బిజినెస్

విచారణ జరిగేదాకా డబ్బులు కట్టేదిలేదు

టెలికాం శాఖకు చెప్పిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా – రూ. 177 కోట్ల కట్టనున్న జియో

న్యూఢీల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యేదాకా బకాయిలు చెల్లించేది లేదని ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా టెలికాం విభాగానికి స్పష్టం చేశాయి. కొత్త పిటిషన్లపై న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఎదురు చూస్తామని ఈ కంపెనీలు తెలిపాయి. మరోవైపు బకాయిలు చెల్లించేందుకు రిలయన్స్‌ జియో సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి టెలికాంయేతర ఆదాయాలను(సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు-ఏజీఆర్‌) వసూలు చేసేందుకు గతేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు కంపెనీలకు జనవరి 23 వరకు గడువు కల్పించింది. అయితే ఇంత తక్కువ సమయంలో తాము బకాయిలు చెల్లించలేమని, తమకు మరింత గడువు కల్పించాలని కోరుతూ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతో పాటు పలు టెలికాం కంపెనీలు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో తాజా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై వచ్చే వారం విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దీంతో ఆ విచారణ పూర్తయి తీర్పు వచ్చేంత వరకు ఎదురు చూస్తామని, అప్పటివరకు తమకు సమయం ఇవ్వాలని టెలికాం విభాగాన్ని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కోరాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సహా పలు టెలికాం కంపెనీలు లైసెన్స్‌ రుసుము కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రమ్‌ వినియోగరుసుము కింద రూ. 55,054 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం కలిపి రూ. 1.47లక్షల కోట్లు అయ్యింది. ఇందులో అత్యధికంగా ఎయిర్‌టెల్‌ రూ. 35,586కోట్లు(రూ. 21,682కోట్ల లైసెన్స్‌ రుసుముంరూ. 13,904కోట్ల స్పెక్ట్రమ్‌ ఛార్జీలు), వొడాఫోన్‌ ఐడియా రూ. 53,038కోట్లు(రూ. 28,309కోట్ల లైసెన్స్‌ రుసుముంరూ. 24,729కోట్ల స్పెక్ట్రమ్‌ ఛార్జీలు) చెల్లించాలి. రిలయన్స్‌ జియో కొత్తగా ఏర్పాటైనందున ఆ కంపెనీ బకాయిలు చాలా తక్కువగా రూ. 177కోట్లు ఉన్నాయి. కాగా.. బకాయిలు చెల్లింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ టెలికాం కంపెనీలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో మరింత సమయం ఇవ్వాలని కోరుతూ కొత్త పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై వచ్చేవారం విచారణ జరగనుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close