సీబీఐకి నో ఎంట్రీ

0

అమరావతి: ఏపీ ప్రభుత్వం సీబీఐకి పెద్ద షాక్‌ ఇచ్చింది. ఇకపై రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర అనుమతి తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనిఖీలు, దర్యాప్తు చేసేందుకు సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతి పత్రాన్ని వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఇకపై సీబీఐ అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కార్యకలాపాలూ స్వతంత్రంగా నిర్వహించలేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై తనిఖీలు చెయ్యాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. రైల్వే వ్యవహారాల్లో మినహా.. ఇతర చోట్ల ఎలాంటి సోదాలు చెయ్యాలన్నా షరతులు వర్తిస్తాయి. ఢిల్లీ చట్టంలోని అధికారం మేరకు నిర్ణయం … సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా.. ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం ప్రకారం ఏర్పాటైంది. అంటే ఆవిర్భావం కేంద్ర చట్టం ప్రకారం జరగలేదు. కాబట్టి సీబీఐ పరిధి ఢిల్లీ వరకు మాత్రమే. తర్వాత రాష్ట్రాల వ్యవహారాల్లో సీబీఐ తలదూర్చడంపై వివాదాలు రేగాయి. దీంతో ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోనే.. ఈ సమస్యకు పరిష్కారం చూపారు. చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం.. ప్రభుత్వ అనుమతితో మాత్రమే సీబీఐ సంబంధిత రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టాలి. ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగి2లిన రాష్ట్రాలు దీనికి ఓకే చెప్పాయి. ఏపీ సర్కారు కూడా సీబీఐకి అనుమతి ఇచ్చింది. కేంద్రం సీబీఐతో పాటూ స్వతంత్ర సంస్థలన్ని రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ సోదాలు కూడా జరిగాయి. దీంతో కేంద్రంపై గుర్రుగా ఉన్న టీడీపీ సర్కార్‌.. గతంలోనే ఈ సోదాలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంతో ఏదో లింకు పెట్టి సీబీఐ ద్వారా ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగుతాయని ఏపీ సర్కార్‌ భావించిందట.. అందుకే సీబీఐకు షాకిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కాని అవినీతి, అక్రమాలకు పాల్పడితే సీబీఐ నేరుగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టవచ్చు. ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైనా సీబీఐ చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా అక్కర్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సీబీఐకి ఇచ్చిన ‘జనరల్‌ కన్సెంట్‌’ను నిన్నటి వరకు పొడిగిస్తూ వస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం ఆ అనుమతి పత్రాన్ని వెనక్కు తీసుకుందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here