ఆగని ఆందోళనలు

0
  • రెండోరోజూ కొనసాగిన నిరసన
  • భారీసంఖ్యలో మోహరించిన పోలీసులు

-విద్యార్థులు ఆందోళన చెందవద్దు

-రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

-తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళనలు రెండో రోజూ మంగళవారం కొనసాగుతున్నాయి. సోమవారం పలు విద్యార్థి సంఘాలు నేతలు ఇంటర్‌ బోర్డ్‌ ముందు ఆందోళనకు దిగడంతో వీరికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇంటర్‌బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడకు భారీగా చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. రీవాల్యుయేషన్‌కు బుధవారమే చివరిరోజు కావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్‌లో తమకు అన్యాయం చేశారని, రీ-వెరిఫీకేషన్‌ కోసం అప్లై చేసుకుందామంటే వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడంలేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల పరిస్థితేంటని తల్లిదండ్రులు నిలదీస్తున్నా, ఒక్కరు కూడా సమాధానం చెప్పడంలేదు. బోర్డు వద్ద పోలీసులను భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కార్యాలయానికి మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, బారికేడ్లతో బోర్డుకు వచ్చే రహదారిని మూసి వేశారు. విద్యార్థులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఆందోళనకు మద్దతు తెలపడానికి వచ్చిన విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో ఆయనను పోలీసులు బలవంతంగా కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మీడియా పట్ల కూడా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఇదిలాఉండగా ఆందోళన చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఇప్పటికే ప్రజలనుంచి పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. కనీసం మహిళలని కూడా చూడకుండా విద్యార్థినులు, వారి తల్లులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదంటూ పోలీసులపై ప్రజలు మండిపడుతున్నారు.

ఇంటర్‌బోర్డు అవకతవకలపై హైకోర్టులో పిటిషన్‌..

ఇంటర్‌బోర్డు అవకతవకలపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు బాలల హక్కుల సంఘం ఈ పిటిషన్‌ వేసింది. ఇంటర్‌ మొదటి ఏడాదిలో టాప్‌లో మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు, రెండో ఏడాదిలో తక్కువ మార్కులు రావడం.. అంటే కొంతమందికి సున్న మార్కులు, మరికొంతమందికి 5, 6 మార్కులు రావడం.. ఆ తప్పిదాలకు ఇంటర్‌ బోర్డు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ బాలల హక్కుల సంఘం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే మార్కులు, తక్కువ వచ్చాయంటూ కొందరు... మరి కొంతమంది పాస్‌ కాకపోవడంతో విద్యార్థులు మానసిన క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం.. దానికి సంబంధించి బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. బోర్డు నిర్లక్ష్యం వల్లే 16 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం తమ పిటిషన్‌లో పేర్కొంది.

ఇంటర్‌ ఫలితాలపై ఆందోళన వద్దు – తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి

ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి తెలిపారు. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ విషయంపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించిన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు.. ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఆందోళనలు వద్దని, ఇంకా 25 తేదీ వరకు సమయం ఉందని, నిన్నటి వరకు 9వేల అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని, రీ వెరిఫికేషన్‌కు రూ.600లు, రీకౌంటింగ్‌కు రూ.100 కట్టి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చనన్నారు. ఇక ఇంటర్‌ ఫలితాల సాఫ్ట్‌ వేర్‌ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతోందన్న జనార్ధన్‌రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓ ఎమ్మార్‌ షీట్‌లో తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గతంలో ఉన్న చట్టాల కంటే కొత్త చట్టాల ద్వారా వారిని శిక్షిస్తాంమని, వారికి ఫైన్‌ కూడా పెంచుతామని తెలిపారు. అదేవిధంగా వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు ఎవ్వరు చేసుకోవద్దని, అపజయం పాలైతే.. మళ్లీ ఎగ్జామ్‌ రాసుకోవచ్చునని, కానీ ప్రాణంపోతే మళ్లీరాదని విద్యార్థులకు ధైర్యాన్ని చెప్పారు. ఒకవేళ మూల్యాంకనంలో తప్పులు జరిగితే మీకు న్యాయం జరుగుతుందని, కానీ మీరు పరీక్ష రాయడంలో తప్పులు జరిగి ఫెయిల్‌ అయితే ఇతర చదువులు ఉన్నాయని సూచించారు. ఎక్కడ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దన జనార్ధన్‌రెడ్డి కోరారు. తల్లితండ్రులు కూడా పిల్లలను గమనించాలని కోరారు. మరోవైపు రాబోయే విద్య సంవత్సరం నుండి ప్రతి 10మంది విద్యార్థులకు ఒక్కస్వశక్తి సంఘం ఏర్పాటు చేస్తామని, దీనిద్వారా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఒకరికోకరు చెప్పుకోవచ్చు అని వెల్లడించారు. 

సమస్యకి కేసీఆర్‌ పరిష్కారం చూపాలి – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తక్షణమే సీఎం కేసీఆర్‌ రంగప్రవేశం చేసి ఇంటర్‌ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. అధికారుల సమాధానాలు తప్పించుకునే విధంగా ఉన్నాయన్నారు. అధికారుల నిర్లక్ష్య సమాధానంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అసలు దీనికంతటికీ కారకులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకొని, విద్యార్థులకు తగిన విధంగా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు.చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధిక సాయం అందించాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here