంటున్న మహిళలు

రేప్‌ చేస్తే ఇక ఉరిశిక్షే…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :

ఆడ పిల్లలపై దాడులు అక్కడా, ఇక్కడా అని కాదు అన్ని చోట్ల జరుగు తున్నాయి రాజధానులలో మరీ అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది సేఫ్టీ, భద్రత ఎక్కువగా ఉంటా యనుకున్నది భ్రమే ప్రియాంక రెడ్డి హత్యే అందుకు సాక్ష్యం నాటి నిర్భయ ఘటన నాటినుంచి నేటి వరకూ పరిస్థితి ఏం మారలేదు. చట్టం తెచ్చినా మగమదంతో దాడులు చేసే క్రూరమగాలకు కొంచెం

కూడా భయం లేకుండా పోయింది. కఠినమైన చట్టాలు తెచ్చామని ప్రభుత్వాలు జబ్బలు చరుచుకుంటుంటే మరోపక్క ఇలాంటి మదించిన మగాళ్లుమరింత బరి తెగించిపోతున్నారు 2012 నుంచి 2019 మధ్య కాలంలో చరిత్ర పుటలో పేజీలు మారాయి తప్పితే ఆకలి గొన్న పులుల్లా అమ్మాయిలను కబళిస్తున్న గుంటనక్కల మెంటాలిటీలో మాత్రం మార్పు లేదు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యువ డాక్టర్‌ క్రూర మగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది రాత్రి వేళ మదమెక్కిన క్రూర మగాల వికత చేష్టలకు బలై ప్రాణం విడిచింది. రాజధానులంటే భద్రతకు చిరునామాలనుకుంటాం అత్యాధునిక సౌకర్యాలతో నేరాలకు తావులేని సురక్షిత ప్రాంతాలనుకుంటాం ఆ భ్రమ మరోసారి పటాపంచలైపోయింది ఎన్ని చట్టాలు తెచ్చినా బిరుసెక్కిన నేరగాళ్ల మైండ్‌ సెట్‌ ని మార్చలేకపోతున్నాయి అప్పుడు నిర్భయ ఇప్పుడు ప్రియాంక ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత కూడా ఏం మారలేదంటే తప్పెవరిది? లోపం ఎక్కడ? సభ్యత, సంస్కారం, విచక్షణా జ్ఞానం వదిలేసిన వారికి నేరం చేయడమే ప్రవత్తి ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి రోజుల్లోనే దేశం వెన్ను వణికేలా చేసిందో అబల అసహాయ రోదన. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రతిఒక్కరూ ఈ హేయమైన చర్యను ఖండిస్తూ, నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సత్వరం న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. మన దేశంలో కోర్టు తీర్పులు వెలువడడానికి ఎంత సమయం పడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్భయ కేసు దానికి ఒక మంచి ఉదాహరణ. ఇలా చట్టం వల్ల ఆలస్యం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో ఉంది. హోమ్‌ శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలకు స్వస్తిపలకాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించనుంది. ఇక మీదట ఎవరైనా రేప్‌ చేస్తే హై కోర్టును కూడా బైపాస్‌ చేస్తూ నేరుగా ఉరి శిక్షను విధించే వీలుంటుంది. అప్పుడు ఆ సదరు ముద్దాయికి సుప్రీవమ్‌ కోర్టుకు తప్ప వేరే ఏ ఆప్షన్‌ కూడా మిగలకుండా చేయవచ్చు. తద్వారా న్యాయం జరగడంలో జరిగే జాప్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చ. ప్రజలు నిన్న శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ బయట కానీ, నేడు చర్లపల్లి జైలు బయట కానీ, నినాదాలు చేయడానికి కారణం కోర్టు తీర్పులు చెప్పడానికి జరిగే జాప్యం. ఇలా జాప్యం జరగడం వల్లనే ప్రజలు ఆ నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

