బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు

0

చెన్నై: రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ తేల్చిచెప్పారు. ”ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను వాజ్‌పేయీతో పోల్చుకోవడం నిజంగా హాస్యాస్పదం. ఆయన ఎప్పటికీ వాజ్‌పేయీ కాలేరు. ఆయన లాంటి రాజకీయాలు మోదీ చెయ్యలేరు” అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో మోదీ ఇటీవల వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తుకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై స్టాలిన్‌ స్పందిస్తూ.. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదన్నారు. గతంలో డీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమేనని, కానీ వాజ్‌పేయీ లాంటి నిర్ణయాత్మక రాజకీయాలు మోదీ చెయ్యలేరని స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చెన్నైలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో స్టాలిన్‌ చెప్పారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రాంతీయ పార్టీలకు కలుపుకుని పోయారని, కానీ ఇప్పుడు బీజేపీలో అలాంటి నాయకత్వం లేదని స్టాలిన్‌ అన్నారు. కాగా 1999 ఎన్నికల్లో బీజేపీ,డీఎంకే కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. తమిళనాడులోని రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ, పాత మిత్రులను తాము గుర్తుపెట్టుకున్నామని ప్రధాని మోదీ గురువారం అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఎదురుచూస్తోందని మోదీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. అరక్కోణం, కడలూరు, క ష్ణగిరి, ఈరోడ్‌, ధర్మపురి జిల్లాల బూత్‌ స్థాయి బీజేపీ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే, డీఎంకే లేదా రజినీకాంత్‌ పెట్టే పార్టీల్లో దేనితో పొత్తు పెట్టుకుంటుందని ఓ కార్యకర్త అడగ్గా, ‘వాజ్‌పేయి 1990ల్లో విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు కూడా మిత్రుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని సమాధానమిచ్చారు. ‘ప్రాంతీయ పార్టీలకు, ఆకాంక్షలకు అటల్‌జీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ వెళ్తోంది. వాజ్‌పేయి ఏం చేశారో దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్‌ చేసింది. అధికారంలో ఉండేందుకు తమకు ఒక్కరికే హక్కు ఉందని ఆ పార్టీ భావించింది’ అని విమర్శించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులోని ఐదు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 39 స్థానాల్లోనూ పోటీ చేయగా ఈ కూటమి రెండే సీట్లు (బీజేపీ, పీఎంకే చెరొకటి) గెలిచింది. తర్వాత ఈ 5 పార్టీలూ బీజేపీతో తమ సంబంధాలను తెంచుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here