Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఈఎస్‌ఐ అవినీతిపరులపై చర్యలు తీసుకోలేం..

విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ నివేదిక చెల్లదు : ప్రిన్సిపల్‌ సెక్రెటరీ

  • ఔషధాల కుంభకోణంలో శశాంక్‌ గోయల్‌ పాత్ర ?
  • వందల కోట్ల రూపాయల నిధులున్నా సౌకర్యాలు లేని దుస్థితి.

ప్రభుత్వం ప్రజల సంక్షేమ కొరకు చేపట్టే కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వం ప్రజల సౌకర్యాల ఏర్పాటుకు విడుదల చేసే నిధులలో కానీ అవకతవకలకు పాల్పడ్డ వ్యక్తులపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను గుర్తించి శిక్షించడానికి గొప్ప ఉద్దేశంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ లో సుమారుగా రూపాయలు 466 కోట్ల మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత దోషులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక సమర్పించి ఏడు నెలలు గడిచిన చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశాంక్‌ గోయల్‌ను ఆదాబ్‌ హైదరాబాద్‌ సంప్రదించి వివరణ కోరగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాం, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక ఇచ్చిన ఏసీబీ, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఆశ్చర్యకరమైన వివరణ తెలిపారు. ప్రాణాంతకమైన రోగాలతో ఎంతోమంది కార్మికులు ఇబ్బంది పడుతున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశాంక్‌ గోయల్‌. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 2015, 2016, 2017, 2018 సంవత్సరాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించే అంతవరకు తన శాఖ పరిధిలో ఇంత భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది అని గుర్తించలేకపోయారు? లేకుంటే అవినీతి బాగోతం తెలిసినా కూడా తెలవనట్లు ఉన్నారా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా గత రెండు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ముఖ్య కార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ లో రూపాయలు 466 కోట్ల ఔషధాల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్న పట్టించుకోలేదని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. అనేకమార్లు రోగులు, రోగుల బంధువులు ఫిర్యాదు చేసినా కూడా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా ఐ ఎం ఎస్‌ సంచాలకులు దేవికారాణి, మరో ఐదుగురిపై చర్యలు తీసుకోవడానికి నిర్లక్ష్యం చేయడంతో ఔషధాల కొనుగోలులో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పాత్ర ఉన్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి.

కనీస వసతులు లేని డిస్పెన్సరీలు

హైదరాబాద్‌ రీజియన్‌లో మొత్తం 53 డిస్పెన్సరీలు ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 70 డిస్పెన్సరీలు ఉన్నాయి. కార్మిక రాజ్య బీమా చికిత్సాలయం లో గత ఆరు నెలల నుండి మందులు లేక రోగులు ఎంతో ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు’ ఉదయం 9 గంటల వరకు రావాల్సిన డాక్టర్లు 10:30 గంటలు దాటినా కూడా చికిత్సాలయనికి రావడం లేదు. రోజు డబీర్‌ పుర, యాకుత్పురా డిస్పెన్సరీ కి అవుట్‌ పేషంట్‌ లు సుమారుగా 200 మంది వివిధ దూర ప్రాంతాల నుండి రావడం జరుగుతుంది. రోగులకు డిస్పెన్సరీ కి రావడానికి రెండు వందల రూపాయలు ఆటో ఖర్చు అవుతుందని . డిస్పెన్సరీ పై అంతస్తులో ఉండడంతో మెట్ల ద్వారా పైకి ఎక్కడానికి రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం హాస్పిటల్లో లిఫ్ట్‌ సౌకర్యం కానీ, విల్‌ చైర్‌ సదుపాయం కానీ, పేషెంట్లకు సహకరించడానికి కనీసం వార్డ్‌ బాయ్‌ లేకపోవడం శోచనీయం. డిస్పెన్సరీ లలో మెరుగైన వైద్య సేవలు కానీ, వైద్య పరీక్షలు కానీ చేయడం లేదని , ఇక్కడికి వచ్చినా కూడా మళ్లీ వైద్య పరీక్షకు డయాగ్నస్టిక్‌ సెంటర్లలో వెళ్ళ వలసి వస్తుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

గత ఆరు నెలల నుండి పూర్తిస్థాయిలో మందులు ఇవ్వడం లేదు డిస్పెన్సరీ కి రావడానికి 200 రూపాయలు ఖర్చవుతుంది . ఇన్ఛార్జి మెడికల్‌ అధికారికి ఫిర్యాదు చేసి ఆర్నెల్లు అవుతున్న ఈరోజు వరకు పూర్తిస్థాయిలో మందులు మాత్రం అందలేదు. మా ఆర్థిక పరిస్థితి బాగా లేక ఇక్కడ వస్తే ఉచితంగా మందులతో పాటు చికిత్స అందుతుందని భావించి వస్తున్నాము కానీ సరైన మందులు లేక ఆరోగ్యం క్షీణిస్తోంది……. షేక్‌ గఫర్‌

సారూ… మా కార్మికుల బాధ పట్టించుకోండి…. పేషంట్‌ సత్యనారాయణ

70 సంవత్సరాల వయసులో ఈ డిస్పెన్సరీ కి మందుల కోసం డెబ్బై సార్లు వచ్చినా కూడా షుగర్‌ పేషెంట్ల మందులు రాలేదని దవాఖానాల్లో అంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేక దవాఖానా లో ఉచితంగా వైద్య సేవలు, మందులు అందుతాయని ఇక్కడికి వస్తే మందులు లేవని అంటున్నారు. ముఖ్యమంత్రి సారు మా పేద కార్మికుల బాధ పట్టించుకొని మాకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు, మందులు లభ్యమయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. అవినీతికి పాల్పడ్డ దోషులను శిక్షించాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close