2012 ఢిల్లీలో గ్యాంగ్‌ రేప్‌… దేశ రాజధాని నడిబొడ్డున డిసెంబర్‌ 16 చలికాలం పెద్దగా టైమ్‌ కూడా కాలేదు రాజధానిలోని మునిర్కా ఏరియా రాత్రి 9.30 ఫిజియో థెరపిస్ట్‌ జ్యోతి సింగ్‌ ఓ సినిమా చూసి తన స్నేహితుడితో కలసి ఇంటికి వెడుతున్న టైమ్‌ ఎదురుగా వచ్చిన ఒక ప్రైవేట్‌ బస్సు ఎక్కింది. పక్కన స్నేహితుడు రక్షణగా ఉన్నాడనుకుంది అంతలోనే బస్‌ డ్రైవర్‌, క్లీనర్‌ వారిని అశ్లీల పదజాలాలతో వేధించారు టిక్కెట్‌ అడిగిన చోటకి ఇవ్వకుండా వెటకారాలాడారు అమ్మాయిపై లైంగిక దాడి చేశారు అడ్డొచ్చిన బాయ్‌ ఫ్రెండ్‌ ను చావ చితగ్గొట్టారు. దేశ రాజధాని వీధుల్లో బస్సును నాన్‌ స్టాప్‌ గా నడుపుతూ ఒకరి తర్వాత ఒకరు ఆ అసహాయ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఓ మైనర్‌ కూడా ఉన్నాడు. వయసులో చిన్న వాడైనా నేరగాళ్లందరిలోకీ అత్యంత క్రూరంగా వ్యవహరించినది ఆ మైనరే ఇనుప రాడ్‌ తో ఆమె శరీరాన్ని ఛిద్రం చేసిన దుర్మార్గుడు. కొన్ని గంటల లైంగిక దాడి తర్వాత బాధిత యువతిని,ఆమె స్నేహితుడినీ బస్సులోంచి తోసి పడేశారు రక్తమోడుతున్న శరీరంతో దారిన పోతున్న ఆటో సాయంతో ఆస్పత్రికి చేరిన నిర్భయ ఆ తర్వాత 16 రోజులు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడి ప్రాణం వదిలింది. సింగపూర్‌ తీసుకెళ్లినా ఆమె ప్రాణం మాత్రం దక్కలేదు. నిర్భయ ఘటనతో దేశం యావత్తూ కదిలింది. బలమైన చట్టాలు లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆందోళనతో నిర్భయ చట్టం తెచ్చారు. ఆఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా మన సమాజ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు నేరాల తీవ్రతలోగానీ, నేరాల సంఖ్యలోగానీ ఏ మాత్రం తేడా లేదు అందుకు సాక్ష్యమే శంషాబాద్‌ లో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక హత్య..

