వ్యూహరచనలో మహీకెవరూ సాటిరారు

0

ముంబయి: ప్రస్తుత ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యం వహిస్తున్న యువ భారత జట్టుకు ఎంఎస్‌ ధోనీ చక్కని మార్గదర్శకుడని అతడి చిన్ననాటి కోచ్‌ కేశవ్‌ బెనర్జీ అంటున్నారు. మహీ జట్టులో లేకుంటే విరాట్‌కు చాలా కష్టమని వెల్లడించాడు. ‘ఆటను అధ్యయనం చేయడంలో, వ్యూహరచనలో మహీకెవరూ సాటిరారు. కోహ్లీలో ఇలాంటి లక్షణాలు లేవు. అందుకే సలహాల కోసం అతనెప్పుడూ ధోనీపై ఆధారపడాల్సిందే. ప్రపంచకప్‌ జట్టులో ధోనీ లేకుంటే సారథి కోహ్లీకి సాయం చేసేవారెవరూ ఉండరు’ అని కేశవ్‌ అన్నారు. ప్రస్తుతం ధోనీ ఏ స్థానంలో రావాలన్న ప్రశ్నకు కేశవ్‌ బెనర్జీ సమాధానం ఇచ్చారు. ‘నాలుగో స్థానంలో ఆడితే నిలదొక్కుకోవడానికి సమయం ఉంటుంది. అప్పుడు ధోనీ రాణిస్తాడు. అదే 5, 6 స్థానాల్లోనైతే క్రీజులోకి వచ్చిన వెంటనే బంతిని బాదేయాలి. రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచకప్‌లో ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలి. అప్పుడతను స్వేచ్ఛగా ఆడతాడు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. తుది నిర్ణయం జట్టు యాజమాన్యం తీసుకుంటుంది. ప్రపంచకప్‌ తర్వాత మహీ ఆటకు వీడ్కోలు పలుకుతాడో లేదో నాకు తెలియదు. ధోనీ ఎంత ఫిట్‌గా ఉన్నాడో మీకు తెలుసు. అతనెప్పుడు రిటైర్‌ అవుతాడో కనీసం అతడి సతీమణి, తండ్రికైనా తెలియదు’ అని కేశవ్‌ బెనర్జీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here