Featuredబిజినెస్

ఈ దేశంలో వ్యాపారం చేయలేం…

వంద సంపాదిస్తున్నప్పుడు కనీసం అరవై, డెబ్బై రూపాయలన్నా మిగిలాలి.. అదే లక్షలు, కోట్లతో వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంతగానో సహకరించాలి.. ఎందుకంటే ఒక్క పరిశ్రమ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది.. కాని మనదేశంలో అంతా తారుమారుగా ఉంది. ఇక్కడ పన్నుల మోత పారిశ్రామికవేత్తలు తట్టుకోలేకపోతున్నారు.. ఒక కంపెనీ పెట్టి దానిని నడిపించాలంటే కింది స్థాయి సిబ్బంది జీతభత్యాలు, కంపెనీ మెయింటెన్స్‌, సమీక్షలు, సమావేశాలు, పర్యటనల ఖర్చులకు లెక్కేలేదు… అన్ని కలిస్తే చివరకు బిజినెస్‌మెన్‌కు మిగిలేది సున్నానే.. లాభాల మాట దెవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడే రానప్పుడు ఇంకా వ్యాపారాలు ఎవరూ చేస్తారు.. అందుకే కొత్త కొత్త కంపెనీలు పెట్టాలనే ఆలోచన ఎవరికి రావడం లేదు.. ఆలోచన వచ్చిన వారందరూ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన ఇతర దేశీయులు, ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ సరియైన వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదని అందరూ కొన్ని రోజుల్లోనే పెట్టుబడులు పెట్టకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇక్కడే శాశ్వతంగా ఉంటూ వ్యాపారాలు చేస్తున్న బడా బడా పారిశ్రామిక వేత్తలందరూ కూడా అదే దారిపట్టారు.. భారతదేశంలో కన్నా ఇతర దేశాలలో బిజినెస్‌ చెయ్యడానికి పన్నులు తక్కువగా ఉండడంతో అందరూ మళ్లీ విదేశీ బాట పడుతున్నట్లు తెలిసిపోతుంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా వారి కంపెనీలు మూసేసుకుంటూ దేశాన్ని వదిలి పోతున్నారని తెలిసినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం మేమున్నామనే భరోసా మాత్రం ఇవ్వడం లేదు. ఇక్కడ సరియైన భద్రత లేక, పట్టించుకునే వారు లేక నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెపుతున్నారు. భారతదేశంలో ఉన్నంతగా పన్నుల భారం మరెక్కడా లేవని ఏ వ్యాపారస్థునికైనా నాలుగు పైసలు మిగిలి, భద్రత ఉందనే భరోసా ఉంటేనే ఉంటారు కాని మనదేశంలో పరిశ్రమలు చేసే పారిశ్రామికవేత్తలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. . హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశంలో భారీగా సంపాయించుకున్న భారీ వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ విషయం కొన్ని దశాబ్దాలుగా మనకు వినిపిస్తున్న మాటే. లక్ష్మి మిట్టల్‌ సహా అనేకమంది బడా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు కూడా దేశంలో కోట్లాది రూపాయలు సంపాయించుకొని విదేశాలకు వెళ్లిపోయారు. విదేశాల్లో హీరోలుగా చలామణి అవుతున్న వీరందరిని మన రాజకీయ నేతలు జీరోలుగానో, లేక నెగెటివ్‌ పాత్రల్లోనో చిత్రీకరిస్తున్నారు. వాస్తవ విషయాలను వదిలిపెట్టి వారు పలాయనం చిత్తగించారని దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో చిత్తశుద్ది చూపడం లేదని మనవాళ్లు తీవ్ర ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తున్నారు. ఐతే వాస్తవ విషయాన్ని మాత్రం రాజకీయ నాయకులు విస్మరిస్తుండడం ఇప్పుడు చాలా అవసరం. అసలు విషయాలను గమనిస్తే మన దేశంలో సంపన్నవర్గాలపై పన్నుల భారం చాలా ఎక్కువగానే ఉంది. వ్యాపారులు చేసే వారు వస్తున్న రాబడికి కూడా పన్నులు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారు వంద రూపాయలు సంపాదిస్తే నలభై మూడు రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వమే తన ఖాతాలో వేసుకుంటుంది. మరీ ఈ పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారిపోయింది. బ్రిటన్‌ సహా సింగపూర్‌ తదితర దేశాల్లో పారిశ్రామిక వేత్తలపై పన్నుపోటు పెద్దగా లేదు.

విదేశాల్లో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు..

విదేశాలలో ఉపాధిని పెంచే క్రమంలో పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వమే నేరుగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎంత ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తారో ఆయా పారిశ్రామికవేత్తలపై అంత తక్కువగా పన్నుపోటు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మన దేశానికి చెందిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు, ఇతర దేశాలకు వెళ్లి పరిశ్రమలు స్థాపిస్తున్నారు. గణనీయంగా వ్యాపారాలను వృద్ది చేసుకుంటున్నారు. పైగా ఆయా దేశాల్లో మౌలిక సదుపాయాలు, అవినీతి రహిత ప్రభుత్వాలు ఉండడం వీరికి కలిసి వస్తున్న ప్రధాన అంశంగా మారిపోయింది. అదే సమయంలో కాలుష్య నియంత్రణ మండలికి కూడా వారు అధిక ప్రాధాన్యం ఇస్తారు. స్వచ్చమైన గాలి, నీరు కూడా లభ్యమవుతాయి. మన దేశంలో అడుగడుగునా ట్రాఫిక్‌, పర్యావరణమంతా రోజురోజుకు విషతుల్యమే, చేసేది చిన్న వ్యాపారమా, పెద్ద వ్యాపారమా అనేది ఎవ్వరూ చూడరు. అందరికి మామూళ్లు కావాలి. అందరిని ప్రత్యేకంగా చూడాలి. పరిశ్రమలు స్థాపించేవారికి భద్రత ఉండదు. పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చేవారు లేరు. అందుకే వ్యాపారం చేసేదే నలుగురికి ఉపాధి కల్పించడంతో పాటు ఆనందంగా ఉన్నామనే ఫీలింగ్‌ లేదు.. అందుకే ఒక్కొక్కరుగా ముళ్ల, మూట సర్దుకొని విదేశాలకు తరలిపోతున్నారు. భారతదేశంలో కన్నా ఇతర దేశాలలో అన్ని విధాలుగా పాజిటివ్‌ ఉన్నప్పుడు మన వాళ్లు విదేశాలకు వెళ్లి స్థిరపడితే తప్పేంటని మిగతా వారు అంటున్నారు. అందరూ అలాగే ఆలోచించి వెళ్లిపోతే మన దేశంలో పరిశ్రమలు కరవై, ఉపాధి అవకాశాలు కూడా భారీగా తగ్గే అవకాశముంది. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.. ఒక దేశం అభివృద్ది చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది పరిశ్రమలు, ఉపాధి అవకాశాలే. ప్రభుత్వం వాటినే పట్టించుకోకుండా వదిలేస్తే దేశ భవిష్యత్తే ఆగమ్యగోచరంగా మారే అవకాశంగా ఉంటుంది

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close