2019నవంబర్‌27శంషాబాద్‌ ఏరియా…. సాయంత్రం వేళ ప్రియాంకా రెడ్డి అనే వెటర్నరీ డాక్టర్‌ స్కూటీపై బయల్దేరింది. మాదాపూర్‌ లో ఉన్న పార్లర్‌ లో ట్రీట్‌ మెంట్‌ కోసం బండిపై వెళ్లిన ప్రియాంక టోల్‌ గేట్‌ దగ్గర తన బండిని పార్క్‌ చేసింది. అక్కడపెట్టొద్దన్న టోల్‌ సిబ్బంది సూచనలతో బండిని రెండో టోల్‌ గేట్‌ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో పార్క్‌ చేసింది. అక్కడనుంచి క్యాబ్‌ లో మాదాపూర్‌ వెళ్లింది రాత్రి 8గంటల వేళ తిరిగి స్కూటీ తీసుకోడానికి వచ్చింది అప్పటికి టైమ్‌ 8.45 బండి తీస్తున్న టైమ్‌ లో స్కూటీ పంక్చర్‌ అయిందని ఒక లారీ డ్రైవర్‌ చెప్పాడు. పంక్చర్‌ వేయిస్తానంటూ ఓ కుర్రాడినిచ్చి పంపాడు అయితే షాపులు మూసి ఉన్నాయని ఆపిల్లాడు వాపస్‌ వచ్చాడు. బస్టాప్‌ దగ్గరకెళ్లి పంక్చర్‌ వేయించుకుంటానన్న ప్రియాంకను మధ్యలో ఇబ్బంది పడతారంటూ వారించాడు. తానే వేయించుకొస్తానంటూ మరో డ్రైవర్‌ బండి తీసుకెళ్లాడు అప్పటికి టైమ్‌ 9.45 ఆందోళన పడిన ప్రియాంక చెల్లి భవ్యకి ఫోన్‌ చేసింది తనకి భయంగా ఉందని పదే పదే చెప్పింది. టోల్‌ గేట్‌ దగ్గరకెళ్లి నిలబడమని చెల్లి చెబుతున్నా అక్కడకి వెళ్లేందుకు ఎందుకో వెనకంజ వేసింది ఆ తర్వాత ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ అప్పటికే పీకల్లోతు మద్యం సేవించిన డ్రైవర్లు ప్రియాంకను తొండుపల్లి టోల్‌ ప్లాజా దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. నోట్లో గుడ్డలు కుక్కి లారీని అడ్డుపెట్టి ఆమెపై ఒక్కొక్కరుగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రతిఘటించినందుకు తీవ్రంగా హింసించారు. ఆపై ఆమెను గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత డెడ్‌ బాడీని సమీపంలో ఉన్న ఒక గదిలో పడేద్దామనుకున్నారు. గదిలో వాచ్‌ మన్‌ నిద్రిస్తుడటంతో ఏం చేయాలో తెలీక ఘటనా స్థలంలోనే దుప్పటి చుట్టి ఉంచారు. రాత్రి రెండు దాటాక డెడ్‌ బాడీని, స్కూటీని లారీలో ఎక్కించారు. ఘటనాస్థలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాద్‌ నగర్‌ చటాన్పల్లి బ్రిడ్జి కింద పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి అంటించారు. ఈ సంఘటన రాష్ట్ర రాజధానిలో జరిగింది. టోల్‌ గేట్‌ అంటే జాతీయరహదారి ఉన్న ప్రాంతం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు దారి తీసే రూట్‌ నిరంతరం గస్తీ వాహనాలు, పెట్రోలింగ్‌ వ్యాన్‌ లతో పహారా ఉండే ప్రాంతం టైమ్‌ కూడా పెద్దగా కాలేదు కానీ ఓ అమ్మాయి వెటర్నరీ డాక్టర్‌ అసహాయ స్థితిలో కామాంధుల పైశాచికత్వానికి బలైపోయింది. నిర్భయ చట్టం తెచ్చినా పరిస్థితిలో ఏం మార్పు రాలేదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఈ చట్టంతో కామాంధుల పని మటాష్‌ అనుకున్నాం కానీ వారి నేర ప్రవత్తిని కించిత్తైనా మార్చలేకపోయాం తప్పు చేస్తే చట్టం ఉంది. శిక్షిస్తుందన్న భయం లేదు. ఆ చట్టంలో ఉన్న లొసుగులు ఎంత సులభంగా బయటపడొచ్చో చెబుతున్నాయి కాబట్టే. దుర్మార్గుల తీరులో మార్పు లేదు. పకడ్బందీ పోలీస్‌ టీమ్‌, సాంకేతిక టెక్నాలజీ, తగినంత స్థాయిలో భద్రా సిబ్బంది, పెట్రోలింగ్‌ వ్యాన్లు ఉండే రాజధానుల్లోనే ఇలాంటి అమానవీయ ఘటనలు జరిగిపోతుంటే. ఇక ఇతర ప్రాంతాలలో మహిళల భద్రత గురించి వేరే చెప్పాలా? అక్కడ నిర్భయ ఇక్కడ ప్రియాంక ఇద్దరూ దుర్మార్గుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారే 2012 నుంచి 2019 వరకూ మార్పు లేని ఈ వ్యవస్థ తీరుకి ఎవర్ని నిందించాలి? క్యాండిల్‌ ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు భద్రత కావాలి మొర్రో అని మహిళలు నినదిస్తున్నా ఎన్నేళ్లయినా సేమ్‌ సీన్స్‌ సేమ్‌ సిట్యుయేషన్స్‌ ఇలా ఇంకెంత కాలం? నేరానికి విచక్షణ లేదు క్రూరత్వానికి పరిమితి లేదు మనిషి నైతికత గాలికొదిలేసిననాడు. ఏ చట్టాలూ నియంత్రించలేవు. చట్టం భౌతిక శిక్ష మాత్రమే కరుడు గట్టుకుపోయిన మగాళ్ల మైండ్‌ సెట్‌ మార్చాలంటే వ్యవస్థ మారాలి. ఒక అమాయక యువతి ప్రాణం నిర్దాక్షిణ్యంగా చిదిమేసిన ఆ క్రూర మగాలకు బతికే హక్కు లేదన్నది జనం ముక్త కంఠంతో చెబుతున్న మాట మరి ప్రభుత్వాలు నేరానికి తగిన శిక్ష వేస్తాయా చూద్దాం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close